Begin typing your search above and press return to search.

బాధ కంటే మైలేజీ బాధనే ఎక్కువైందే

By:  Tupaki Desk   |   30 July 2016 6:43 AM GMT
బాధ కంటే మైలేజీ బాధనే ఎక్కువైందే
X
ఏపీ ప్రత్యేక హోదా అంశంపై కేంద్రం తేల్చేసిన నేపథ్యంలో మోడీ సర్కారు తీరుపై ఏపీ ముఖ్యనేతలు మండిపడే కన్నా.. ఈ ఇష్యూలో మైలేజీ లెక్కలు మాట్లాడుకోవటం ఆసక్తికరమైన అంశంగా చెప్పాలి. రాష్ట్రానికి జరిగిన తీవ్రమైన అన్యాయాన్ని ప్రశ్నించే విషయంలో వెనుకా ముందు ఆడుతున్న రాజకీయ పక్షాలు.. మైలేజీ విషయంలో మాత్రం కిందామీదా పడుతున్నాయి. ఎవరూ ఊహించని రీతిలో బిల్లు పెట్టి రచ్చ చేసిన కాంగ్రెస్.. ప్రైవేటు బిల్లుతో ఓపెనింగ్ షాట్ కొట్టటమే కాదు.. జైట్లీ సమాధానం మీద నిరసన వ్యక్తం చేస్తూ వాకౌట్ చేసి క్లోజింగ్ షాట్ కొట్టటం తెలిసిందే.

కాంగ్రెస్ ఈ రీతిలో రియాక్ట్ అవుతుందని ఏ మాత్రం ఊహించని ఏపీ అధికారపక్షంతో పాటు.. ఏపీ విపక్షం కూడా తెగ ఫీలైపోతోంది. ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్ కు కమిట్ మెంట్ లేకున్నా.. వ్యూహాత్మకంగా వ్యవహరించిందని.. ఆ మాత్రం తెలివితేటల్ని తమ నేతలు ప్రదర్శించలేకపోయారన్న బాధను చంద్రబాబు లోగుట్టుగా వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. ఇక.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఫీలింగ్ కూడాఅదే రీతిలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

దురదృష్టకరమైన విషయం ఏమిటంటే.. ఎవరికి వారు.. మైలేజీ గురించి.. దాని లెక్కల గురించి మాట్లాడుకునే వారే కానీ.. ఏపీకి జరిగిన నష్టం.. ప్రత్యేక హోదా ఇవ్వమని మోడీ సర్కారు తేల్చేసిన నేపథ్యంలో కేంద్రం మెడల్ని ఎలా వంచాలి? ప్రత్యేక హోదా డిమాండ్ అమలు చేయించుకోవటం సాధ్యమేనా? ఈ అంశాన్ని ప్రాక్టికల్ లోకి తీసుకురావటానికి ఉన్న అవకాశాలు ఏమిటి? లాంటి ప్రశ్నల్ని వేసుకొని.. వాటికి సమాధానాలు వెతికే ప్రయత్నం చేయకపోవటంగా చెప్పాలి. ఈ పార్టీ ఆ పార్టీ అన్న తేడా లేకుండా అన్ని పార్టీలు ప్రత్యేక హోదా అంశాన్ని రాజకీయ లబ్థికి ఉపయోగపడే అంశంగానే భావిస్తున్నారే తప్ప.. ఆంధ్రుల బతుకుల్ని మార్చుస్తుందని.. ఏపీ అభివృద్ధికి సాయంగా నిలుస్తుందన్న విషయాన్ని మాత్రం వారు పరిగణలోకి తీసుకోవటం లేదు. మైలేజీ మత్తులో నుంచి బయటకు వచ్చి ప్రజలకు లాభం చేకూర్చేలా.. వారి ప్రయోజనాలు దెబ్బ తినకుండా ఉండేలా ప్రణాళిక రూపొందిస్తే మంచిది. ఫలితం ఆలోచించకుండా పని చేసుకుంటూ పోతే ఫలితం దానంతట అదే వస్తుంది. కానీ.. అంత పెద్ద మనసు ఏపీ రాజకీయ పక్షాలకు ఉందా..?