Begin typing your search above and press return to search.

బాబు బ‌లం లెక్క తేల్చిన 'టీచ‌ర్‌.. గ్రాడ్యుయేట్స్‌'

By:  Tupaki Desk   |   21 March 2017 5:35 AM GMT
బాబు బ‌లం లెక్క తేల్చిన టీచ‌ర్‌.. గ్రాడ్యుయేట్స్‌
X
చేతిలో ఉన్న ప‌వ‌ర్‌తో ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తూ.. ధ‌న‌బ‌లంతో రాజ‌కీయ నాయ‌కుల్ని మార్చొచ్చేమో కానీ.. ప్ర‌జాభిప్రాయాన్ని మార్చ‌లేమ‌న్న విష‌యం మ‌రోసారి రుజువైంది. ఏపీ అధికార‌ప‌క్షం గొప్ప‌గా చెప్పుకుంటున్న బ‌లం అస‌లు లెక్క తాజాగా తేలిపోయింది. ఏపీలో జ‌రుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నిక‌లు మొత్తం మూడు ర‌కాలుగా చెప్పొచ్చు. ఇందులో ఒక‌టి స్థానిక సంస్థ‌ల నుంచి ఎన్నికైన ప్ర‌జాప్ర‌తినిధులు.. ఓట్లు వేయ‌టం ద్వారా ఎమ్మెల్సీగా ఎన్నిక‌య్యే ఎన్నిక ఒక‌టైతే.. ఉపాధ్యాయ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ఉపాధ్యాయులు మాత్ర‌మే ఓట్లు వేసి ఎమ్మెల్సీని ఎన్నికోవ‌టం.. ప‌ట్ట‌భ‌ద్రులు ఎన్నుకునే ఎమ్మెల్సీ ఎన్నిక మూడు.

ప్ర‌స్తుతం ఈ మూడు విభాగాల కింద ఏపీలో ఎనిమిది స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఇందులో మూడు స్థానిక సంస్థ‌ల‌కు చెందిన స్థానాలు కాగా.. మ‌రో మూడు స్థానాలు ప‌ట్ట‌భ‌ద్రుల స్థానాలు అయితే.. మిగిలిన రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. స్థానిక ప్ర‌జాప్ర‌తినిధుల్ని త‌మ‌కున్న ధ‌న‌బ‌లంగా ప్ర‌భావితం చేసి.. సాంకేతికంగా బ‌లం లేక‌పోయినా.. క్రాస్ ఓటింగ్‌ ను ప్రోత్స‌హించ‌టం ద్వారా మూడింటిని చేజిక్కించుకున్నారు.

త‌మ గెలుపును గొప్ప‌గా చెప్పుకున్న చంద్ర‌బాబు.. రానున్న రోజుల్లో త‌మ పార్టీదే విజ‌య‌మ‌ని గొప్ప‌లు చెప్పేసుకున్నారు. ఆయ‌న నోటి నుంచి ఆ మాట‌లు వ‌చ్చి 24 గంట‌లు కూడా కాక ముందే.. సీన్ రివ‌ర్స్ అయ్యింది. ప్ర‌స్తుతం ఫ‌లితం వ‌చ్చిన రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లో అధికార పార్టీకి చెందిన అభ్య‌ర్థులు ఓట‌మి చెందారు. తాజాగా వెలువ‌డుతున్న ఓట్ల లెక్కింపు ఫ‌లితాలు చూస్తుంటే.. ఏపీ అధికార‌ప‌క్షానికి ఎదురుగాలి వీస్తున్న విష‌యం ఇట్టే అర్థ‌మ‌వుతుంది.

ఉపాధ్యాయ ఎమ్మెల్సీల‌కు జ‌రుగుతున్న రెండింటిని (ప‌శ్చిమ.. తూర్పు రాయ‌ల‌సీమ‌) టీడీపీ బ‌ల‌ప‌ర్చిన అభ్య‌ర్థులు ఓట‌మి చెందారు. ఇక‌.. ప‌ట్ట‌భ‌ద్రుల స్థానాల‌కు జ‌రిగిన ఎన్నిక ఓట్ల లెక్కింపులో ఇప్ప‌టివ‌ర‌కూ వెలువ‌డిన ఫ‌లితాల్ని చూస్తే.. టీడీపీకి ఎదురుగాలి వీస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. క‌డ‌ప‌టి స‌మాచారం ప్రకారం.. అనంత‌పురం.. క‌డ‌ప‌.. క‌ర్నూలు స్థానాల‌కు జ‌రిగిన ఉపాధ్యాయ ప‌ట్ట‌భ‌ద్రుల ఎన్నిక‌ల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మ‌ద్ద‌తుదారు గోపాల‌రెడ్డి అధిక్యంలో కొన‌సాగుతున్నారు. అదే స‌మ‌యంలో.. శ్రీకాకుళం.. విజ‌య‌న‌గ‌రం.. విశాఖ‌ప‌ట్నంలో జ‌రిగిన ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గంలో బీజేపీ అభ్య‌ర్థి అధిక్యంలో ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. పూర్తి ఫ‌లితాలు ఈ సాయంత్రానికి కానీ.. రాత్రికి కానీ వెలువ‌డే అవకాశం ఉన్న‌ట్లుగా చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/