ఆ మంత్రులకు రేవంత్ టెన్షన్ మొదలైంది

Thu Oct 19 2017 13:36:49 GMT+0530 (IST)

``ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక - వాణిజ్య పన్నులశాఖ మంత్రి యనమల రామకృష్ణుడికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండువేల కోట్ల విలువైన కాంట్రాక్టులు కట్టబెట్టారని అందుకే యనమల కేసీఆర్ పై ఈగ వాలనివ్వకుండా చూస్తున్నారు. మహిళా - శిశు సంక్షేమశాఖ మంత్రి పరిటాల సునీత తనయుడు - ఏపీ ఎమ్మెల్సీగా ఉన్న పయ్యవుల కేశవ్ అల్లుడికి తెలంగాణ సీఎం కేసీఆర్ బీరు ఫ్యాక్టరీ ఏర్పాటుకు అనుమతులిచ్చారు. ఏ నేరం చేయని నన్ను జైలుకు పంపించారు.....ఆ సమయంలో నా కుమార్తె నిశ్చితార్థం జరిగితే నిఘా పోలీసుల నడుమ కేవలం ఐదు గంటలపాటు వచ్చి ఈ కార్యక్రమానికి హాజరయ్యాను...ఏపీ నేతలు మాత్రం నన్ను జైళ్ళో పెట్టించిన కేసీఆర్ కు ఏపీ నేతలు దండాలు పెడతారా? `` ఇవి ఏపీ మంత్రులు - నేతలపై తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిప్పులు.ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని రేవంత్ కలిశాడని ఆ పార్టీలో చేరికకు రంగం సిద్ధమైందని ప్రచారం జరిగిన అనంతరం ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన రేవంత్ రెడ్డి  జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో మీడియా ప్రతినిధులో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఈ కామెంట్లు చేసినప్పటికీ... తెలుగుదేశం పార్టీపై రేవంత్ ఆగ్రహం తారాస్థాయిలో ఉందని స్పష్టమైందని అంటున్నారు. పార్టీ నుంచి ఇంకా జంప్ చేయకముందే...ఇలాంటి విమర్శలు చేస్తే...బయటకు వెళ్లిన తర్వాత ఎలాంటి నిప్పులు చెరుగుతాడో అనే భయం ఏపీనేతల్లో కనిపిస్తోందంటున్నారు. ఓటుకు కోట్లు కేసులో అసలు నిజాలు బయటపెడితే టీడీపీకి పెద్ద మొత్తంలో నష్టం జరుగుతుందనే ఆందోళన కూడా వారిని వెంటాడుతోందని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తెరాస ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు అవినీతి కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తాను వచ్చే డిసెంబర్ 9వ తేదీనుంచి పాదయాత్ర చేయాలని అనుకుంటున్నట్టు రేవంత్ చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ పాదయాత్ర ద్వారా మరిన్ని సంచలన కామెంట్లు చేయవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి.