Begin typing your search above and press return to search.

ఆ విద్యార్థిని బాబుకు షాకిచ్చింది

By:  Tupaki Desk   |   21 Oct 2016 6:38 AM GMT
ఆ విద్యార్థిని బాబుకు షాకిచ్చింది
X
ఇటీవ‌ల జ‌రిగిన ఓ కార్యక్ర‌మంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యార్థుల‌తో ముచ్చ‌టిస్తూ ఒకింత సంబ‌ర‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. బాబును ప్రధాన‌మంత్రిగా చూడాల‌ని ఉంద‌ని ఓ విద్యార్థి పేర్కొన‌గా... అందుకు బాబు ముసిముసి న‌వ్వుతూ త‌న‌కు ఆ ఆస‌క్తి లేద‌ని చెప్పారు. అయితే తాజాగా మ‌రో విద్యార్థి బాబుకు నిజంగా షాక్ ఇచ్చింది.విశాఖ ఆంధ్రా యూనివ‌ర్సిటీలో డిజిటల్ క్లాస్ రూంల ప్రారంభోత్సవం అనంతరం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని విద్యార్థులతో చంద్ర‌బాబు స్కైప్ ద్వారా మాట్లాడారు. ఈ క్ర‌మంలో విశాఖకు చెందిన కొంతమంది విద్యార్థులతో మాట్లాడించగా ఓ విద్యార్థిని ప‌రిపాల‌న తీరుపై ఘాటుగా స్పందించింది

విశాఖకు చెందిన ఒక పాఠశాల విద్యార్థిని చంద్ర‌బాబుతో స్కైప్‌లో మాట్లాడుతూ అన్నిచోట్లా లంచాలు ఎక్కువగా తీసుకుంటున్నారని ఆరోపించారు. ఇక్కడ కూడా కొంతమంది ఉన్నారని అనడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా అక్కడ ఉన్న వారు కంగుతిన్నారు. లంచాల కారణంగా కొంతమంది ఉన్నత విద్య చదవలేని పరిస్థితి ఏర్పడుతోందని, కొత్తగా కళాశాలలు ఏర్పాటు చేయలేని స్థితి ఉందని ఆ విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేసింది. మరో విద్యార్థి మాట్లాడిన అనంతరం సీఎం దీనిపై వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు మాట్లాడుతూ టెక్నాలజీని ఉపయోగించుకుని రియల్ టైమ్‌లో పర్యవేక్షిస్తున్నామని, సాంకేతిక పరిజ్ఞానంలో అవినీతిని పూర్తిగా అడ్డుకట్టవేయవచ్చన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు గతంలో తరగతులకు రాకపోయినా తెలిసేది కాదని, కానీ బయోమెట్రిక్ అటెండెన్సును ప్రవేశపెట్టడం ద్వారా ఆ అవకాశం లేకుండా చేశామని బాబు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడ వల్ల జవాబుదారీతనం, శ్రద్ధ పెరిగిందని వివరించారు. ఈ-ఆఫీస్ విధానం వల్ల ఫైళ్ల పెండింగ్ లేకుండా చూస్తున్నామన్నారు. పిల్లలందరికీ శక్తివంతమైన ప్రయోజనాలు లభించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. డిజిటల్ క్లాస్ రూమ్‌ల వల్ల టీచర్ పోస్టులు పోవని, టీచర్లు ఉండాలని బాబు అన్నారు. టీచరు చెప్పిన దానికి అదనంగా ఈ డిజిటల్ క్లాస్ రూమ్ ఉపయోగపడుతుందన్నారు.ప్రభుత్వ పథకాలు అర్హులకే చేరేలా న్యాయం చేయవచ్చన్నారు. విద్యార్థిని లంచాలు ఎక్కువగా తీసుకుంటున్నారని సాక్షాత్తు ముఖ్య‌మంత్రికే ఫిర్యాదు చేయ‌డం రాష్ట్రంలోని ప‌రిస్థితికి అద్దం ప‌డుతోంద‌ని పలువురు పేర్కొంటున్నారు.