Begin typing your search above and press return to search.

ఏపీ నేత‌ల‌కు గ‌వ‌ర్న‌ర్ చిక్కులు

By:  Tupaki Desk   |   5 Oct 2017 8:02 AM GMT
ఏపీ నేత‌ల‌కు గ‌వ‌ర్న‌ర్ చిక్కులు
X
రెండు తెలుగు రాష్ట్రాలకు గ‌వ‌ర్న‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న న‌ర‌సింహ‌న్‌పై ఒక కొత్త ఆరోప‌ణ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గ‌డిచిన కొంత‌కాలంగా ఏపీ నేత‌లు.. ఉన్న‌తాధికారుల మ‌ధ్య‌న న‌లుగుతున్న చ‌ర్చ ఇప్పుడు వార్త‌గా మారి బ‌య‌ట‌కు వ‌చ్చింది. గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌ ను క‌లిసిన ఆంధ్రోళ్ల‌కు.. ఆయ‌న నోటి నుంచి కుశ‌ల ప్ర‌శ్న‌ల కంటే కూడా ఖాళీ మాట‌లే ఎక్కువ‌గా వ‌స్తున్నాయ‌ని చెబుతున్నారు.

ఇంత‌కీ ఖాళీ మాట‌లేంట‌న్న సందేహం వ‌చ్చిందా? అక్క‌డికే వ‌స్తున్నాం. గ‌వ‌ర్న‌ర్ నర‌సింహ‌న్‌ ను వివిధ సంద‌ర్భాల్లో క‌లిసే ఏపీ అధికార‌ప‌క్ష నేత‌ల‌కు.. ఉన్న‌తాధికారుల‌ను ఉద్దేశించి త‌ర‌చూ.. హైద‌రాబాద్ లో ఏపీ ప్ర‌భుత్వ అధీనంలో ఉన్న భ‌వ‌నాల్ని ఎప్పుడు ఖాళీ చేస్తార‌ని అడుగుతున్న‌ట్లుగా చెబుతున్నారు.

గ‌వ‌ర్న‌ర్ అధికారిక నివాస‌మైన రాజ్ భ‌వ‌న్ లో నిర్వ‌హించే ఎట్ హోం కార్య‌క్ర‌మం మొద‌లుకొని.. అధికారిక కార్య‌క్ర‌మాల వ‌ర‌కు అన్ని చోట్లా.. అన్ని వేళ‌ల్లోనూ ఏపీ ప్ర‌భుత్వ అధీనంలో ఉన్న భ‌వ‌నాల్ని తెలంగాణ ప్ర‌భుత్వానికి ఎప్పుడు అప్ప‌గిస్తార‌న్న మాట ఆయ‌న నోటి నుంచి వ‌స్తుంద‌ని చెబుతున్నారు. విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం.. హైద‌రాబాద్ లో ఏపీ స‌ర్కారుకు అప్ప‌గించిన భ‌వ‌నాలు ప‌దేళ్ల వ‌ర‌కూ వారి నియంత్ర‌ణ‌లో ఉండ‌టానికి చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన హ‌క్కు ఉన్న‌ప్ప‌టికీ..ఖాళీ ఎప్పుడు చేస్తార‌న్న మాట గ‌వ‌ర్న‌ర్ నోటి నుంచి త‌ర‌చూ రావ‌టంపై ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు.

