Begin typing your search above and press return to search.

ఏపీ కోసం పార్ల‌మెంటులో ర‌చ్చ‌ర‌చ్చ‌

By:  Tupaki Desk   |   28 July 2016 4:26 PM GMT
ఏపీ కోసం పార్ల‌మెంటులో ర‌చ్చ‌ర‌చ్చ‌
X
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం హామీల అమలు పై రాజ్యసభలో స్వల్పవ్యవధి చర్చ సంద‌ర్భంగా హాట్ హాట్‌ గా చ‌ర్చ జ‌రిగింది. కాంగ్రెస్ సభ్యుడు జైరాం రమేష్ చర్చను ప్రారంభించగా ఆయా పార్టీల‌కు చెందిన ఎంపీలు పాల్గొన్నారు. వైసీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన స‌భ్యులు బీజేపీ-టీడీపీ ప్ర‌భుత్వాల‌ను టార్గెట్ చేస్తూ ప్ర‌సంగించ‌గా మిత్ర‌ప‌క్షాల నాయ‌కులు విభ‌జ‌న‌కు కార‌ణ‌మైన కాంగ్రెస్‌ ను త‌ప్పుప‌ట్టారు. ఆయా పార్టీల ఎంపీల స్పంద‌న వారిమాట‌ల్లోనే....

-- ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం లోని హామీల అమలుపై రాజ్యసభలోచర్చను ప్రారంభించిన కేంద్ర మాజీ మంత్రి - కాంగ్రెస్ సభ్యుడు జై రాం రమేష్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 13వ షెడ్యూల్ లోని అభివృద్ధి పనులకు కేంద్రమే బాధ్యత వహించాలని అన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇంత వరకూ ఏం చర్యలు తీసుకుందని ప్రశ్నించారు. అనంత‌రం ఎంపీ కేవీపీ మాట్లాడుతూ ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన అన్ని హామీలనూ అమలు చేసి తీరాలని అన్నారు. చట్టంలోని హామీలతో పాటుగా అప్పటి ప్రధాని రాజ్యసభలో ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని కూడా అమలు చేయాలని కేవీపీ డిమాండ్ చేశారు. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందన్నారు. చట్టంలో ఇచ్చిన హామీలతో పాటుగా, ప్రధాని ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని కూడా పక్కన పెట్టారని విమర్శించారు. తాను ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లును విత్ డ్రా చేసుకునే ప్రక‌క్తే లేదని కేవీపీ రామచంద్రరావు స్పష్టం చేశారు. ఏడాది కిందటే తాను ప్రైవేటు బిల్లును పెట్టానని చెప్పారు. ఏడాది పాటు సమయం వృధా చేసి ఇప్పుడు ద్రవ్య బిల్లు అంటున్నారని విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్ సభ్యులు చేస్తున్న డిమాండ్లకు పూర్తిగా మద్దతు ఇస్తున్నట్లు తెలంగాణ రాష్ట్రసమితి సభ్యుడు కె.కేశవరావు అన్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీల అమలుపై రాజ్యసభలో మాట్లాడిన ఆయన విభజన చట్టాన్ని - సభలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని అన్నారు. చర్చలో పాల్గొన్న తెలుగుదేశం సభ్యుడు టీజీ వెంకటేశ్ రాష్ట్ర విభజన అశాస్త్రీయంగా జరిగిందని విమర్శించారు. రాష్ట్రాలకు చెందిన ఎంపీలకు మాట్లాడే అవకాశమే ఇవ్వలేదని విమర్శించారు. ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని అప్పట్లో వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారని చెప్పారు. ఆయన డిమాండ్ మేరకు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో హామీ ఇచ్చారని టిజి వెంకటేష్ అన్నారు. ఏపీని ఆదుకునేందుకు ప్రత్యేక హోదా - ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని వైకాపా సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీల అమలు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. కేంద్రం న్యాయం చేస్తుందన్న విశ్వాసంతో ఏపీ ప్రజలు ఉన్నారని అన్నారు. రాజ్యాంగ సవరణ లేకుండా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును ఆమోదించారని పేర్కొన్నారు. ప్రైవేటు మెంబర్ బిల్లును ద్రవ్యబిల్లుగా పరిగణించవద్దని విజయసాయిరెడ్డి కోరారు. ప్రైవేటు మెంబర్ బిల్లను ఓటింగ్ కు అనుమతించాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరు అంశాలపై రాజ్యసభలో హామీ ఇచ్చారని చెప్పిన విజయసాయిరెడ్డి వాటిని నెరవేర్చాలన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కాంగ్రెస్ సభ్యుడు టి. సుబ్బిరామిరెడ్డి అన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని హామీల అమలుపై రాజ్యసభలో జరిగిన చర్చలో మాట్లాడిన ఆయన నాడు ఏపీకి ప్రత్యేక హోదాకు మద్దుతు ఇచ్చిన బీజేపీ నేడు ఇతర రాష్ట్రాలూ అడుగుతున్నాయంటే వెనక్కు వెళుతున్నారని విమర్శించారు. విభజన బిల్లుకు బీజేపీ పూర్తి మద్దతు ఇచ్చిందని గుర్తుచేశారు. ప్రత్యేక హోదా అంశానికి కూడా బీజేపీ మద్దతు ఇచ్చిందని పేర్కొన్నారు. ఏపీ అంశాన్ని ఇతర రాష్ట్రాలతో ముడిపెట్టడం తగదని టి.సుబ్బిరామిరెడ్డి అన్నారు.

రాజకీయ ద్వేషమా - లేదా ప్రాంతీయ ద్వేషముందా? ఎందుకు ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీలను ఎందుకు అమలు చేయడం లేదని కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి ప్ర‌శ్నించారు. పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీల అమలు విషయంలో రాజ్యసభలో జరుగుతున్న చర్చలో ఆమె మాట్లాడుతూ సాక్షాత్తూ ప్రధాని సభలో ఇచ్చిన హామీకే దిక్కులోకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ అంగీకరిస్తేనే విభజన జరిగిందన్నారు. వాగ్దానాలు చేశారు, ఎన్నికల సమయంలో ప్రజలను మభ్యపెట్టారని రేణుకా చౌదరి విమర్శించారు. ఐదు కోట్ల మంది ఆంధ్రులను తక్కువ అంచనా వేయకండి అని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ - సోనియాగాంధీల నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన పోరాడేందుకు కంకణం కట్టుకున్నారని చెప్పారు. మొత్తం మీద అన్ని పార్టీలు ఒకరి ని ఒకరు ప్రత్యాక హోదా ఫై టార్గెట్ చేసుకున్నాయి . అలానే ప్రతిపక్షాలు అన్ని కలిసి ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక హోదా మీద ఏకమయ్యి ప్రధాని మోడీ ని రౌండ్ అప్ చేసాయి అని చెప్పుకోవచ్చు