Begin typing your search above and press return to search.

అప్పుడే రాజకీయ రంగు పులిమేస్తున్నారా?

By:  Tupaki Desk   |   24 Jan 2017 10:45 AM GMT
అప్పుడే రాజకీయ రంగు పులిమేస్తున్నారా?
X

ఏపీకి ప్రత్యేక హోదా ఐదేళ్లు సరిపోదు - పదేళ్లు కావాలి అని పార్లమెంట్ సాక్షిగా పోరాడిన వారు... ఎన్నికల అనంతరం "ప్రత్యేక హోదా సంజీవని కాదు - హోదా కంటే ప్యాకేజీ సూపర్ గా ఉంటుంది" అంటూ మాట మార్చిన అనంతరం "ఏపీకి ప్రత్యేకహోదా" అంశానికి ప్రస్తుత అధికార పక్షాలు ఇస్తున్న ప్రాధాన్యం ఎంతో అర్ధమైపోయింది. ఈ సమయంలో ఏపీ ప్రతిపక్షం కాస్త చొరవతీసుకుని పోరాటాలు - బహిరంగ సభలు పెట్టి హోదా ప్రాముఖ్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ - తద్వారా ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చే పనికి పూనుకుంది. ఇదే సమయంలో మూడు బహిరంగ సభలు - ట్విట్లతో పవన్ ఈ పోరాటానికి మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలో విశాఖ ఆర్కే బీచ్ లో జనవరి 26న యువత ఒక ఆందోళన తలపెట్టింది. అయితే ఈ ఆందోళనకు, ఈ ఉద్యమానికి అప్పుడే రాజకీయ రంగు పులిమేసే దిశగా కొన్ని శక్తులు తమ కార్యచరణ మొదలుపెట్టేశాయి.

తమిళనాడులో జల్లికట్టును నిషేధించడాన్ని అక్కడి యువత తీవ్రంగా వ్యతిరేకించి పోరాటం చేయడం - ఫలితంగా కేంద్రం దిగొచ్చి.. ఆర్డినెన్స్ రూపంలో తమిళులకు ఉపశమనం కలిగించడం తెలిసిందే. ఇదే పోరాట స్పూర్తితో ఏపీకి ప్రత్యేక హోదాను సాధిస్తామని యువత నినదిస్తోన్న క్రమంలో వారికి మద్దతుగా ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు - ముఖ్యంగా ఏపీ ప్రతిపక్షం - జనసేన లతోపాటు సినీ రంగంలోని కొందరు హీరోల నుంచి మంచి మద్ధతు లభించింది. దీంతో ఆర్కే బీచ్ లో ఆందోళన సక్సెస్ అయ్యే సూచనలు కనిపించాయి! ఇంతవరకూ అంతా బాగుంది అనుకుంటున్న దశలో... ఈ ఉద్యమానికి, ఆందోళనకు రాజకీయ రంగు పులిమే పనికి పూనుకున్నాయి కొన్ని శక్తులు.

వారి వారి రాజకీయ స్వార్ధమో - వ్యక్తిగత ఆర్థిక ప్రయోజనాలో.. ఏమి కారణమో తెలియదు కానీ... ఏపీ యువత ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆర్కే బీచ్ కార్యక్రమానికి ఏపీ ప్రతిపక్షం రాజకీయ రంగు పులుముతుందంటూ ఒక వర్గం మీడియా బురదజల్లే కార్యక్రమానికి తెరలేపింది! దీనివల్ల వైకాపాతోపాటు మిగిలిన రాజకీయ పార్టీలకు ఈ రకమైన ఆలోచన లేకపోయినా కావాలని గిచ్చి, రెచ్చగొట్టినట్లు కథనాలు వండి వడ్డించేస్తోంది. ఇలాంటి చిన్న చిన్న సమస్యలు నిజంగా ఉన్నప్పటికీ వాటి సంగతి పక్కనపెట్టి "ఆర్కే బీచ్" కార్యక్రమానికి మరింత మద్దతు కూడగడుతూ, మొండికెత్తిపోయిన కొన్ని రాజకీయ పార్టీలను మేల్కొలిపే దిశగా ఆయా మీడియా సంస్థలు పనిచేయాలని పలువురు భావిస్తున్నారు. అందరి లక్ష్యం "ప్రత్యేక హోదా" తప్ప... రాజకీయ ప్రయోజనాలు, ఆయా రాజకీయ పార్టీలకు మద్దతిస్తున్న మీడియా ప్రయోజనాలు కాదని సదరు మీడియా పెద్దలు గ్రహించాలని ఏపీ యువత కోరుకుంటుంది!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/