Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ ఎఫెక్ట్‌ తోనే చేనేత‌ రుణ‌మాఫీ చేశార‌ట‌

By:  Tupaki Desk   |   22 Feb 2017 4:30 PM GMT
ప‌వ‌న్ ఎఫెక్ట్‌ తోనే చేనేత‌ రుణ‌మాఫీ చేశార‌ట‌
X
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుపై జ‌న‌సేన అధినేత‌ - ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓత్తిడి బాగానే ప‌నిచేస్తున్న‌ట్లుగా క‌నిపిస్తోందనే చ‌ర్చ జ‌రుగుతోంది. ఇటీవ‌ల శ్రీ‌కాకుళం జిల్లా ఉద్దానంలో ప‌ర్య‌టించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ అక్క‌డి కిడ్నీ బాధితుల స‌మ‌స్య‌ల‌పై ప్ర‌భుత్వానికి అల్టిమేటం జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. అనంత‌రం ప్ర‌భుత్వం వారి విష‌యంలో ఉదారంగా స్పందించి తగు వైద్య స‌హాయం చేసింది. ఇపుడు అదే రీతిలో చేనేత కార్మికుల విష‌యంలో ప‌వ‌న్ స‌త్యాగ్ర‌హ స‌భ త‌ర్వాత రాష్ట్ర ప్ర‌భుత్వం నేత‌న్నల‌కు రుణ‌మాఫీ ఇవ్వాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే ఇందుకు త‌గినట్లుగా ప‌రిపాల‌న అనుమ‌తుల కూడా ఇచ్చేశారు.

విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ఆర్థికంగా చితికిన చేనేత రంగం - దానిపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. అందులో భాగంగా 25వేల మంది కార్మికులకు పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే చేనేత రుణమాఫీ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా రూ.110.96 కోట్లు మంజూరు చేసింది. దీనిలో రూ.72 కోట్లను ఇప్పటికే చేనేత కార్మికుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. మిగిలిన మొత్తాన్ని ఈ నెలాఖరులోగా మిగిలిన చేనేత కార్మికుల ఖాతాల్లో జమ చేయాలని అధికారులను ఆదేశించింది. రుణమాఫీ ద్వారా రాష్టవ్య్రాప్తంగా 25,567 మంది చేనేత కార్మికులకు లబ్ధి చేకూరనుంది. తరువాత కూడా చేనేత కార్మికులకు కొత్త రుణాలు మంజూరు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. చేనేత ఉత్పత్తుల అమ్మకాలకు వీలు కల్పిస్తూ బజార్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇదిలాఉండ‌గా...తాజాగా ప్ర‌భుత్వం రూ.110.96 కోట్ల‌ను విడుద‌ల చేస్తూ నిర్ణ‌యం తీసుకోవ‌డం ప‌వ‌న్ ఎఫెక్ట్ ఏమీ కాద‌ని ప్ర‌భుత్వ‌మే కొద్దికాలం క్రితం నిర్ణ‌యం తీసుకుంద‌ని తెలుగుదేశంలోని చేనేత నాయ‌కులు చెప్తున్నారు. ప‌రిపాల‌న ప‌ర‌మైన జాప్యం కారణంగానే తాజాగా ఆదేశాలు వెలువ‌డ్డాయ‌ని చెప్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/