ఈ విషయంలోనూ ఏపీకి తాత్కాలికమే!

Tue Jan 01 2019 14:06:24 GMT+0530 (IST)

కొత్త సంవత్సరం వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చారిత్రక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర విభజన జరిగి నాలుగున్నరేళ్లు దాటినా.. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్ర హైకోర్టు ఇప్పటివరకూ ఏర్పాటు కాలేదు. కనిపించే ఇష్యూలతో పోలిస్తే.. కనిపించని అంశాలతో ఆలస్యమైనప్పటికీ.. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రెండు రాష్ట్రాలకు రెండు వేర్వేరు హైకోర్టుల ఏర్పాటుకు సంబంధించిన నోటిఫికేషన్ డిసెంబరు 26న వెలువడింది.దీంతో.. రెండు రాష్ట్రాల్లో వారి వారి హైకోర్టుల ఏర్పాటు పక్కా అయ్యింది. ఈ ఉదయం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణస్వీకారం చేయించారు. రెండు రాష్ట్రాలకు ఒకరే గవర్నర్ కావటంతో.. హైదరాబాద్ కార్యక్రమం పూర్తి అయిన వెంటనే అమరావతికి వచ్చారు గవర్నర్ నరసింహన్.

విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సి. ప్రవీణ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. అయితే.. ఆయన తొలి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి కావటం గమనార్హం.

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పూర్తిస్థాయి బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారన్నది రానున్న కొద్ది రోజుల్లో క్లారిటీ రానుంది. అదేం సిత్రమో కానీ.. ఏపీకి సంబంధించి ఏ వ్యవహారం తీసుకున్నా.. అది తాత్కాలికమే అవుతుంది. సీఎం కార్యాలయం తాత్కాలికమే.. ఏపీ సచివాలయం తాత్కాలికమే.. ఏపీ హైకోర్టు ఏర్పాటు చేస్తున్న భవనం తాత్కాలికమే. అదే రీతిలో హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి కూడా తాత్కాలికమే కావటం మరో విశేషం. మొత్తానికి.. అన్ని విషయాల మాదిరే ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియామకంలోనూ తాత్కాలికమే కావటం ఆసక్తికరంగా చెప్పాలి.

ఏపీ విభజన నేపథ్యంలో ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ లో పదేళ్ల పాటు ఉండే అవకాశం ఉంది. అయినప్పటికీ రాజకీయ కారణాలతో చంద్రబాబు హైదరాబాద్ వదిలేసి అమరావతికి వెళ్లటం తెలిసిందే. హైకోర్టు ఏర్పాటు ఏపీలో పక్కా అని తెలిసినప్పటికీ.. గడిచిన నాలుగేళ్లుగా హైకోర్టు భవనానికి సంబంధించి పూర్తిస్థాయి కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. కోర్టు తీర్పు నేపథ్యంలో  విభజన చేయటం తప్పనిసరైంది. అయితే.. ప్రణాళికబద్ధంగా వ్యవహరించి.. ముందు చూపుతో ఏర్పాట్లు చేసి ఉంటే.. తాత్కాలిక భవనంలో హైకోర్టును ఏర్పాటు చేసే అవకాశం ఉండేది కాదన్న మాట వినిపిస్తోంది. ప్రతి విషయంలోనూ తాత్కాలికమే ముద్దు అన్నట్లుగా వ్యవహరించే బాబు.. తాజాగా మరికొన్ని తాత్కాలికాల్ని పెంచారని చెప్పక తప్పదు.