Begin typing your search above and press return to search.

ఆంధ్రోళ్లకు అన్యాయంలో అందరూ అందరే

By:  Tupaki Desk   |   30 July 2016 5:09 AM GMT
ఆంధ్రోళ్లకు అన్యాయంలో అందరూ అందరే
X
మళ్లీ అదే సీన్. ఏపీకి హ్యాండ్ ఇచ్చామన్న విషయాన్ని జైట్లీ రాజ్యసభ సాక్షిగా తేల్చి చెప్పిన వేళ.. దానిపై రియాక్షన్లు మొదలయ్యాయి. ఏపీ ముఖ్యమంత్రి.. ఏపీ విపక్ష నేత.. ఇలా ఒకరి తర్వాత ఒకరు స్పందించారు. అయితే.. అందరిలోనూ కామన్ గా కనిపించేది ఒక్కటే. అక్కడ జరిగింది.. దానికి బదులుగా మేం చెప్పాల్సింది చెప్పేశామనే. అంతే తప్ప.. ఇంత అన్యాయం చేస్తారా? ఈ అన్యాయంపై మా పోరాటం ఇది అన్న మాట ఒక్కటి లేదు. కార్యాచరణ ప్రకటించింది లేదు. భవిష్యత్ వ్యూహం అసలేలేదు. అలాంటప్పుడు మాట్లాడి ప్రయోజనం ఏమిటన్నది ఏపీ అగ్రనేతలకే తెలియాలి.

ముందుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో మొదలు పెడదాం. అక్కడెక్కడో.. వాళ్లెవరో తప్పు చేస్తే.. మాకీ ప్రత్యేక శిక్ష ఎందిరో అని సీఎం బీటు చూసే విలేకరులు తెగ ఫీలయ్యేలా చేశారు. హడావుడి ప్రెస్ మీట్ అని పెట్టేసి గంటల కొద్దీ తన వేదనను చెప్పుకొచ్చే చంద్రబాబుకు.. ఆయన చెప్పిందంతా రాయలేమని తెలిసినా విలేకరులు ఆయన చెప్పే మాటల్ని ఓపిగ్గా వింటూ.. ఆయన ఎప్పుడు వదిలిపెడితే అప్పుడు ఆ రోజు ఉద్యోగం పూర్తి చేద్దామని అనుకునే పరిస్థితి. అనుకున్నట్లే సుదీర్ఘంగా మాట్లాడిన చంద్రబాబు మాటల తర్వాత హడావుడిగా వెళ్లి.. బాబు ప్రెస్ మీట్ ను రాసేసిన విలేకరులు.. వారి చేత పని చేయించే మీడియా సంస్థలు తమ పని పూర్తి అయ్యిందని చేతులు దులుపుకున్నాయి.

ఫ్రాధాన్యత క్రమంలో భారీ ప్రయారిటీ ఇవ్వకపోతే లేనిపోని ఇబ్బందన్న ఉద్దేశంతో పెద్దపెద్ద నల్ల అక్షరాలతో.. బాబు మాటల మాదిరే పస లేని హెడ్డింగులు పెట్టేసి ఆ రోజుకు పని పూర్తి చేశారు. గమనించదగ్గ అంశం ఏమిటంటే.. ప్రముఖ దినపత్రికల్లో ఎక్కడా కూడా జరిగిన ఉదంతంపై ఒక్కటంటే ఒక్క రాజకీయ విశ్లేషణ లేదు. ఇలాంటి పరిస్థితికి కారణం ఎవరన్న విషయాన్ని చూచాయగా చెప్పే కథనాలు లేని పరిస్థితి. కేంద్రం ఏపీకి ఇంత అన్యాయం చేసిన దానికి జరిగే నష్టం గురించి ఒక్క మాట లేదు.

అధికారపక్షం.. మీడియాను వదిలేస్తే.. ఇక ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత. ఆయన గారిదో చిత్రమైన పరిస్థితి. కేంద్రం చేసిన అన్యాయానికి నిరసనగా ఏపీ బంద్ కు పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదాపై జేజేపీ.. టీడీపీ దుర్మార్గ వైఖరికి నిరసనగా బంద్ కు పిలుపునిచ్చిన జగన్.. ఆ విషయాన్ని మీడియాకు స్వయంగా చెప్పేందుకు సైతం టైం కుదర్లేదు. అందుకే కాబోలు.. ఆయనో ప్రకటన విడుదల చేసి పారేశారు. హోదా అంశం రాజ్యసభలో చర్చకు వస్తున్న వేళ.. దానిపై ఒక్కమాట కూడా మాట్లాడని జగన్.. అంతా అయ్యాక.. తీరుబడిగా ఏపీ బంద్ కు పిలుపునిచ్చేసి తన ఆవేదనను వెళ్లగక్కే ప్రయత్నం చేశారు.

