Begin typing your search above and press return to search.

బాబు బాటలోనే ఖర్చు పెడుతున్న అధికారులు

By:  Tupaki Desk   |   6 May 2016 7:01 AM GMT
బాబు బాటలోనే ఖర్చు పెడుతున్న అధికారులు
X
నాయకుడిని అనుసరించటం మామూలే. తాజాగా ఏపీలో పరిస్థితులు చూస్తుంటే.. ముఖ్యమంత్రి చంద్రబాబులో ఏ అంశాల్ని స్ఫూర్తిగా తీసుకోకూడదో.. అవే అంశాల్ని ఏపీ ప్రభుత్వ అధికారులు తీసుకుంటున్నట్లుగా కనిపిస్తుంది. ఓవైపు తీవ్రఇబ్బందులకు గురి చేసే ఆర్థిక ఇబ్బందులు చుట్టిముట్టిన నేపథ్యంలో ఖర్చు విషయంలో ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే తీవ్రమైన నిధుల కొరత వెంటాడి వేధిస్తోంది. అయినప్పటికీ.. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించని వైఖరి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబులో స్పష్టంగా కనిపిస్తుంది.

సీఎంగా ఛార్జ్ తీసుకున్న నాటి నుంచి పలు అంశాలకు సంబంధించి చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలన్నీ అదనంగా ఖర్చు చేయించేలా ఉన్నాయే తప్పించి.. ఆదా చేసే తీరులో లేకపోవటం గమనార్హం. హైదరాబాద్ సచివాలయంలో తన చాంబర్ కోసం ఆయన పెట్టించిన రూ.15 కోట్ల ఖర్చు మొదలు.. నిర్ణయాలు తీసుకునే విషయంలో చోటు చేసుకున్న తప్పులు ఏపీ ఖజానా మీద భారీగా భారం పడేలా చేశాయని చెప్పక తప్పదు.

ఖర్చు విషయంలో పెద్దగా పట్టింపులు లేనట్లుగా వ్యవహరించే బాబు వైఖరి కారణంగా.. ఆయన వినియోగించే ప్రత్యేక విమానాలు.. తరచూ చేసే విదేశీ పర్యటనలు లాంటివి ఆయన్ను తప్పు పట్టేలా చేశాయని చెప్పాలి. హైదరాబాద్ లోని ఒక నివాసం.. ఏపీలో మరో నివాసం.. ఇవి కాక ఆయన ఫాం హౌస్ లాంటి వాటికి భద్రత లాంటి వాటితో ఖర్చు తడిచిమోపెడు అయిన పరిస్థితి.

ఇదిలా ఉంటే.. బాబుకు తగ్గట్లే ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల తీరులా ఉంది. అధినేత కోట్లల్లో ఖర్చులు చేస్తుంటే.. అధికారులు తమ స్థాయిలో లక్షలాది రూపాయిలు వృధాగా ఖర్చు చేయటం కనిపిస్తుంది. ఏపీ ఉన్నత విద్యామండలి కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి ఏపీకి మార్చాలన్న ఆలోచనలో ఉన్నప్పుడు.. కొత్త కార్యాలయంలో చేరిన తర్వాత ఫర్నీచర్ లాంటివి కొనుగోలు చేయాలే తప్పించి.. ముందే కొనుగోలు చేయటంలో అర్థం లేదు.

కానీ.. అందుకు భిన్నంగా ఉన్నత విద్యామండలి అధికారులు ఇటీవల కాలంలో ఫర్నీచర్ కొనుగోలు పేరిట వరుసగా రూ.10 లక్షలు.. రూ.6లక్షలు ఖర్చు చేయటంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి వృధా ఖర్చులకు కళ్లాలు వేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి ముందు ఆయన సైతం ఖర్చు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తే మంచిది.