Begin typing your search above and press return to search.

మ‌రో భూ సంతర్ప‌ణ‌కు రంగం సిద్ధం

By:  Tupaki Desk   |   19 March 2017 8:04 AM GMT
మ‌రో భూ సంతర్ప‌ణ‌కు రంగం సిద్ధం
X
ఏపీలో మ‌రో భూ సంతర్ప‌ణ‌కు రంగం సిద్ధ‌మైపోయింది. ఇప్ప‌టికే రాష్ట్ర రాజ‌ధాని అమ‌రావ‌తి పేరిట మంగ‌ళ‌రిగి ప‌రిధిలోని 29 గ్రామాల‌ను ఎంపిక చేసిన చంద్ర‌బాబు స‌ర్కారు... అక్క‌డ 33 వేల ఎక‌రాల‌ను లాగేసుకుంది. త‌మ మాట‌ల‌కు త‌లొగ్గిన‌ రైతుల‌కు తాయిలాలు, తాయిలాల‌కు లొంగ‌ని రైతుల‌కు బెదిరింపులు.,.. ఇలా విడ‌త‌ల‌వారీగా ప్ర‌భుత్వం సాగు భూముల‌నైతే లాగేసింది. అక్క‌డ గ‌డచిన మూడేళ్ల‌లో రెండంటే రెండు... అవి కూడా తాత్కాలిక భ‌వ‌నాల పేరిట నిర్మాణాల‌ను క‌ట్టిన బాబు స‌ర్కారు... మిగిలిన భూములను బీడుగానే ఉంచేసింది. అటు రైతులు సాగు చేసుకోవ‌డానికి వీలు లేకుండా చేసిన బాబు అండ్ బ్యాచ్‌... ఇటు నిర్మాణాల్లో తీర‌ని జాప్యం చేస్తూ... నిజంగానే ఆ భూముల‌ను ఎందుకూ కొర‌గాకుండా చేసేసింద‌నే వాద‌న వినిపిస్తోంది. రాజ‌ధాని డిజైన్లు ఖ‌రారు, ఆ త‌ర్వాత నిర్మాణ ప్ర‌క్రియ పూర్త‌య్యే వ‌ర‌కైనా తాము త‌మ పొలాల్లో పంట‌లేసుకుంటామ‌న్న‌ రైతుల మొర కూడా చంద్ర‌బాబు స‌ర్కారు చెవికెక్క‌లేదనే చెప్పాలి. రాజ‌ధానికి భూములిచ్చేశారుగా... ఇక ఖాళీ చేయాల్సిందేన‌ని హుకుం జారీ చేసి... ఆ భూముల‌ను బీడు భూములుగా మార్చేసింది.

ఇక తాజాగా కృష్ణా జిల్లా కేంద్రం మ‌చిలీప‌ట్నం స‌మీపంలోని బందరు పోర్టు కోస‌మంటూ ఏకంగా 5 వేల ఎక‌రాల భూ సంత‌ర్ప‌ణ‌కు బాబు స‌ర్కారు కార్య‌రంగం సిద్ధం చేసేసింది. అయినా బందరు పోర్టు అభివృద్దికి వేల ఎక‌రాలు ఎందుకంటూ అటు రాజ‌కీయ పార్టీలు,. ఆ ప్రాంత ప‌రిస‌ర ప్ర‌జ‌లు నెత్తీ నోరు బాదుకున్నా కూడా వినిపించుకోని బాబు స‌ర్కారు... మొత్తంగా 4,800 ఎక‌రాల‌కు పైగా భూముల‌ను బందరు పోర్టును అభివృద్ధి చేసే ప‌నులను ద‌క్కించుకున్న న‌వ‌యుగ కంపెనీకి క‌ట్ట‌బెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. అక్క‌డ ఉన్న ప్ర‌భుత్వ భూములు మిన‌హా మిగిలిన భూముల‌ను ఇచ్చేందుకు జ‌నం స‌సేమిరా అంటున్న విష‌యం తెలిసిందే. ఈ విష‌యంపై రోడ్డెక్కిన రైతులపై బాబు స‌ర్కారు ఉక్కుపాదం మోపిన విష‌యాన్ని కూడా మ‌రువ‌లేం, ఎందుకంటే... రైతుల‌ను నిలువ‌రించేందుకు రంగంలోకి దిగిన ఆ జిల్లాకు చెందిన మంత్రి కొల్లు ర‌వీంద్ర‌, ఎంపీ కొన‌క‌ళ్ల నారాయ‌ణ‌రావుల‌తో పాటు త‌మ‌కు మ‌ద్ద‌తుగా నిలిచేందుకు వ‌చ్చిన పీసీసీ చీఫ్ ర‌ఘువీరారెడ్డిని కూడా అక్కడి రైతులు వెంట‌బ‌డి మ‌రీ కొట్టిన విష‌యం గుర్తున్న‌దేగా.

త‌మ‌కు ఎవ‌రి అండా అవ‌స‌రం లేద‌ని నాడే తేల్చి చెప్పిన బందరు రైతులు... త‌మ భూముల‌ను పోర్టుకు ఇచ్చేది లేద‌ని తేల్చె చెప్పారు. అయితే వారిని దారికి తెచ్చుకునేందుకు బాబు స‌ర్కారు ఓ ప‌క్కా వ్యూహం ర‌చించింది. ఇందులో భాగంగా తొలుత అక్క‌డ ఉన్న ప్ర‌భుత్వ‌, అసైన్డ్ భూముల‌ను న‌వ‌యుగ‌కు అప్ప‌గించేస్తే... ఎలాగూ ప‌నులు ప్రారంభ‌మైన త‌ర్వాత ఆ భూముల‌కు ఆనుకుని ఉన్న రైతుల భూముల‌ను ఎలాగూ లాగేసుకోవ‌చ్చ‌న్న ఈ వ్యూహానికి ఇప్పుడు బాబు స‌ర్కారు ప‌దును పెట్టింది. ఈ క్ర‌మంలో ప్ర‌భుత్వం నుంచి ఆదేశాలు అందుకున్న కృష్ణా జిల్లా క‌లెక్ట‌ర్ అహ్మ‌ద్ బాబు... నిన్న అక్క‌డ ఉన్న ప్ర‌భుత్వ‌, అసైన్డ్ కేట‌గిరీ కింద ఉన్న 3,104 ఎక‌రాల‌ను మార్క్ చేసేశారు. వీటిని నేడు న‌వ‌యుగ కంపెనీకి అధికారికంగా బ‌దిలీ చేయ‌నున్నార‌ట‌. అంటే ఆ ప‌రిస‌ర ప్రాంతాల‌కు చెందిన రైతుల భూముల‌కు కూడా నేడో, రేపో గండం త‌ప్ప‌ద‌న్న మాట‌.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/