Begin typing your search above and press return to search.

బాబు వ‌ట్టిమాట‌లు క‌ట్టిపెట్టి గ‌ట్టిమేలు త‌ల‌పెట్టు!!

By:  Tupaki Desk   |   22 Oct 2018 8:10 AM GMT
బాబు వ‌ట్టిమాట‌లు క‌ట్టిపెట్టి గ‌ట్టిమేలు త‌ల‌పెట్టు!!
X
కాస్త సానుకూల అంశం తెర‌మీద‌కు వ‌స్తే చాలు...అది ప్ర‌పంచంలో ఎక్కడ జ‌రిగినా...త‌న ఖాతాలో వేసుకోవ‌డం - దాని ఆధారంగా ఏళ్ల పాటు డ‌బ్బా కొట్టుకోవ‌డంలో టీడీపీ నేత‌ల‌ను మించిన వారు లేర‌నేది రాజ‌కీయ‌వ‌ర్గాల విశ్లేష‌ణ‌. సంద‌ర్భం ఏదైనా ఆ పార్టీ నాయ‌కుడు చంద్ర‌బాబు నాయుడు మొద‌లుకొని నేత‌లంతా చేసే తీరుతోనే ఇలాంటి విశ్లేష‌ణ‌లు తెర‌మీద‌కు వ‌స్తుంటాయి. అలా త‌మ‌కు మేలు చేసే దాన్ని ఓన్ చేసుకోవ‌డంలో ఎంతో ఆరాట‌ప‌డే టీడీపీ నేత‌లు తాజాగా రాష్ట్రం ప‌రువు గంగ‌పాలు అయిన ఉదంతంలో మాత్రం...కిక్కురుమ‌న‌కుండా ఉంటున్నార‌ని చెప్తున్నారు.

ఇంత‌కీ విష‌యం ఏంటంటే...అక్ష‌రాస్య‌త‌లో ఆంధ్ర‌ప్రదేశ్ 32వ స్థానంలో నిలిచింది. 67.4% అక్ష‌రాస్య‌త‌తో ఏపీ ఈ ప్లేస్‌ లో ఉండ‌గా...చిత్రంగా వెనుక‌బ‌డిన రాష్ర్టాలుగా పేరొంది ఒడిషా (73.18%) - చ‌త్తీస్‌ ఘ‌డ్ (71.4%) - త‌మిళ‌నాడు (80.33 %) క‌ర్నాట‌క (75.6%)తో ఏపీ కంటే ఎంతో ముందు ఉన్నాయి. త‌మ‌ పాల‌న గురించి డ‌బ్బా కొట్టుకోవ‌డంలో ఆరితేరిన చంద్ర‌బాబు స‌హా టీడీపీ నేత‌లు దీనిపై ఎందుకు స్పందించ‌డం లేద‌ని ప‌లువురు నెటిజ‌న్లు సూటిగా ప్ర‌శ్నిస్తున్నారు. ప్ర‌చారంపై దృష్టి త‌గ్గించుకొని భ‌విష్య‌త్‌ను నిర్దేశించే విద్య‌పై కార్యాచ‌ర‌ణ సిద్ధం చేయాల‌ని కోరుతున్నారు. బ‌డుగు - బ‌ల‌హీన‌వ‌ర్గాల చిన్నారులు ఎంద‌రో విద్య‌కు దూర‌మ‌వుతున్నా స‌ర్కారుకు ప‌ట్ట‌డం లేద‌ని - ప్ర‌భుత్వ విద్య‌ను నిర్వీర్యం చేసేలా స‌ర్కారు విధానాలు ఉన్నాయంటున్నారు. ప్రైవేటు బ‌డుల‌కు మేలు చేసేలా స‌ర్కారు విధానాలు ఉండ‌టం వ‌ల్లే ఇలాంటి ప‌రిస్థితి అని పేర్కొంటూ ఉద్యోగాలు ఎలాగూ క‌ల్పించ‌ని బాబు స‌ర్కారు క‌నీసం విద్య‌ను అయినా అందించేందుకు స‌హ‌క‌రించాల‌ని వ్యాఖ్యానిస్తున్నారు.