Begin typing your search above and press return to search.

ఆంధ్రోళ్లు బాబుతో డిస్ క‌నెక్ట్ అయ్యారా?

By:  Tupaki Desk   |   16 Dec 2018 4:32 AM GMT
ఆంధ్రోళ్లు బాబుతో డిస్ క‌నెక్ట్ అయ్యారా?
X
ఎంత త‌డి చేతుల‌తో నిప్పులు ప‌ట్టుకున్నా.. చేతులు కాల‌కుండా ఉండ‌వు. అది నిప్పు త‌ప్పు కాదు. దాని ల‌క్ష‌ణ‌మే కాల్చేయ‌టం. అయితే గియితే.. త‌ప్పంతా ప‌ట్టుకున్న చేతుల‌వే. నిప్పుకు కాల్చే గుణం ఉంద‌న్న విష‌యం తెలిసినా.. త‌మ చేతులు త‌డి చేతుల‌న్న ధీమాను ప్ర‌ద‌ర్శిస్తే.. ఎలాంటి తిప్ప‌లు ఎదుర‌వుతాయో.. స‌రిగ్గా అలాంటి ప‌రిస్థితే తాజాగా తెలంగాణ‌లో చోటు చేసుకుంది.

తెలంగాణ‌లో సెంటిమెంట్ నిప్పుడు ఎప్పుడూ ఓ ప‌క్క‌న ఉంటుంద‌న్న కీల‌క విష‌యాన్ని మిస్ అయిన బాబు.. కేసీఆర్‌ తో పెట్టుకోవ‌టానికి కాంగ్రెస్ తో చేతులు క‌లిపిన వైనం తెలిసిందే. అయితే.. ఈ వ్య‌వ‌హారాన్ని ఎంత వ‌ర‌కు ముందుకు తీసుకెళ్లి.. ఏ స్థాయిలో ఆపితే మంచిద‌న్న విష‌యంలో బాబుకు క్లారిటీ లేక‌పోవ‌టంతో.. ఈ ఎపిసోడ్‌ లో మొత్తానికే మొద‌టికి వ‌చ్చిన దుస్థితి.

అవ‌స‌రానికి మించిన ప్ర‌చారాన్ని చేప‌ట్ట‌టం ద్వారా.. ఎక్క‌డో దాగి ఉన్న‌ తెలంగాణ సెంటిమెంటును రాజుకునేలా చేయ‌ట‌మే కాదు.. యావ‌త్ తెలంగాణ కేసీఆర్ మీద ఉన్న కోపం కంటే.. బాబు మీద ఉన్న చిరాకును ప్ర‌ద‌ర్శించేందుకు అంతా ఏకం కావ‌టం క‌నిపించింది. ఇంత జ‌రిగిన‌ త‌ర్వాత కూడా.. కేసీఆర్ అండ్ కో సాధించిన విజ‌యాన్ని ఎలా చూడాలి? మ‌రెలా రియాక్ట్ కావాల‌న్న విష‌యంలో టీడీపీ నేత‌లు క‌న్ఫ్యూజ‌న్ లో ఉన్న‌ట్లుగా కనిపించ‌క మాన‌దు.

తెలంగాణ‌లో కేసీఆర్ సాధించిన విజ‌యానికి ఏపీలో ఎందుకు సంబరాలు చేసుకుంటున్నార‌ని ఏపీ మంత్రి ప‌రిటాల సునీత అమాయ‌కంగా ప్ర‌శ్నించ‌టం క‌నిపిస్తోంది. ఎందుకంటే.. పోటీ టీఆర్ ఎస్ వ‌ర్సెస్ టీ కాంగ్రెస్ కాక‌.. కేసీఆర్ వ‌ర్సెస్ బాబుగానే చూశారు. ఎప్పుడైతే బాబు నేరుగా గోదాలోకి దిగారు.. వార్ వ‌న్ సైడ్ గా మారింది. కేసీఆర్ వెనుక యావ‌త్ తెలంగాణ నిలిస్తే.. బాబు వెనుక ఏపీ ప్ర‌జ‌లు సైతం నిల‌బ‌డింది లేదు. ఒక‌వేళ‌.. తెలంగాణ‌లో మాదిరి ఏపీలోనూ సెంటిమెంట్ ఏడిస్తే.. ప‌రిస్థితి మ‌రోలా ఉండేది.