విభ‌జ‌న జ‌రిగిన కొద్ది కాలానికే ఏపీ సీఎం చంద్ర‌బాబుతో స‌హా స‌చివాల‌య సిబ్బంది అంతా ఏపీకి వెళ్లిపోయిన సంగ‌తి తెలిసిందే. అయితే.. భ‌విష్య‌త్ అవ‌స‌రాల దృష్ట్యా భ‌వ‌నాల్ని త‌మ కిందనే ఏపీ ప్ర‌భుత్వం ఉంచుకుంది. ఏపీ సీఎం చంద్ర‌బాబు హైద‌రాబాద్‌ కు వ‌చ్చిన వేళ‌ల్లో లేక్ వ్యూ అతిథి గృహంలో బ‌స చేస్తున్నారు. హైద‌రాబాద్ లో ఉన్న‌ప్పుడు త‌న క్యాంప్ కార్యాల‌యంగా బాబు వాడుకుంటున్నారు. మ‌రోవైపు ఏపీ అధికారులు ప‌లువురు వివిధ సంద‌ర్భాల్లో హైద‌రాబాద్‌ కు వ‌చ్చిన‌ప్పుడు త‌మ కింద ఉన్న భ‌వ‌నాల్ని వినియోగించుకుంటున్నారు.

హైకోర్టు పనుల మీద కానీ.. ఇత‌ర ప్ర‌ముఖుల్ని క‌ల‌వ‌టానికి కానీ వ‌చ్చిన‌ప్పుడు చ‌ర్చ‌ల కోసం త‌మ‌కు కేటాయించిన భ‌వ‌నాల్ని వాడుతున్నారు. ఇన్ని అవ‌స‌రాలు ఉండ‌టం.. హ‌క్కుగా ప‌దేళ్లు వాడుకునే వీలు ఉండ‌టంతో భ‌వ‌నాల్ని ఖాళీ చేయ‌టం లేదు. ఇదిలా ఉంటే.. గ‌వ‌ర్న‌ర్ మాత్రం ఇందుకు భిన్నంగా ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు ఎప్పుడు క‌నిపించినా భ‌వ‌నాల్ని ఖాళీ చేయాల‌ని కోరుతున్నార‌ని.. ప‌దే ప‌దే త‌న మాట‌ల‌తో ఒత్తిడి తెస్తున్నార‌ని వాపోతున్నారు. భ‌వ‌నాల ఖాళీ విష‌యంలో తెలంగాణ స‌ర్కారుతో పోలిస్తే.. గ‌వ‌ర్న‌ర్ తీరును భ‌రించ‌లేక‌పోతున్నార‌ట‌. త‌మ అవ‌స‌రాల గురించి ప‌దే ప‌దే చెప్పినా.. ఆయ‌న మాత్రం ఖాళీ మాట‌ను వ‌ద‌ల‌టం లేద‌ని అధికారులు.. నేత‌లు నోట వినిపిస్తోంది.

హైద‌రాబాద్ లో ఏపీకి తాత్కాలిక వ‌స‌తిగా ఉప‌యోగ‌ప‌డేందుకే మాత్ర‌మే కార్యాల‌యాలు కేటాయించ‌ర‌ని.. వాటి అవ‌స‌రం ఇప్పుడు లేదు క‌దా? వాటిని ఖాళీ చేసి అప్ప‌గించండ‌ని ప్ర‌తిసారీ అడుగుతున్న‌ట్లుగా చెబుతున్నారు. భ‌వ‌నాల ఖాళీ విష‌యంలో గ‌వ‌ర్న‌ర్ తీరు ఇలా ఉంటే.. ఆస్తుల విభ‌జ‌న విష‌యంలో న్యాయం చేయాల‌న్న‌ప్పుడు మాత్రం ఆ విష‌యాల్ని కేంద్ర‌మే చూసుకుంటుంద‌న్న మాట చెప్ప‌టం గ‌మ‌నార్హం. హైద‌రాబాద్ భ‌వ‌నాల విష‌యంలో ప్ర‌త్యేక ఆస‌క్తి ప్ర‌ద‌ర్శిస్తున్న గ‌వ‌ర్న‌ర్‌.. రెండు రాష్ట్రాల మ‌ధ్య నెల‌కొన్న అన్ని వివాదాల మీద ఇదే ఉత్సాహాన్ని ప్ర‌ద‌ర్శిస్తే బాగుంటుంద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. త‌ట‌స్థంగా ఉండాల్సిన గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌హార‌శైలి అందుకు భిన్నంగా ఉండ‌టం స‌రికాద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది.