Begin typing your search above and press return to search.

అమరావతికి రాలేం.. వీఆరెస్ ఇచ్చేయండి

By:  Tupaki Desk   |   4 May 2016 8:14 AM GMT
అమరావతికి రాలేం.. వీఆరెస్ ఇచ్చేయండి
X
ఏపీ కొత్త రాజధాని అమరావతికి వెళ్లేందుకు కొందరు ఉద్యోగులు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. ఎన్ని అదనపు సౌకర్యాలు కల్పించినా కూడా తాము అక్కడి వచ్చే ప్రసక్తే లేదని అంటున్నారు. కావాలంటే ఉద్యోగం మానేస్తామని చెబుతున్నారు. అందుకోసం ఏకంగా స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకుంటున్నారట.

జూన్ చివరి నాటికి ఏపీ పాలన మొత్తం నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి తరలిపోనుంది. జూన్ ఆఖరు నాటికి నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణం దాదాపుగా పూర్తి కానుంది. ఆ వెంటనే సెక్రటేరియట్ లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలను అమరావతికి తరలించేందుకు ఏపీ సర్కారు సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో ఉద్యోగులకు 30 శాతం అదనపు హెచ్ ఆర్ ఏతో పాటు వారికి ఐదు రోజుల పని విధానాన్ని సర్కారు ప్రవేశపెట్టనుంది. ప్రభుత్వ కల్పిస్తున్న అదనపు సౌకర్యాలతో అమరావతికి వెళ్లేందుకు మెజారిటీ ఉద్యోగులు సంసిద్ధత వ్యక్తం చేసినా... కొంతమంది ఉద్యోగులు మాత్రం అక్కడికి వెళ్లేందుకు ససేమిరా అంటున్నారు. ఉద్యోగం వదులుకోవడానికైనా సిద్ధమే కాని అమరావతికి తరలివెళ్లేది లేదని చెబుతున్న ఉద్యోగుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది.

అమరావతికి శాఖలను - ఉద్యోగులను తరలించే పని ముమ్మరం అవుతున్న నేపథ్యంలో ఇప్పటికే స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) దిశగా పలువురు దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో ఆరుగురి వీఆర్ ఎస్ కు ఆర్థిక శాఖ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసింది. మరో పది దాకా వీఆర్ ఎస్ దరఖాస్తులు ఆ శాఖ వద్ద పెండింగ్ లో ఉన్నాయట. రిటైర్ మెంట్ కు సమీపంలో ఉన్నవారే ఈ తరహాలో వీఆర్ ఎస్ బాట పడుతున్నట్లు సమాచారం.

చరమాంకంలో వసతుల లేమి ఉన్న ప్రదేశానికి వెళ్లి ఇబ్బందులు పడేకన్నా, ఉద్యోగానికి రాజీనామా చేయడమే మేలన్న భావనతోనే వారంతా వీఆర్ ఎస్ కు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఏళ్ల తరబడి హైదరాబాద్ సచివాలయంలో పని చేస్తూ ఇక్కడ రెండు మూడు ఇళ్లు కట్టుకుని, వివిధ వ్యాపారాలు చేసుకుంటున్నవారు కూడా ఇక్కడి నుంచి వెళ్లేందుకు ఇష్టపడడంలేదు. దీంతో ఇప్పటికే సుమారు 25 మంది వరకు వీఆరెస్ పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. మరికొందరు అక్కడికి వెళ్లినా కూడా లాంగ్ లీవ్ పెట్టుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.