కానీ.. సెంటిమెంట్లు.. అయింట్ మెంట్లు లాంటి వాటికి అతీతంగా ఉండే ఆంధ్రోళ్లు.. ఎప్పుడు ఎవ‌రిని నెత్తిన పెట్టుకుంటారో అర్థం కాదు. లేకుంటే.. త‌మ‌ను రెండు ముక్క‌లు చేయ‌టానికి కార‌ణ‌మైన వ్య‌క్తి ఫ్లెక్సీల‌కు పాలాభిషేకాలు చేయ‌టం ఏమిటి? ఇలాంటి ప‌రిస్థితి మ‌రే రాష్ట్రంలో క‌నిపించ‌దు. ఒక‌వేళ అలాంటి ప్ర‌య‌త్నం చేసిన వారి ప‌ట్ల విప‌రీత‌మైన వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతూ ఉంటుంది.

తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో తెలంగాణ నినాదాన్ని అంద‌రూ ఏమీ అంగీక‌రించ‌లేదు. కానీ.. అంగీక‌రించ‌ని వారి గొంతు పైకి వ‌చ్చేది కాదు. ఒక‌వేళ వ‌చ్చి ఉంటే.. వెంట‌నే వారు తెలంగాణ జాతి ద్రోహుల లిస్టులో చేరిపోయేవారు. దీంతో.. పైకి త‌మ భావాన్ని చెప్పే వారు సైతం గొంతులోనే దాచేసేవారు. ఇలాంటి ప‌రిస్థితి ఏపీలో లేదు. ఎందుకంటే.. తెలంగాణ రాజ‌కీయాల్ని కేసీఆర్ ఒక్క‌రే ప్ర‌భావితం చేయ‌ట‌మే కాదు.. తానే క‌ర్త‌.. క‌ర్మ‌.. క్రియ అవుతున్నారు.

దీనికి భిన్న‌మైన వాతావ‌ర‌ణం ఏపీలో నెల‌కొంది. బాబు తీరుపై ఏపీ ప్ర‌జ‌ల్లో నెల‌కొన్న ఆగ్ర‌హాన్ని కొన్ని రాజ‌కీయ పార్టీలు త‌మ‌కు త‌గ్గ‌ట్లుగా వాడేస్తున్నాయి. ఈ ఎపిసోడ్ మొత్తంలో ఆంధ్రా ప్రాంత ప్ర‌జ‌లు చేయ‌కూడ‌ని త‌ప్పు చేస్తున్నారు.

బాబు మీద ఉన్న కోపాన్ని ప్ర‌ద‌ర్శించేందుకు కేసీఆర్‌ ను పావుగా వాడేస్తున్నారు. ఇలాంటి వాటివ‌ల్ల లాభం కంటే న‌ష్ట‌మే ఎక్కువ‌. ఆంధ్రా ప్రాంత ప్ర‌జ‌లు త‌మ హ‌క్కుల సాధ‌న కోసం.. ప్ర‌త్యేక హోదాను సాధించే అంశంపై దృష్టి పెట్టాల్సింది పోయి.. తెలంగాణ‌లో ఎవ‌రు గెలిచారు? గెలిచిన వారికి ఫ్లెక్సీలు క‌ట్టి.. పాలాభిషేకాలు లాంటి ఓవ‌రాక్ష‌న్ ప‌నులు ఏపీలో చోటు చేసుకోవ‌టం అర్థం లేనిది. ఈ రోజుకు ఏపీకి ప్ర‌త్యేక హోదా అంటే కేసీఆర్ మండిప‌డుతున్నారు. అడ్డుప‌డుతున్నారు. అలాంటి వేళ‌లో కేసీఆర్‌ ను ఆకాశానికి ఎత్త‌టం అంటే.. ఏపీ ప్ర‌యోజ‌నాల్ని ఆంధ్రోళ్ల‌కు త‌మ‌కు తాముగా దెబ్బ తీసుకోవ‌టంగా చెప్పాలి.

కానీ.. ఇలాంటివి ఎందుకు జ‌రుగుతున్నాయంటే.. బాబుతో డిస్ క‌నెక్ట్ అయిన ప్ర‌జానీకం.. ఆయ‌న మీద ఆగ్ర‌హాన్ని కేసీఆర్ మీద అభిమానంగా ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అయితే.. బాబు మీద కోపాన్ని బాబు మీద చూపాలే కానీ.. అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించ‌టం ద్వారా మొద‌టికే మోసంగా మారుతుంద‌న్న‌ది ఆంధ్రోళ్లు ఎంత త్వ‌ర‌గా గ్ర‌హిస్తే అంత మంచిది.