Begin typing your search above and press return to search.

సెక్రటేరియట్ లో ప్ర‌వేశానికి అదే `ఆధారం`!

By:  Tupaki Desk   |   12 July 2018 12:09 PM GMT
సెక్రటేరియట్ లో ప్ర‌వేశానికి అదే `ఆధారం`!
X
ఒక రాష్ట్ర పాల‌న‌లో కీల‌క నిర్ణ‌యాలు తీసుకునే అసెంబ్లీకి ఎంత ప్రాధాన్య‌త ఉందో....ఆ నిర్ణయాల‌ను అమ‌లు చేసేందుకు అవ‌స‌ర‌మైన విధివిధానాలు రూపొందించే యంత్రాంగం ఉండే సెక్ర‌టేరియ‌ట్ కు అంతే ప్రాముఖ్య‌త ఉంది. సీఎంతో పాటు మంత్రులంద‌రూ అందుబాటులో ఉండి ప‌రిపాల‌న సాగించే స‌చివాల‌యానికి త‌మ స‌మ‌స్య‌లు వెల్ల‌డించేందుకు సామాన్యులు వస్తుంటారు. రాష్ట్రం న‌లుమూల‌లా ఉన్న ప్ర‌భుత్వ కార్యాల‌యాలకు సంబంధించిన ఉన్న‌తాధికారులు కూడా ఇక్క‌డే కొలువై ఉంటారు. ఈ నేప‌థ్యంలో ఇక్క‌డ‌కు రోజూ వంద‌లాది మంది సామాన్యులు వ‌చ్చిపోతుంటారు. అయితే, ఇక‌పై రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనా కేంద్రమైన సెక్రటేరియట్ భద్రతను మరింత పెంచేందుకు ఏపీ స‌ర్కార్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇక‌పై సచివాలయానికి వచ్చే సందర్శకులు తమ ఆధార్‌ నంబర్‌ ను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

స‌చివాల‌య భ‌ద్ర‌త‌కు చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ప‌లు చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఇందుకోసం మాన్యువల్‌ పాసులకు చెల్లుచీటి రాసింది. సందర్శకులు సెక్రటేరియట్ లోకి ప్రవేశించేందుకు ఆధార్ నంబ‌ర్ త‌ప్ప‌నిస‌రి చేయ‌డంతోపాటు ....విజిటింగ్ అవర్స్ ను మ‌ధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వ‌ర‌కే ప‌రిమితం చేసింది. ఆ సమయంలో ఆధార్ వివ‌రాలు తీసుకొని పాసులు జారీ చేస్తుంటారు. ఒక‌వేళ‌ సందర్శకులు బృందంగా వస్తే వారిలో ఒకరి ఆధార్‌ నంబర్ తీసుకుంటారు. విజిటింగ్ అవ‌ర్స్ కాకుండా మిగిలిన సమయాల్లో సందర్శించాలనుకునే వారికి ప్రత్యేక సాంకేతికత వ్యవస్థను సిద్దం చేసింది. అయితే, కొత్త నిబంధ‌న‌ల‌పై ప్ర‌జ‌లు మిశ్ర‌మంగా స్పందిస్తున్నారు. సామాన్య ప్రజలను ఈ నిర్ణ‌యం అసంతృప్తిని కలిగించింది. ఆధార్ నంబర్ దుర్వినియోగం పై ప‌లు సందేహాలున్న నేప‌థ్యంలో అంద‌రూ ఆధార్ వెల్లడించే అవ‌కాశం లేదు. మ‌రి, సామాన్యుల మొర విని పాత నిబంధ‌న‌లు య‌థాత‌ధంగా కొన‌సాగిస్తారేమో చూడాలి.