Begin typing your search above and press return to search.

ఏపీలో పిల్ల‌ల‌కు మ‌రోసారి ఎండాకాలం సెల‌వులు!

By:  Tupaki Desk   |   19 Jun 2018 4:57 AM GMT
ఏపీలో పిల్ల‌ల‌కు మ‌రోసారి ఎండాకాలం సెల‌వులు!
X
జూన్ వ‌చ్చిందంటే చాలు అప్ప‌టివ‌ర‌కూ చెల‌రేగిపోయే భానుడు చ‌ల్ల‌బ‌డ‌టం.. కేర‌ళ నుంచి వ‌చ్చే రుతుప‌వ‌నాల‌తో ఆకాశం మ‌బ్బులు క‌మ్మ‌టం.. నిప్పుల కుంపటిగా ఉండే రాష్ట్రం కూల్ కావ‌టం మామూలుగా జ‌రిగేవి. కానీ.. ఈసారి ప్ర‌కృతికి కోపం వ‌చ్చింది.

ముందే వ‌చ్చేశాయ‌న్న రుతుప‌వ‌నాలు కేర‌ళ‌లో త‌మ ప్ర‌తాపాన్ని చూపించినా.. రెండు తెలుగు రాష్ట్రాల వ‌ర‌కూ వ‌చ్చేస‌రికి మాత్రం వ‌ర్షాన్ని మోసుకొచ్చే మేఘాలు ముఖం చాటేశాయి. దీంతో.. జూన్ మూడో వారం ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్నా వాతావ‌ర‌ణంలో ఎప్పుడూ లేని రీతిలో ఎండ‌లు మండుతున్న ప‌రిస్థితి.

రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్నిచోట్ల అయితే ఫార్టీ ట‌చ్ అవుతున్న ప‌రిస్థితి. జూన్ ఉడుకుతో జ‌నం బెంబేలెత్తిపోతున్న ప‌రిస్థితి. ఇక‌.. ఎండాకాలం సెల‌వుల్ని ముగించుకొని ఎంచ‌క్కా.. కొత్త హుషారుతో స్కూలుకు వెళ్లే పిల్ల‌లు తోట‌కూర కాడ‌ల్లా వ‌డ‌లిపోతున్న దుస్థితి. ఈ నేప‌థ్యంలో ఏపీ స‌ర్కారు కీల‌క నిర్ణ‌యాన్ని తీసుకుంది.

గ‌తంలో ఎప్పుడూ లేని రీతిలో రెండోసారి ఎండాకాలం సెల‌వుల్ని ఇచ్చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. బుధ‌వారం మొద‌లు మూడు రోజుల పాటు ప్ర‌భుత్వ‌.. ప్రైవేటు పాఠ‌శాల‌ల‌కు సెలవులు ఇస్తున్న‌ట్లుగా రాష్ట్ర మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి శాఖా మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు వెల్ల‌డించారు. ఏపీలో పెరుగుతున్న ఎండ‌ల తీవ్ర‌త కార‌ణంగా రెండోసారి సెల‌వుల నిర్ణ‌యాన్ని తీసుకున్న‌ట్లుగా ప్ర‌క‌టించారు. ఈ సెల‌వు రోజుల్లో ఎవ‌రైనా క‌క్కుర్తి ప‌డి క్లాసులు నిర్వ‌హిస్తే వారిపై క‌ఠిన చ‌ర్య‌లు ఉంటాయ‌న్నారు. ఆ మాట చెప్పే ముందు గంటా త‌న‌కు స‌న్నిహితుడు.. చుట్ట‌మైన నేతకు ప‌ర్స‌న‌ల్ గా ఒక‌మాట చెప్పేస్తే బాగుండేదేమో? ఏపీ తీసుకున్న నిర్ణ‌యాన్ని తెలంగాణ ప్ర‌భుత్వం కూడా ఫాలో అవుతుందా? ఎండ‌లైతే మాత్రం పిల్ల‌లు ఆ మాత్రం క‌ష్ట‌ప‌డ‌కుంటే ఎలా అని ఊరుకుండిపోతారా? అన్న‌ది చూడాలి.