Begin typing your search above and press return to search.

రేపటి నుంచే; హెల్మెట్ పై ఏపీలో కొత్త రూల్స్

By:  Tupaki Desk   |   31 July 2015 4:52 AM GMT
రేపటి నుంచే; హెల్మెట్ పై ఏపీలో కొత్త రూల్స్
X
ఏపీలో కొత్త రూల్స్ రానున్నాయి. మరో రోజులో ఏపీలోని 13 జిల్లాల్లోని ప్రజలు రోడ్డు మీద ద్విచక్రవాహనం మీద వెళ్లే వారు హెల్మెట్ ను తప్పనిసరిగా ధరించాల్సి ఉంటుంది. లేని పక్షంలో వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటారు.

ఆగస్టు 1 తేదీ నుంచి హెల్మెట్ వినియోగాన్ని తప్పనిసరి చేస్తూ ఏపీ సర్కారు నిర్ణయం తీసుకోనుంది. దీంతో పాటు.. మరో కీలకమైన నిర్ణయాన్ని చట్టం చేస్తున్నారు. దీని ప్రకారం.. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు.. గాయపడిన వారిని దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళితే.. వారికి అవసరమయ్యే చికిత్సను ఉచితంగా చేయాల్సి ఉంటుంది.

ప్రమాద తీవ్రతను అనుసరించి ఉచిత వైద్య సేవలతోపాటు.. వారికి శస్త్రచికిత్సలు చేయాల్సి వచ్చినా వెంటనే వాటిని పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రైవేటు ఆసుపత్రులు సైతం వీటిని పక్కాగా అమలు చేయాల్సి ఉంటుంది.

ఈ విషయంలో ఆసుపత్రులు ఏదైనా తప్పు చేసినా.. సేవలు అందించేందుకు నిరాకరించినా వాటికున్న అనుమతుల్ని రద్దు చేస్తారు. తాజా నిబంధన గురించి ప్రజల్లో.. ఆసుపత్రి వర్గాల్లో అవగాహన మరింత పెంచే దిశగా ప్రభుత్వం ప్రచారం చేయాలని నిర్ణయించింది. ఆపద కాలంలో ఉన్న వారికి.. తాజా నిబంధన ఎంతో సాయం చేస్తుందన్న భావన ఉంది. అయితే.. ప్రైవేటు ఆసుపత్రులు ఇలాంటి సేవలు చేసినందుకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాల్ని అందించేలా ప్రభుత్వం ఆలోచిస్తే.. ఈ నిబంధన పక్కాగా అమలు కావటమే కాదు.. ఏపీ సర్కారుకు పేరు ప్రఖ్యాతులు లభించటం ఖాయం.