వీరంతా ఇలా ఉంటే.. ఇక కాంగ్రెస్ పార్టీ నేతలు. గొంతుపిసికి చంపేసిన రాష్ట్రంపై తమకున్న కమిట్ మెంట్ ను చాటి చెప్పేందుకు ప్రైవేటు బిల్లును రాజ్యసభలో పెట్టారు. చేసిన పాపాన్ని కడిగేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని అనుకోవటం తప్పన్న విషయం కాంగ్రెస్ అధినేత్రి సోనియా.. ఆ పార్టీ యువరాజు రాహుల్ మౌనాన్ని చూస్తే.. జరిగేది ఏమిటన్న విషయంలో వారికి చాలా స్పష్టత ఉందన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. ఏపీకి అంత అన్యాయం చేస్తారా? మీ తీరు బాగోలేదంటూ ప్రధాని మోడీపై సోనియా.. రాహుల్ ఎందుకు దుమ్ము దులపరు? ఈ ప్రశ్నకు సమాదానం చెప్పే వారే ఉండరు.

వీరంతా ఒక ఎత్తు అయితే.. ఏపీ బీజేపీ నేతల తీరును ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉంది. వారికి రాష్ట్రప్రజలు.. ఏపీ రాష్ట్ర ప్రయోజనాలు అస్సలు అవసరం లేదు. కేంద్రంలోని మోడీ భజనలో తమ జీవితాన్ని తరింపచేసుకోవాలన్నట్లుగా వ్యవహరిస్తారు. తమను నమ్ముకున్న ప్రజలే తమ వెంట లేకుంటే.. మోడీ.. జైట్లీ.. వెంకయ్య లాంటి వాళ్లు ఎవరూ తమను కనీసం దేకరన్న విషయాన్ని వారు అస్సలు పట్టించుకోరు. అధినాయకత్వాన్ని కొలుస్తూ.. కీర్తిస్తూ కాలం గడిపేస్తారే తప్ప.. నమ్మిన ప్రజల్ని ముంచేలా చేస్తే.. వారి ఉసురు తగులుతుందన్న తరహా మాటలు చెప్పరు.

ఇంతమందిలో తప్పులు కనిపించాయి.. వారివే తప్పులా? ఆంధ్రోళ్లది లేదా? అని అడగొచ్చు. అక్కడికే వస్తున్నాం. రౌతు సరిగా ఉండే బండి బుద్ధిగా నడుస్తుందన్నట్లుగా.. నాయకుల నోటి మాటల్ని మార్చే సత్తా ప్రజలదే. తమ వర్తమానాన్ని.. భవిష్యత్ ను తీవ్రంగా ప్రభావితం చేసేలా మోడీ అండ్ కంపెనీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటే.. ఏదో సినిమా చూస్తున్నట్లుగా తన్మయం చెందే తత్వం నుంచి ఆంధ్రోళ్లు బయటకు రానంతవరకూ ఇలాంటివి నిత్యం జరుగుతూనే ఉంటాయి. ఆంధ్రోళ్లు తెలివైనోళ్లు.. తమలోని ఆగ్రహాన్ని నిగ్రహంతో ఉంచుకుంటారంటూ పొగిడేసే వారి మాటల మాయలో పడకుండా.. తమకు జరిగిన అన్యాయానికి కారణమైన ప్రతిఒక్కరిని నిలదీయాలి. నేతలకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వకూడదు. ముందు హోదా పని చేసుకురా.. తర్వాత మాటలు చెప్పు అని తేల్చి చెప్పాలి.

ఇందుకోసం రోడ్ల మీదకు రానక్కర్లేదు. ఆత్మహత్యలు చేసుకోనక్కర్లేదు. జస్ట్.. సహయ నిరాకరణ చేస్తే చాలు. ఎవరైనా రాజకీయ నాయకుడు (పార్టీ ఏదైనా సరే) సమావేశం ఏర్పాటు చేస్తే వెళ్లాలి. అక్కడికి వెళ్లి ప్రత్యేక హోదా మీద మౌనంగా ప్లకార్డు చూపించాలి. నిమిషం తర్వాత మాట్లాడకుండా వెనక్కి వచ్చేయాలి. క్షణాల్లో వేదిక మొత్తం బోసి పోవాలి. తమ కోసం నిజాయితీగా పోరాడుతున్నారు అన్నంత వరకూ ఇలానే చేయాలి. మరి అంత పని చేసే సత్తా ఆంధ్రోళ్లకు ఉందా?