ఏపీ రిజల్ట్: బరిలో భారీ మెజారిటీ ఎవరికి?

Wed May 22 2019 23:00:03 GMT+0530 (IST)

ఏపీ రాజకీయం చాలా చిత్రమైనది. అక్కడ ఒకే నాయకుడిని వరసగా గెలిపించిన నియోజకవర్గాలు బోలెడు ఉన్నాయి కానీ.. అత్యధిక భారీ మెజారిటీలు కట్టబెట్టడం ఏపీ ప్రజల తత్వం కాదు! దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న ఏపీలో భారీ మెజారిటీలు నమోదైన సందర్భాలు తక్కువ.ఎప్పుడో పీవీ నరసింహారావు ప్రధాని హోదాలో నంద్యాల నుంచి ఎంపీగా పోటీ చేసినప్పుడు ఆ తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టుకుని కడప నుంచి ఎంపీగా పోటీ చేసినప్పుడు ఏపీలో మెజారిటీ లెక్కలు జాతీయ స్థాయిలో ప్రముఖంగా నిలబడ్డాయి.

ఇక ఉమ్మడి ఏపీలో భారీ మెజారిటీలు తెలంగాణలో నమోదయ్యేవి కానీ.. ఏపీలో కాదు! ఒకే పార్టీకి భారీ సీట్లను ఇచ్చిన సందర్భాల్లో కూడా ఎవరికీ భారీ మెజారిటీలు మాత్రం ఇచ్చే వారు కాదు ఏపీ ప్రజలు. కొంతలో కొంత భారీ మెజారిటీలు సాధించే వారుమాత్రం ఉండేవారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పులివెందుల నుంచి భారీ మెజారిటీని సాధించేవారు. వైఎస్ అరవై వేల స్థాయిలో మెజారిటీలు సాధించిన దాఖలాలున్నాయి. చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి నలభై యాభై వేల ఓట్ల మెజారిటీని సాధించారు గతంలో. గత ఎన్నికల్లో విభజిత ఏపీలో పులివెందుల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మంచి మెజారిటీనే వచ్చింది.

అదంతా గతం.. మరి కాసేపట్లో వెల్లడి అయ్యే ఫలితాల్లో ఎవరికి భారీ మెజారిటీ దక్కుతుందనేది ఆసక్తిదాయకంగా మారింది. ఈ ఘనతను ఈ సారి ఎవరు దక్కించుకుంటారనేది చర్చనీయాంశం అవుతోంది.

పులివెందుల నుంచి పోటీలో ఉన్న వైఎస్ జగన్ ఆ ఘనతను సొంతం చేసుకుంటారా లేక చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి భారీ మెజారిటీతో నెగ్గుతారా.. అనే అంశాలతో పాటు..ఈ మెజారిటీ లెక్కల విషయంలో మరెవరైనా మాస్ లీడర్ రికార్డు స్థాయి మెజారిటీని నమోదు చేస్తారా? అనేది ఆసక్తిదాయకమైన అంశమే.

భీమవరం - గాజువాక.. రెండు సీట్ల నుంచి పోటీ చేసిన పవన్ కల్యాణ్ - మంగళగిరి నుంచి పోటీలో ఉన్న లోకేష్.. తొలి సారి ఎన్నికల్లో పోటీ చేయడంతోనే ఈ మెజారిటీ అద్భుతాలు సాధిస్తారా? అనేది కూడా పాయింటే. అయితే ఇంతకీ వీరు గెలుస్తారా? అనే పాయింట్ కూడా అదే స్థాయిలో చర్చనీయంశంగా ఉంది. మొత్తానికి ఈ సారి భారీ మెజారిటీతో నెగ్గే నాయకుడు ఎవరో మరి కొన్ని గంటల్లోనే తేలిపోనుంది.