Begin typing your search above and press return to search.

కేంద్రంతో కయ్యానికి కాలు దువ్వడమే!

By:  Tupaki Desk   |   25 July 2017 5:30 PM GMT
కేంద్రంతో కయ్యానికి కాలు దువ్వడమే!
X
ఏపీ ప్రభుత్వానికి- కేంద్రప్రభుత్వానికి మధ్య ఇదివరకు ఉన్నంతటి సుహృద్భావ వాతావరణం ఇప్పుడు లేదా? క్రమంగా పలచబడుతున్నదా? రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రంతో కయ్యం పెట్టుకోవడానికైనా ఏపీ సర్కారు సిద్ధపడుతున్నదా? అనే సందేహాలు ఇప్పుడు కలుగుతున్నాయి. కొన్ని పరిణామాలు గమనిస్తున్నప్పుడు.. కేంద్రం- ఏపీ పట్ల ఏమాత్రం మెతక వైఖరితో లేదని తేలిపోతోంది. ప్రత్యేకించి విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను అమల్లోకి తీసుకురావడానికి మూడేళ్లుగా ఇప్పటికీ చురుగ్గా వ్యవహరించని ఏపీ సర్కారు కాలపరిమితి కూడా మీరిపోతున్న తరుణంలో కళ్లు తెరచి... ఇప్పుడు తొందరపడుతోంది. కేంద్రం నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేయడం ద్వారా వారితో సున్నం పెట్టుకుంటోంది.

విభజన చట్టం పదోషెడ్యూలు లోని ఆస్తుల పంపకంలో పీటముడి ఎదురవుతోంది. ఇదంతా ఉమ్మడి ఆస్తులను రెండు రాష్ట్రాలు ఎలా పంచుకోవాలనే దానికి సంబంధించిన వ్యవహారం. అయితే.. ‘సదరు ఆస్తులు ఏ ప్రాంతంలో ఉంటే అవి ఆ రాష్ట్రానికి చెందుతాయ్’ అంటూ కేంద్ర హోం శాఖ క్లారిటీ ఇచ్చింది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ చాలా నష్టపోతుంది.

ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి రాజధాని హైదరాబాదు కావడం వల్ల ఉమ్మడిగా ప్రభుత్వానికి ఉండే చాలా ఆస్తులు హైదరాబాదులోనే ఉన్నాయి. కేంద్రహోంశాఖ చెప్పిన నిబంధన ప్రకారం.. ఇప్పుడు అవన్నీ తెలంగాణ పాలవుతాయి. ఏవో కొన్ని నామమాత్రపు ఆస్తులు తప్ప.. ఏపీకి దక్కేదేమీ ఉండదు. ఆ రకంగా తమకు చాలా అన్యాయం జరిగిపోతున్నది గనుక.. ఏపీ సర్కారు కేంద్రంతో లాబీయింగ్ చేసి, వారికి పలుమార్లు విన్నవించుకుని ఫలితం లేక ఇప్పడు సుప్రీం కోర్టు గడప తొక్కుతోంది.

అయితే ఏపీ కోర్టుకు వెళ్లడం అనేది ఒక రకంగా కేంద్ర సర్కారుతో సున్నం పెట్టుకోవడమే అని కొందరు విశ్లేషిస్తున్నారు. అసలే మోడీ సర్కారుతో, చంద్రబాబు సంబంధాలు దెబ్బతింటున్నాయనే ప్రచారం ఒకటి రాజకీయ వర్గాల్లో మొదలైంది. వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి కాబోతుండగా.. ఏపీ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో అనే భయాలు కూడా మొదలవుతున్నాయి. ఇలాంటి సంక్లిష్ట సమయంలో కేంద్రంతో కయ్యంలా ఏపీ కోర్టుకు వెళ్తుండడం సాహసమే. కానీ, కోర్టుకు వెళ్లడం తప్ప వారికి ప్రత్యామ్నాయం కూడా లేదు. దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో వేచాచూడాలి.