షాకిస్తున్న బాబు సర్కారు అప్పుల లెక్కలు

Tue Sep 12 2017 10:38:01 GMT+0530 (IST)

నేతి బీరకాయలో నెయ్యి ఉండదన్నది ఎంత నిజమో.. చంద్రబాబు మాటల్లో సత్యం కూడా అంతేనన్న విషయం మరోసారి రుజువు చేసే వైనంగా చెప్పాలి. అభివృద్ధిలో ఏపీ సర్కారు దూసుకెళుతోందంటూ తరచూ చెప్పే సీఎం చంద్రబాబు మాటలకు.. వాస్తవాలకు అస్సలు పొంతన కుదరటం లేదన్న విషయం కళ్లకు కట్టినట్లుగా చూపించే వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది.అభివృద్ధి.. సంక్షేమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు చెప్పినా.. అలాంటిదేమీ లేదని.. అప్పుల భారం అంతకంతకూ పెరిగిపోతున్న వైనం చూస్తే.. షాక్ తినక మానదు. చరిత్రలో ఎప్పుడూ లేనంత భారీగా కేవలం రెండు నెలల వ్యవధిలో ఏకంగా రూ.10500 కోట్ల అప్పు చేసిన తీరు వింటే గుండె గుభేల్ అనకమానదు. 2017-18 రెండో త్రైమాసికంలో నిర్దేశించుకున్న రుణ పరిమితికి ఇది రెట్టింపు కావటం గమనార్హం.

ఏపీ అప్పుల చరిత్రలో సరికొత్త రికార్డుగా అభివర్ణిస్తున్న ఈ ఉదంతంలో.. షెడ్యూల్ ప్రకారం రాష్ట్ర సర్కారు రూ.5500 కోట్ల మేర రుణాలు తీసుకోవాల్సి ఉంది. కానీ.. అవసరాలు.. ఆదాయం మధ్య దూరం అసాధారణంగా పెరిగిపోవటంతో షెడ్యూల్‌ను పక్కన పెట్టేసి మరీ అప్పలు తీసుకుంటున్నారు.

2017-18 బడ్జెట్ ప్రకారం ఆర్థిక సంవత్సరం మొత్తంలో ఏపీ సర్కారు చేయాల్సిన అప్పు రూ.26819 కోట్లు. కానీ.. ఇప్పటికే రూ.16వేల కోట్లకు పైనే తీసుకుందని చెప్పాలి. మరింత వివరంగా చెప్పాలంటే.. షెడ్యూల్ ప్రకారం తాజాగా తీసుకోవాల్సిన అప్పు రూ.వెయ్యికోట్లు మాత్రమే. కానీ.. ఇండెంట్ పెట్టింది మాత్రం రూ.3వేల కోట్లు కావటం చూస్తే.. ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇట్టే తెలుస్తుందని చెప్పాలి.

ఇంతకీ.. ఏపీకి ఇంత అప్పుల భారం ఎందుకు పెరుగుతోందంటే.. బాబు సర్కారు వైపే వేలెత్తి చూపించాలి. కేంద్రంలో బాబు జిగిరి దోస్తానా మోడీ సర్కారు ఉందన్న సంగతి తెలిసిందే. కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు సరిగా రాకపోవటం.. కేంద్ర పథకాల్లో అవకాశం ఉన్న చోటల్లా నిధులు తెచ్చుకోవటంలో రాష్ట్ర ప్రభుత్వ శాఖలు విఫలం కావటంతో కొత్త అప్పులు చేయటం మినహా మరో మార్గం కనిపించటం లేదు. దీనికి తోడు కొత్తగా వచ్చిన జీఎస్టీ పుణ్యమా అని కూడా ఆదాయం పడిపోయినట్లు చెబుతున్నారు.

అప్పులు అసాధారణ స్థాయిలో తీసుకుంటున్న బాబు సర్కారుకు మరో ఎదురుదెబ్బ తగిలే ప్రమాదం పొంచి ఉంది. ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉన్న నేపథ్యంలో ఎఫ్ ఆర్ బీఎం చట్టం కోరల్లో చిక్కుకోవటం ఒక ఎత్తు అయితే.. క్రెడిట్ రేటింగ్ దెబ్బ తినే ప్రమాదం ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆదాయం పెరిగితే తప్పించి.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సెటిల్ అయ్యే అవకాశం లేదని చెప్పాలి. ప్రస్తుతం ఏడాపెడాగా అప్పులు చేసిన నేపథ్యంలో.. రానున్న రోజుల్లో ఆచితూచి అప్పలు చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకూ పెరగని రాష్ట్ర ఆదాయం ఇప్పటికిప్పుడు పెరిగిపోతుందా? అన్నది అతి పెద్ద ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.