Begin typing your search above and press return to search.

మోడీ కోరికను వెంకయ్య తీర్చగలరు!

By:  Tupaki Desk   |   18 Feb 2018 4:26 AM GMT
మోడీ కోరికను వెంకయ్య తీర్చగలరు!
X
అనగనగా ప్రధాని నరేంద్రమోడీకి హృదయాంతరంగంలో ఒక కోరిక పుట్టింది. ఆ కోరికను ఎవరు తీర్చగలరు? ఎవరు పట్టించుకుంటారు? ఆయన ఎవరితో చెప్పుకోవాలి? అప్పటికీ... ఆయన ఆయన తన మనసులోని కోరికను తన కార్యాలయ అధికార్లకు చెప్పుకున్నారు. ఆ కోరిక తీర్చడం వారి వల్ల కాలేదు. అయితే ఇప్పుడు పత్రికల్లో వార్తల ద్వారా విషయం తెలుసుకున్న తెలుగు ప్రజలు మాత్రం ‘‘మీకు అంత కష్టం ఎందుకు సార్.. ఎంచక్కా మా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారిని అడగండి.. చిటికెలో మీ కోరిక తీర్చేస్తారు’’ అని జోకులు వేసుకుంటున్నారు. ఇంతకూ మోడీ కోరిక ఏమిటి?

వివరాల్లోకి వెళితే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్జంటుగా ఒక అధికారిక కార్యక్రమానికి సభకు హాజరై.. తన వాక్చాతుర్యాన్నీ - తెలివితేటలను - తన అంకితభావాన్నీ - తన దేశభక్తినీ - తన నోట్ల రద్దు ఫలితాన్నీ.. ఇలా తన సమస్త వైభవాన్నీ తెలుగు ప్రజలకు ఓసారి చాటి చెప్పుకోవాలని అనిపించింది. కోరిక పుట్టగానే ఏపీకి చటుక్కున వచ్చేయడానికి ఆయనేమీ చిన్నా సన్నా మనిషి కాదు కదా..! ‘నా అంతటి వాడు లేడు’ అనుకునేంత పెద్ద ప్రధాని కదా! ఎందుకు వచ్చినా సరే.. ఆయన స్థాయికి తగిన కార్యక్రమం ఉండాలి కదా.. ! అందుకే నా స్థాయి కార్యక్రమం ఏపీలో పెండింగులో ఉన్నదేమో చూడండి అని అధికార్లకు పురమాయించారు. కాపోతే.. మాదగ్గర ఏమీ లేవు.. మీరు రానక్కర్లేదు అని ఏపీ అధికార్ల నుంచి వర్తమానం వచ్చింది. పాపం ఆయన ఖంగు తిని ఉంటారు.

సరిగ్గా ఇక్కడే తెలుగు ప్రజల సెటైర్లు ప్రారంభం అవుతున్నాయి. మా తెలుగువాడైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును ఆశ్రయించండి అని సలహా ఇస్తున్నారు. ఎందుకంటే ఉపరాష్ట్రపతి స్థాయి కార్యక్రమాన్ని ప్రతి వారానికీ ఒకటి వంతున తెలుగురాష్ట్రాల్లో పనిగట్టుకున్నట్టు సెట్ చేయడం అనేది ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. సగటున వారాని కోమారు ఆయన ఏపీలోని కార్యక్రమాల్లో గడుపుతుంటారు. ఆయనను సంప్రదిస్తే సునాయాసంగా ఓ కార్యక్రమం ఫిక్స్ చేయగలరు అని వారు జోకులేస్తున్నారు. మరి మోడీ తన కోరిక తీర్చుకోడానికి అంత పనైనా చేయడానికి సిద్ధపడ్తారా చూడాలి.