Begin typing your search above and press return to search.

ఆరోప‌ణ‌ల‌కు స‌రెండ‌ర్ అయిన‌ చంద్ర‌బాబు

By:  Tupaki Desk   |   25 Jun 2018 6:07 PM GMT
ఆరోప‌ణ‌ల‌కు స‌రెండ‌ర్ అయిన‌ చంద్ర‌బాబు
X
టీటీడీ విష‌యంలో ర‌మ‌ణ దీక్షితులు చేసిన ఆరోప‌ణ‌ల‌కు ఏపీ ప్ర‌భుత్వం ఉక్కిరిబిక్కిరి అయ్యింది. భ‌క్తుల‌కు కొంగుబంగారం అయిన‌ క‌లియుగ క్షేత్రంలో పొర‌పాట్లు జ‌రిగాయ‌ని వ‌చ్చిన ఆరోప‌ణ‌లే భ‌క్తుల‌ను ఆందోళ‌న‌కు గురిచేశాయి. దానిని నిజ‌మో అబ‌ద్ధ‌మో తేల్చాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వంపై ఉంది. కానీ ఆరోప‌ణ‌ల‌పై విచార‌ణ వ‌దిలేసి కాల‌హ‌ర‌ణం చేస్తూ ఆరోప‌ణ‌లు చేసిన వారిపై పార్టీ త‌ర‌ఫున‌ - ప్ర‌భుత్వం త‌రఫున మాట‌ల దాడి జ‌రిగింది. అయిన‌ప్ప‌టికీ ప్ర‌తిప‌క్షాలు కూడా ఆ ఆరోప‌ణ‌ల‌ను స‌మ‌ర్థించ‌డంతో విష‌యం తీవ్ర‌మైంది.

ఇన్నాళ్ల‌కు ఏపీ ప్ర‌భుత్వం ఒక నిర్ణ‌యం తీసుకోక త‌ప్ప‌లేదు. అయితే, ఈ ఆల‌స్యం వ‌ల్ల ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు, తెలుగుదేశానికి జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగింది. దీంతో ఉప‌శ‌మ‌న చ‌ర్య‌లు చేప‌ట్టింది ఏపీ ప్ర‌భుత్వం. తిరుమ‌ల స్వామి వారి ఆభ‌ర‌ణాల విష‌యంలో ఒక కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇకపై ప్రతి రెండేళ్లకోసారి శ్రీవారి ఆభరణాలపై న్యాయ విచారణ చేపడతామని ప్ర‌భుత్వం ప్రకటించింది. నియ‌మించిన క‌మిటీ ఎదుటే ఆభ‌ర‌ణాల ప‌రిశీల‌న జ‌రుగుతుంద‌ని వివ‌రించారు. శ్రీ‌వారికి లేని డైమండ్లు ఉన్న‌ట్లు చెప్పి, వాటిని అప‌హ‌రించార‌ని ప్ర‌చారం చేయ‌డం త‌గ‌ద‌ని చంద్ర‌బాబు త‌న‌దైన శైలి కామెంట్లు చేశారు.

ఇదిలా ఉండ‌గా... ఇటీవ‌లే నియామ‌క‌మైన టీటీడీ పాల‌కవ‌ర్గం ఈరోజు శ్రీవారి ఆభరణాలను ప‌రిశీలించింది. ఈ సంద‌ర్భంగా టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయ‌మ‌య్యాయి. తిరుమల శ్రీవారి ఆభరణాల్లోని రూబీ ఒకటి పగిలిపోయిందని - దాని విలువ రూ. 50గా రికార్డులో ఉన్న‌ట్టు ఆయ‌న చెప్పారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేందుకే పూర్వ అర్చ‌కులు రమణదీక్షితులు ఆరోపణలు చేశారని, అవి నిజ‌మ‌ని ఆయ‌న భావిస్తే తిరుమలకు వచ్చి నిరూపించాలని డిమాండ్ చేశారు.

చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అంత నిజాయితీగా ఉన్న‌పుడు నెల రోజులుగా ఆరోప‌ణ‌లు వ‌స్తున్నా... క‌మిటీ నియామ‌కంలో ఇంత ఆలస్యం ఎందుక‌న్న‌ది ఇక్క‌డ లేవ‌నెత్తే ప్ర‌శ్న‌. పోనీ అది కూడా భ‌విష్య‌త్తు విచార‌ణ‌కే గాని... పోయాయ‌ని వ‌స్తున్న న‌గ‌ల విచార‌ణ కు కాద‌ట‌. ఇది మ‌రీ విడ్డూరం. విచార‌ణ అడిగింది పోయిన న‌గ‌ల గురించి అయితే, బాబు మాత్రం ఉన్న న‌గ‌లను ఇక నుంచి ప‌రిశీలించ‌డానికి క‌మిటీ వేశారు. క‌వ‌రింగ్‌లో బాబు గారికి ఎవ‌రు సాటి వ‌స్తారు?