తొలుత నరసాపురం..లాస్ట్ లో రంపచోడవరం

Wed May 22 2019 23:12:38 GMT+0530 (IST)

సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. అటు కేంద్రంతో పాటు ఇటు రాష్ట్రంలో ఎవరు విన్నర్ లో రేపు తేలిపోతుంది. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డా... ప్రధాని పీఠంలో మాత్రం పాత మోదీనే కూర్చుంటారని ఇప్పటికే దాదాపుగా తేలిపోయింది. అయితే ఏపీ అసెంబ్లీ ఫలితాల్లో మాత్రం అంతగా స్పష్టత లేదు. మెజారిటీ సర్వే సంస్థలు విపక్ష వైసీపీ ఈ దఫా బంపర్ మెజారిటీతో విజయం సాధిస్తుందని చెప్పగా... ఓ మూడు సంస్థలు మాత్రం మరోమారు టీడీపీనే అధికారం చేపడుతుందని చెప్పాయి.ఈ నేపథ్యంలో సార్వత్రికంపై పెద్దగా ఆసక్తి లేకున్నా... ఏపీ అసెంబ్లీ ఫలితాలపై మాత్రం హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో కౌంటింగ్ డే అయిన రేపు ఎప్పటిదాకా ఈ టెన్షన్ ఉంటుందన్న అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రేపు ఉదయం 8 గంటలకే కౌంటింగ్ ప్రారంభమైనా చివరి ఫలితం తేలేందుకు ఏకంగా అర్ధరాత్రి దాకా సమయం పట్టొచ్చని ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదీ చెబుతున్నారు. సరే.. లాస్ట్ ఫలితం మిడ్ నైట్ దాకా సమయం తీసుకున్నా.. మరి ఫస్ట్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది? ఫస్ట్ ఫలితం ఏ నియోజకవర్గం నుంచి వస్తుందన్న అంశాలపై కూడా క్లారిటీ వచ్చేసినట్టేనని చెప్పక తప్పదు.

అతి తక్కువ రౌండ్లు అంటే...13 రౌండ్ల కౌంటింగ్ ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గానికి చెందిన ఫలితం అన్నింటికంటే ముందు వెలువడుతుందట. ఈ ఫలితం మధ్యాహ్నం 2 గంటలకు వెలువడుతుందని ద్వివేదీ చెప్పారు. ఇక 36 రౌండ్ల కౌంటింగ్ ఉన్న తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం ఫలితం అన్నింటికంటే ఆలస్యంగా వస్తుందట. ఈ ఫలితం వచ్చేసరికి అర్దరాత్రి దాటొచ్చన్న వాదన వినిపిస్తోంది. మొత్తంగా ఫస్ట్ తో పాటు లాస్ట్ ఫలితం కూడా గోదావరి జిల్లాల నుంచే వెలువడతాయన్న మాట. ఫస్ట్ పలితం - చివరి ఫలితాల సమయం ఎలా ఉన్నా... ఏ పార్టీ విజయం సాధిస్తుందన్న విషయం మధ్యాహ్నం 12 గంటలలోగా తేలిపోతుందన్న వాదన వినిపిస్తోంది.