Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ ను ఓడించిన చంద్ర‌బాబు!

By:  Tupaki Desk   |   11 July 2018 4:27 AM GMT
కేసీఆర్‌ ను ఓడించిన చంద్ర‌బాబు!
X
గ‌త ఏడాది ఒకే స్థానంలో ఉన్నది కాస్తా.. ఏడాది తిరిగేస‌రికి తెలంగాణ‌ను వెన‌క్కి నెట్టి ఏపీ ముందుకు వెళ్లింది. అత్యంత సుల‌భ‌త‌ర‌మైన వ్యాపార విధానాల ర్యాంకింగ్ లో ఏపీ నెంబ‌ర్ 1 స్థానంలో నిలిచింది. 2016 జులై నుంచి ఈ ఏడాది జులై వ‌ర‌కు వివిధ ప్ర‌మాణాల ఆధారంగా రూపొందించిన ఈ జాబితాను ప్ర‌పంచ బ్యాంక్‌.. కేంద్ర ప్ర‌భుత్వానికి చెందిన పారిశ్రామిక విధానం.. ప్రోత్సాహ‌క విభాగం మంగ‌ళ‌వారం తుది ర్యాంకుల్ని వెల్ల‌డించింది.

ఇందులో ఏపీ మొద‌టి స్థానంలో నిల‌వ‌గా.. తెలంగాణ రాష్ట్రం రెండో స్థానంలో నిలిచింది. అక్ష‌ర క్ర‌మంలో మొద‌ట‌గా ఉండే ఏపీ... ర్యాంకింగ్‌ లోనే తొలిస్థానంలో నిల‌వ‌టం గ‌మ‌నార్హం. జాతీయ‌.. అంత‌ర్జాతీయ పెట్టుబ‌డుల‌కు అత్యుత్త‌మ గ‌మ్య‌స్థానంగా ఏపీ నిలిచింది. గ‌త ఏడాది ఏపీ.. తెలంగాణ రాష్ట్రాలు రెండూ స‌మాన‌మైన మార్కుల‌తో అగ్ర‌స్థానాన్ని పంచుకోగా.. .ఈసారి కేవ‌లం 0.09 మార్కుల తేడాతో తెలంగాణ‌ను రెండో స్థానంలో నెట్టి ఏపీ మొద‌టిస్థానాన్ని సొంతం చేసుకుంది.

ర్యాంకును ప్ర‌భావితం చేసే మార్కుల విష‌యంలో సంస్క‌ర‌ణ‌ల‌కు 99.73 శాతం.. పారిశ్రామిక‌వేత్త‌ల అభిప్రాయాల క్రోడీక‌ర‌ణ‌కు 86.50 శాతం స్కోర్ ల‌భించింది.. మొత్తంగా 98.42 శాతం మార్కుల్ని ఏపీ సాధించింది. ఆస‌క్తిక‌ర‌మైన అంశం ఏమిటంటే.. సంస్క‌ర‌ణ‌ల అమ‌లులో నూటికి నూరుశాతం స్కోర్‌ను తెలంగాణ సాధించినా.. పారిశ్రామిక‌వేత్త‌ల అభిప్రాయాల క్రోడీక‌ర‌ణ‌లో 83.95 శాతం మార్కులు మాత్ర‌మే తెలంగాణ‌కు ల‌భించ‌టంతో.. 98.33 స్కోర్ తో తెలంగాణ రెండో స్థానాన్ని స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది.

ఏపీ.. తెలంగాణ స్కోరుల‌ను చూస్తే..కేవ‌లం 0.09 శాతం మాత్ర‌మే తేడా ఉండ‌టం క‌నిపిస్తుంది. దేశంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన గుజ‌రాత్.. మ‌హారాష్ట్ర.. త‌మిళ‌నాడు రాష్ట్రాల్ని వెన‌క్కి నెట్టి రెండు తెలుగు రాష్ట్రాలు పోటాపోటీగా మొద‌టి.. రెండు స్థానాల్లో నిల‌వ‌టం విశేషంగా చెప్ప‌క త‌ప్ప‌దు.

ఇక‌.. మూడో స్థానాన్ని బీజేపీ ఏలుబ‌డిలో ఉన్న హ‌ర్యానా సొంతం చేసుకోగా.. ప్ర‌ధాని మోడీ స్వ‌రాష్ట్రమైన గుజ‌రాత్ ర్యాంకింగ్స్ లో ఐదో స్థానంతో స‌రి పెట్టుకోవాల్సి వ‌చ్చింది. పారిశ్రామికంగా ముందుండే రాష్ట్రంగా పేరున్న త‌మిళ‌నాడు ఏకంగా 15వ ర్యాంకును స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది. కీల‌క‌మైన 12 రంగాల‌కు సంబంధించి అమ‌లు చేస్తున్న నియంత్ర‌ణ ప్ర‌క్రియ‌.. విధి విధానాల ఆధారంగా సంస్క‌ర‌ణ‌ల అమ‌లు ఫ‌లితాల్ని అంచ‌నా వేశారు.

అయినా, అర్థం కాని విష‌యం ఏంటంటే... ఇంత అనుకూల వ్యాపార వాతావ‌ర‌ణం ఉన్న ఏపీకి ఒక‌టీ అరా తప్పించి భారీ ఎత్తున ప‌రిశ్ర‌మ‌లు త‌ర‌లివ‌చ్చిన దాఖ‌లాలే లేవు. ఇది ఎవ‌రో చెప్పింది కాదు. ప్ర‌భుత్వ లెక్క‌ల ప్ర‌కారం పెట్టుబ‌డుల కోసం చేసుకున్న ఎంవోయు ల‌లో ప‌రిశ్ర‌మ‌లు ప్రారంభించిన వాటి పెట్టుబ‌డుల విలువ యాభై వేల కోట్లు కూడా దాట‌లేదు. ఈ ప‌రిణామాల‌కు రాజ‌కీయ కార‌ణాలే ఎక్కువ అంటున్నారు. అంటే... ఈ ర్యాంకింగ్స్‌లో రాజ‌కీయ వాతావ‌ర‌ణం కూడా క‌లిపి చూస్తే ఏపీ కింద‌కు వెళ్తుందేమో మ‌రి!