Begin typing your search above and press return to search.

పవన్ చిత్తశుద్ధిపై జనంలో అనుమానాలు

By:  Tupaki Desk   |   2 Jun 2018 7:34 AM GMT
పవన్ చిత్తశుద్ధిపై జనంలో అనుమానాలు
X
చిరంజీవి అంటే తెలుగు రాష్ర్రాల్లో ఒకప్పుడు తిరుగులేని క్రేజ్. ఆ క్రేజ్‌ తోనే ఆయన పెట్టిన ప్రజారాజ్యం పార్టీపై జనం ఆశలు - అంచనాలు పెట్టుకున్నారు. చిరంజీవి కూడా బస్సులో రాష్ట్రమంతా తిరుగుతూ ఎక్కడికక్కడ ప్రజాసమస్యలను గుర్తిస్తూ.. అప్పటి పాలక - విపక్షాల అవినీతిని ప్రశ్నిస్తూ జనాన్ని ఆకట్టుకున్నారు. కానీ, ఎన్నికలు వచ్చేసరికి.. పార్టీని ఒక వ్యాపార కేంద్రంగా మార్చేశారు. సినిమా టిక్కెట్లు బ్లాకులో అమ్మినట్లుగా పార్టీ తరఫున ఎమ్మెల్యే - ఎంపీ టిక్కెట్లు అమ్ముకున్నారన్న ఆరోపణలున్నాయి. దాంతో... ఎంతోమంది అనర్హులు ఆయన పార్టీ నుంచి పోటీకి నిలిచారు. అంతవరకు ఆయన దేన్నైతే వ్యతిరేకిస్తూ మాట్లాడారో.. దేన్నైతే ప్రశ్నించారో అదే తరహా నేతలను తన పార్టీ నుంచి చట్ట సభలకు పంపించడానికి నిర్ణయించడంతో జనం ఆయన పార్టీని తిరస్కరించారు. దాంతో చచ్చీచెడి 18 సీట్లు సాధించిన ఆయన ఆ తరువాత ఏకంగా పార్టీనే అమ్మకానికి పెట్టేశారు. దాంతో ప్రజారాజ్యం పార్టీ ప్రజలకు ఏమాత్రం మేలు చేయకపోగా చిరంజీవికి మాత్రం కేంద్రంలో మంత్రి పదవి దక్కింది. అన్నిరకాలుగా గిట్టుబాటయింది. విభజన సమయంలో పరిస్థితులు అనుకూలంగా లేవని వదులుకున్నాడు కానీ లేదంటే సీఎం పదవి కూడా ఆయనకు దక్కేది. మొత్తానికి చిరంజీవి - ఆయన పార్టీ ప్రజారాజ్యం రెండూ జనాలను - ఎంతోమంది నేతలను నిలువునా ముంచేసినట్లయింది.

ఇప్పుడు ఆయన తమ్ముడు పవన్ కల్యాన్ జనసేన పార్టీతో ప్రజల్లో తిరుగుతున్నారు. ఆయన మాటలూ.. రాజకీయ లక్ష్యాలు అన్నీ ప్రజారాజ్యం నాటి రోజులే గుర్తుకు తెస్తున్నాయి. ఏ జిల్లాకు వెళ్తే అక్కడ ప్రజా సమస్యలను ప్రశ్నిస్తున్నారు. అక్కడి ప్రజాప్రతినిధులపై ఆరోపణలు చేస్తున్నారు. అంతా.. ప్రజారాజ్యం తరహాలోనే ఒకింత డ్రామాతో సాగుతోంది. కానీ.. ప్రజామోదం ఉన్న - ప్రజాపక్షపాతం ఉన్న నేతలెవరూ ఆయన వెంట కనిపించడం లేదు. అంతా... రాజకీయ లక్ష్యాలున్నవారు.. ఇప్పుడున్న పార్టీల్లో సీట్లు దొరికే అవకాశాల్లేనివారు. బడాబడా కేండిడేట్లే దర్శనమిస్తున్నారు.. ఆయనకు ఆశ్రయమిస్తున్నారు. దీనికితోడు పైకి కనిపించకపోయినా సామాజిక వర్గ నేతల సందడి. అంతా అప్పటి పరిస్థితే... అందుకే జనసేన తీరు చూస్తున్నవారంతా ఇది చిరంజీవి ప్రజారాజ్యానికి జిరాక్సేనంటున్నారు. ప్రజలు దీన్ని నమ్మితే ప్రజారాజ్యం చేతిలో మోసపోయినట్లే మళ్లీ మోసపోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

మరోవైపు ప్రస్తుతం విజయనగరంలో పర్యటిస్తున్న పవన్ అక్కడి టీడీపీ - వైసీపీ నేతలపై ఆరోపణలు మొదలుపెట్టారు. వైసీపీ - టీడీపీలు ఊళ్లను పంచుకుంటున్నాయన్నారు. జనసేన ఆవిర్భవించకపోతే వీరే దోచుకుంటారన్నారు. మరి.. ఇన్ని చెప్పిన పవన్ గత నాలుగేళ్లుగా టీడీపీతో కలిసి నడిచిన సమయంలో ఎన్ని ఊళ్లను తాను పంచుకున్నారు.. ఇంకా తానేమేమి పంచుకున్నారన్నదిమాత్రం చెప్పడం లేదు. అమరావతిలో తన ఇంటికి స్థలమెలా వచ్చింది... తన యాత్రలకు నిధులెవరు సమకూరుస్తున్నారు వంటివేమీ మాట్లాడడం లేదు. పైగా... 2019లో అధికారం తనదేనని పదేపదే చెబుతున్నారు. దీంతో టీడీపీ గుడిని మింగే రకమైతే ఈయన గుళ్లో లింగాన్నీ మింగే రకంలా కనిపిస్తున్నారని అంటున్నారు.