Begin typing your search above and press return to search.

జిల్లా మొత్తాన్ని పోలీసుల‌తో నింపేశారుగా

By:  Tupaki Desk   |   21 July 2017 10:11 AM GMT
జిల్లా మొత్తాన్ని పోలీసుల‌తో నింపేశారుగా
X
ఏపీలో నెల‌కొన్న ఆస‌క్తిక‌ర‌మైన ప‌రిణామానికి ఇదో నిద‌ర్శ‌నం. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చలో అమరావతి పాదయాత్ర నేపథ్యంలో పోలీసు శాఖ ముందుగానే అప్రమత్తమయ్యింది. ఇప్పటికే జిల్లాలో కొన్ని రహదారులను పోలీసులు స్వాధీనంలోకి తీసుకుని పోలీసు పికెట్లు నిర్వహిస్తున్నారు. మరోవైపు గ్రామాల్లో కాపు సామాజికవర్గం నేతలతో పోలీసులు సమావేశాలు నిర్వహించి, పాదయాత్రకు అనుమతిలేదని, పాల్గొనేవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. జిల్లాలో సెక్షన్ 30, 144 కింద నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయి. దీంతో తూర్పు గోదావరి జిల్లాపై నిఘా నీడ ఆవరించింది.

కాపు సామాజిక వర్గం అధికంగావున్న ప్రాంతాల్లోనే కాకుండా జిల్లా అంతటా పోలీసులు అప్రమత్త చర్యలు చేపట్టారు. సభలు, సమావేశాలు, రాస్తారోకోలు, ధర్నాలు, పాదయాత్రలు, గుమికూడటం వంటి కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని గ్రామాల్లో పోలీసులు మైకు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇతర ప్రాంతాలకు చెందిన ప్రత్యేక పోలీసు బలగాలను సైతం జిల్లాలో మోహరింపజేసేందుకు చర్యలు చేపట్టారు. గత రెండు రోజులుగా ఇటు రాజమహేంద్రవరం అర్బన్ పోలీసు జిల్లా పరిధిలోనూ, అటు జిల్లా పోలీసు విభాగంలో ఉన్నతాధికారులు శాఖాపరంగా సమీక్షా సమావేశాలు నిర్వహించుకుంటున్నారు. గత సోమవారం జిల్లాలో జరగాల్సిన ముఖ్యమంత్రి పర్యటన వాయిదా ప‌డ‌టం గ‌మ‌నార్హం. ఆ సందర్భంలో సమావేశమైన పోలీసు ఉన్నతాధికారులు పనిలో పనిగా ఈ అంశాలపై సమీక్షించుకున్నట్టు తెలిసింది. బుధవారం జిల్లాలో పర్యటించిన డిజిపి నండూరి సాంబశివరావు సైతం జిల్లా అధికార్లతో ఈ విషయంపై చర్చించినట్టు తెలిసింది. అనుమతి లేని పాదయాత్రలో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు కూడా జారీచేశారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆందోళనకు అవకాశం లేకుండా కట్టుదిట్టమైన రీతిలో పోలీసులు అన్ని వైపుల నుంచి వ్యూహాత్మకంగా చర్యలకు ఉపక్రమించినట్టు తెలుస్తోంది.

తుని ఘటన నేపథ్యంలో సిఐడి కేసులు - ఇతరత్రా బైండోవర్ కేసులతో ముందుస్తుగా నేతలపై కేసుల ఉచ్చు బిగుసుకోనుందని తెలుస్తోంది. నేతల గృహ నిర్బంధాలతోపాటు - ఆందోళనకు దిగే అవకాశమున్న యువకులను గుర్తించి, వారిపై కఠినమైన కేసులు పెట్టేందుకు కూడా సమాయత్తమైనట్టు తెలిసింది. ముద్రగడ పాదయాత్ర తేదీ దగ్గర పడుతున్న కొద్దీ పోలీసులు కూడా తమ చర్యలను వేగవంతం చేస్తున్నట్టు కన్పిస్తోంది. మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లాలో గరగపర్రు వివాదం కూడా జిల్లా పోలీసులకు తలనొప్పిగా మారింది. 25వ తేదీలోగా గరగపర్రు దోషులపై చర్యలు తీసుకోకపోతే తన ఇంట్లోనే ఆమరణ దీక్షకు పూనుకుంటానని అల్టిమేటం ఇచ్చిన మాజీ ఎంపి హర్షకుమార్‌ ను ముందస్తుగానే పోలీసులు గృహ నిర్బంధంచేశారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి అవసరమైన సన్నాహాలు చేస్తున్నారని అందులో భాగ‌మే జిల్లా మొత్తాన్ని రౌండ‌ప్ చేసేయ‌డ‌మ‌ని ప‌లువురు పేర్కొంటున్నారు.