Begin typing your search above and press return to search.

హోదా ఓకే.. మ‌నోళ్ల‌ను చంపేసింది ప‌ట్ట‌దా?

By:  Tupaki Desk   |   20 March 2018 10:00 AM GMT
హోదా ఓకే.. మ‌నోళ్ల‌ను చంపేసింది ప‌ట్ట‌దా?
X
ఐదు కోట్ల ఆంధ్రుల బ‌తుకుల్ని బాగు చేసుకోవ‌టం అవ‌స‌ర‌మే. కానీ.. అంత‌కు మించిన అత్య‌వ‌స‌ర అంశాలు వ‌చ్చిన‌ప్పుడు.. వాటి గురించి ఆరా తీయ‌టం.. వాటికి త‌గ్గ‌ట్లుగా రియాక్ట్ కావ‌టం అత్య‌వ‌స‌రం. చూస్తుంటే.. తెలుగు ఎంపీల‌కు అలాంటి సున్నిత‌మైన అంశాలు ప‌ట్టిన‌ట్లుగా క‌నిపించ‌టం లేదు. హోదాపై గ‌డిచిన కొద్ది రోజులుగా లొల్లి లొల్లి అవుతున్న‌ది చూస్తున్న‌దే.

హోదా సాధ‌న కోసం మోడీ స‌ర్కారుపై అవిశ్వాస తీర్మానంతో పోరాటం చేయ‌టం త‌ప్పేమీ కాదు. కానీ.. అంత‌కు మించి అత్య‌వ‌స‌ర అంశాలు వ‌చ్చిన‌ప్పుడు వాటికి సంబంధించి ప‌ట్టువిడుపుల‌ను ప్ర‌ద‌ర్శించాల్సి ఉంది. 39 మంది భార‌తీయుల్ని ఐఎస్ తీవ్ర‌వాదులు కిడ్నాప్ చేసి.. దారుణంగా చంపేసిన వైనాన్ని కేంద్ర విదేశాంగ మంత్రి స‌భ‌లో ప్ర‌క‌ట‌న చేయాల‌ని అనుకుంటున్న‌ప్పుడు స‌భ్యులు త‌మ ఆందోళ‌న‌ల్ని ఆపేసి.. ఆ అంశంపై దృష్టి సారించాల్సిన అవ‌స‌రం ఉంది.

కానీ.. త‌మ విష‌యం త‌ప్పించి మ‌రే విష‌యం ప‌ట్ట‌ద‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌టం ఏ మాత్రం స‌రికాదు. కీల‌కమైన ప్ర‌క‌ట‌న‌ను తాను చేయ‌నున్నాన‌ని.. ద‌య‌చేసి స‌భ్యులు కాసేపు త‌మ ఆందోళ‌న‌ల్ని విరమించాల్సిందిగా విదేశాంగ మంత్రి ప‌దే ప‌దే విన్న‌పాలు చేసినా స‌భ్యులు ప‌ట్ట‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌టం చూస్తే.. దారుణ‌మ‌నిపించ‌క మాన‌దు.

తాను చెప్పే విష‌యాన్ని గంద‌ర‌గోళం మ‌ధ్య‌లో చెప్పాల్సింది కాద‌ని.. స‌భ్యులంతా శాంతియుతంగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

అయితే.. స‌భ్యులు ఎవ‌రూ ప‌ట్టించుకోక‌పోవ‌టం గ‌మ‌నార్హం. తాను చెప్పే అంశం గ‌తంలో స‌భ‌లో చ‌ర్చ జ‌రిగినా.. ఈసారి తాను స‌భ‌కు సాక్ష్యంతో వ‌చ్చిన‌ట్లుగా చెప్పారు. ఇరాక్ లో భార‌తీయుల‌పై ఐఎస్ ఉగ్ర‌వాదులు దాడి చేసి 39 మందిని హ‌త‌మార్చార‌న్నారు. భార‌త్ నుంచి పంపిన డీఎన్ ఏ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయ‌ని.. ఈ అంశంపై ఇరాక్ ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న చేయ‌నుంద‌న్నారు. అయితే.. ఈ విష‌యాన్ని ప‌ట్ట‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తూ.. ఎంపీలు చేసిన ఆందోళ‌న చూస్తే.. మ‌నోళ్లు అంత‌మంది మ‌ర‌ణించ‌టం సీరియ‌స్ గా తీసుకోక‌పోవ‌టం సంచ‌ల‌నంగా మారింది.