Begin typing your search above and press return to search.

అమ‌రావ‌తి ఏమో కానీ బాదేస్తున్నారుగా బాబు!

By:  Tupaki Desk   |   26 July 2017 5:05 AM GMT
అమ‌రావ‌తి ఏమో కానీ బాదేస్తున్నారుగా బాబు!
X
రాష్ట్ర విభ‌జ‌న పుణ్య‌మా అని ఏపీకి రాజ‌ధాని లేని ప‌రిస్థితి. ప‌దేళ్లు ఉమ్మ‌డి రాజ‌ధాని హైద‌రాబాద్‌ లో ఉండి.. జాగ్ర‌త్త‌గా ఏపీ కొత్త రాజ‌ధానిని ప్లాన్ చేసుకొండంటూ హామీ ఇచ్చినా..ఎవ‌రో త‌రుముతున్న‌ట్లుగా అమ‌రావ‌తిలో రాజ‌ధాని అంటూ ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఎంత‌లా ప‌రుగులు తీశారో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.

విభ‌జ‌న కార‌ణంగా పాతాళానికి దిగ‌జారిన ఆర్థిక స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారాలు వెత‌క‌టం మానేసి.. రాజ‌ధాని పేరుతో చేసిన హ‌డావుడి అంతా ఇంతా కాదు. అస‌లు భారీ లోటులో ఉన్న‌ప్ప‌టికీ తాత్కాలికం పేరుతో వేలాది కోట్ల రూపాయిల‌తో ఎడాపెడా బిల్డింగులు క‌ట్టేస్తూ.. ఎంత వేగంగా నిర్మాణాలు నిర్మిస్తున్నారో చూస్తున్నారా? అంటూ గొప్ప‌లు చెప్పుకోవ‌టం క‌నిపిస్తుంది.

ఈ ప్ర‌పంచంలో డ‌బ్బులు విసిరేయాలే కానీ.. ఏదీ అసాధ్యం కాదు. అలాంట‌ప్పుడు బిల్డింగుల్ని క‌ట్టించ‌టం పెద్ద ముచ్చ‌టే కాదు. అయిన‌ప్ప‌టికీ.. చేసిన కూసింత ప‌ని గురించి కొండంత గొప్ప‌గా చెప్పుకోవ‌టం బాబుకు ఓ అల‌వాటుగా మారింది. ఉమ్మ‌డి రాజ‌ధానిలో ఉంటూ ఖ‌ర్చుల్ని అదుపులో ఉంచుతూ.. ఆదాయాన్ని అంత‌కంత‌కూ పెంచుకున్న త‌ర్వాత‌.. అంద‌రి ఆమోదంతో రాజ‌ధాని నిర్మాణానికి తెర తీయాల్సింది పోయి.. అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్న బాబు పుణ్య‌మా అని ఏపీ ప్ర‌జ‌ల మీద భారీ భార‌మే ప‌డుతోంది.

రాష్ట్ర రాజ‌ధానికి.. ఏపీ ప్ర‌జ‌ల మీద భారానికి లింకు ఏమిట‌న్న సందేహం అక్క‌ర్లేదు. ఎందుకంటే.. రాష్ట్ర రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం పేరిట ఏపీ స‌ర్కారు నిర్ణీత ప‌న్ను నాలుగు శాతానికి అద‌నంగా నాలుగు శాతం ప‌న్ను వేస్తూ పెట్రోల్‌.. డీజిల్ రేట్ల‌ను పెంచేస్తున్న కార‌ణంగా ఏపీ ప్ర‌జ‌ల మీద భారం అంత‌కంత‌కూ పెరుగుతోంది.

ఏపీకి పొరుగున ఉన్న క‌ర్ణాట‌క రాష్ట్రంలోని ముచ్చ‌టే చూస్తే.. ఏపీ కంటే అక్క‌డి పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌లు త‌క్కువ‌లో త‌క్కువగా లీట‌ర్‌ కు రూ.6 నుంచి రూ.7 వ‌ర‌కూ త‌గ్గుతున్న ప‌రిస్థితి. దీంతో.. స‌రిహ‌ద్దుల్లోని వారు త‌మ పెట్రోల్‌.. డీజిల్ అవ‌స‌రాల‌కు పొరుగున ఉన్న క‌ర్ణాట‌క‌కు పోయి మ‌రీ ఆయిల్ కొట్టించుకునే దుస్థితి. దీంతో.. స‌రిహ‌ద్దుల్లోని పెట్రోల్ బంకులు ఈగ‌లు తోలుకునే ప‌రిస్థితి.

రోజులు గ‌డుస్తున్న కొద్దీ క‌ర్ణాట‌క పెట్రోల్ బంకుల దెబ్బ‌కు ఏపీ స‌రిహ‌ద్దుల్లోని పెట్రోల్ బంకుల యాజ‌మాన్యాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. వీటిని ప‌ట్టించుకోని బాబు స‌ర్కారు.. రాజ‌ధాని కోసం అన్న‌ట్లుగా పెంచిన ప‌న్నుపోటును నిరాటంకంగా కొన‌సాగిస్తున్నారు. రాజ‌ధాని పేరుతో ఇప్పుడున్న క‌ష్టాలు స‌రిపోన‌ట్లుగా ఈ త‌ర‌హా వాయింపుతో అంతిమంగా ఏపీ ప్ర‌జ‌ల్ని అడ్డంగా బుక్ చేస్తున్నారు. ఏపీ రాజ‌ధాని పేరుతో ఏపీ ప్ర‌జ‌ల మీద మోపుతున్న‌ భారీ భారం ఎప్ప‌టికి త‌గ్గుతుందో..?