Begin typing your search above and press return to search.

అయితే మీ బాగోతం తేలుస్తాం?

By:  Tupaki Desk   |   21 July 2017 12:09 PM GMT
అయితే మీ బాగోతం తేలుస్తాం?
X
ముల్లును ముల్లుతోనే తీయాలనే సిద్ధాంతాన్ని పాటిస్తున్నదో లేదా.. పొరుగురాష్ట్రం తెలంగాణతో సున్నం పెట్టుకోదలచుకుంటున్నదో అర్థం కావడం లేదు గానీ.. తెలంగాణ వారి దూకుడుకు ఏపీ సర్కారు కూడా కౌంటర్ ఎటాక్ ఇస్తోంది. ఏపీ లోని పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై స్టే ఇచ్చి పనులను ఆపు చేయించాలంటూ తెలంగాణ సర్కారు సుప్రీం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే.. తెలంగాణలో చేపడుతున్న అనేక ఎత్తిపోతల ప్రాజెక్టులను ఆపు చేయించాలని అవన్నీ చట్టవ్యతిరేకంగా జరుగుతున్న పనులని ఏపీ సర్కారు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది.

పోలవరం ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం పెంచడం వలన తెలంగాణలో కొత్తగా 9 మండలాల్లోని సుమారు 100 గ్రామాలు మునకకు గురయ్యే ప్రమాదం ఉన్నదని, ఈ ప్రాజెక్టు తాజా సామర్థ్యపు అంచనాల ప్రకారం, పర్యావరణ మదింపు అధ్యయనం పూర్తయ్యే వరకు పనులను ఆపేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ సర్కారు సుప్రీంలో ఓ అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ విషయంపై గురువారమే తుపాకీ డాట్ కామ్ ఓ కథనాన్ని అందించింది. అయితే తెలంగాణ సర్కార్ ఎటాక్ కు తాము కౌంటర్ ఎటాక్ ఇవ్వదలచుకున్నారో లేదా... ‘మా పోలవరానికి మీరు అడ్డు పడితే.. మీ బాగోతం కూడా తేల్చేస్తాం’ అంటూ గొడవ పెట్టుకోదలచుకున్నారో గానీ.. మొత్తానికి తెలంగాణ లో కృష్ణానదీ జలాలను మరింతగా వినియోగించుకునేందుకు పాలమూరు- రంగారెడ్డి - దిండి - శ్రీరామదాసు ఎత్తిపోతల ప్రాజెక్టులు అన్నీ కూడా చట్ట వ్యతిరేకంగా జరుగుతున్నవే అంటూ ఏపీ ఫిర్యాదులకు దిగింది.

కేంద్రం అపెక్స్ కౌన్సిల్ కు , కృష్ణా బోర్డుకు ఏపీ ఇదివరలో కూడా ఇదే అంశాలపై ఫిర్యాదు చేసింది. ఉభయ రాష్ట్రాల మధ్య రాజీ సమావేశాలు నిర్వహించిన బోర్డు ఏ సంగతీ తేల్చలేక అప్పట్లో చేతులెత్తేసింది. తాజాగా ఏపీ మళ్లీ ఫిర్యాదు లేఖలు రాయడంతో ఈ వివాదాలు మళ్లీ తెరమీదకు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది.