Begin typing your search above and press return to search.

ఎస్ ఎంఎస్ లకుబదులు చేతల్లోచూపించొచ్చుగా?

By:  Tupaki Desk   |   7 Feb 2016 4:14 AM GMT
ఎస్ ఎంఎస్ లకుబదులు చేతల్లోచూపించొచ్చుగా?
X
ఏపీలో ప్రస్తుతం కుల రాజకీయం మా జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. కాపుల్ని బీసీల్లో చేరుస్తూ నిర్ణయం తీసుకోవాలంటూ మాజీ మంత్రి.. కాపు నేత చేసిన డిమాండ్ కు ఏపీ రాజకీయం మొత్తంగా మారిపోవటం తెలిసిందే. ఓపక్క తమకు జరిగిన అన్యాయం గురించి కాపులు రగిలిపోతుంటే.. వారి పేరు చెప్పి తమ ప్రయోజనాల్ని దెబ్బ తీస్తారా? అన్న సందేహంతో కిందామీదా పడుతున్న బీసీ వర్గాలు. ఏపీ రాజకీయం పుణ్యమా అని కులాల మధ్య అసంతృప్తి రాజుకుంది.

కాపుల ఉద్యమం రోజురోజుకి పెరిగిపోవటం.. కాపుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఏపీ సర్కారుకు చెందిన మంత్రుల పేరుతో వస్తున్న ఎస్ఎంఎస్ లు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఓపక్క కాపునేత ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహారదీక్ష చేస్తుండటం.. రోజురోజుకి ఉద్యమ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో కాపు వర్గానికి చెందిన మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప.. గంటా శ్రీనివాసరావు.. నారాయణ.. కాపు కార్పొరేషన్ ఛైర్మన్ చలమలశెట్టి రామాంజనేయులు పేరుతో ఎస్ ఎంఎస్ ల్ని పంపుతూ వేడుకోవటం కనిపిస్తోంది.

తాజాగా వచ్చిన ఎస్ ఎంఎస్ లు చూస్తే.. ‘‘ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల హామీ నెరవేర్చి కాపులను బీసీల్లో చేరుస్తాం. ఎన్నో ఏల్లుగా తెగని సమస్యకు చిత్తశుద్ధితో పరిష్కారం చెబుతాం. మాకు కాపుల మద్దతు ఎప్పుడూ ఉంది. రిజర్వేషన్లు కల్పించి కాపుల రుణం తీర్చుకోవటం మా విద్యుక్త ధర్మం. విపక్ష నేత కుట్రలో భాగస్వామ్యం కావద్దు. ఆలోచించండి’’ అంటూ ఎస్ ఎంఎస్ లు ఏపీలో భారీగా వస్తున్న పరిస్థితి.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. కాపు నేతలతో కాపు సంక్షేమం గురించి.. బీసీ రిజర్వేషన్ హామీని ప్రస్తావిస్తూ ఆ వర్గానికి చెందిన మంత్రులతో ఎస్ ఎంఎస్ లే కాదు.. బీసీల సంక్షేమానికి పాటుపడతామని.. కాపుల రిజర్వేషన్లతో బీసీలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామంటూ బీసీ వర్గానికి చెందిన మంత్రి అయ్యన్నపాత్రుడు లాంటి వారి పేరిట ఎస్ ఎంఎస్ లు రావటం విశేషం.

మొత్తానికి కులాల వారీగా.. రాజకీయనేతల్ని ఎంపిక చేసి.. వారి చేత ఎస్ ఎంఎస్ లను పంపే ఏర్పాటు ఏపీ సర్కారు చేసిందా? అన్నది ఇప్పుడు డౌట్ గా మారింది. అయినా.. ఎవరో అడిగే వరకూ ఎన్నికల హామీని ఎందుకు తీర్చలేదు? 20 నెలలకు పైగా ఊరకుండబోయే బదులు.. ఇలాంటి సున్నితమైన అంశంపై నిర్మాణత్మకంగా అడుగులు వేసి ఉంటే.. ఇప్పుడు ఈ తీరులో ఎస్ ఎంఎస్ లు పంపుకోవాల్సిన పరిస్థితి ఉండేది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.