Begin typing your search above and press return to search.

ఇన్ని తప్పులు చేసిన ఏపీ ఈసీపై చర్యలు ఉండవా?

By:  Tupaki Desk   |   12 April 2019 8:57 AM GMT
ఇన్ని తప్పులు చేసిన ఏపీ ఈసీపై చర్యలు ఉండవా?
X
నిప్పును ఎవరు పట్టుకున్నా కాలుతుంది. బురదలో చేతులు పెడితే.. ఎవరికైనా అంటుతుంది. మరి.. కొందరు చేస్తే తప్పు.. మరికొందరు చేస్తే ఒప్పు ఎందుకు అవుతుంది? ఎన్నికల్ని నిస్పక్ష పాతంగా.. ప్రశాతంగా నిర్వహించాల్సిన ప్రాధమిక బాధ్యత ఎన్నికల సంఘానిది. మరి.. ఆ విషయంలో ఫెయిల్ అయితే? ఎన్నికల సంఘం నిర్వాకంతో లక్షలాది మంది ప్రజలు ఇబ్బందులకు గురైతే దానికి ఎవరు సమాధానం చెబుతారు? ప్రజలు కట్టిన పన్ను సొమ్ముతో నిర్వహించే ఎన్నికల్లో తప్పులు దొర్లితే.. దానికి బాధ్యులు ఎవరు? ఎవరు శిక్ష అనుభవిస్తారు.

ఎన్నికల సందర్భంగా ఏ చిన్న తప్పు జరిగినా తాట తీస్తానని ఘీంకరించే ఎన్నికల సంఘం.. తాను తప్పులు చేస్తే ఏమనాలి? ఎన్నికల ప్రక్రియ మొత్తంలో కీలకం ఈవీఎంలు పని చేయటం. మరి.. ఆ విషయంలోనే ఫెయిల్ అయితే అది దేనికి నిదర్శనం? ఎన్నికల సందర్భంగా వినియోగించే ఈవీఎంలను ముందస్తుగా చెక్ చేసుకొని.. ఎలాంటి సాంకేతిక సమస్యలు ఎదురుకాకుండా చూడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం మీద ఉంది.

మరి.. ఆ ఇష్యూలో ఫెయిల్ కావటం వల్ల ఏపీలో నిర్వహించిన ఎన్నికల్లో విపరీతమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఏపీ ప్రజలు. వేలాది ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు ఎదురు కావటంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభం కావటం.. గంటల కొద్దీ క్యూలైన్లో వెయిట్ చేయాల్సి రావటం జరిగింది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత.. ఓటు వేసేందుకు అడ్డుకునే వారి మీద తీవ్రమైన నేరారోపణ చేయటమే కాదు.. శిక్ష కూడా భారీగా ఉంటుంది. మరి.. సాంకేతిక సమస్యల కారణంగా ఓట్లు వేయటానికి వచ్చిన వేలాది మందికి ఆ అవకాశం లేకుండా చేసిన ఎన్నికల సంఘం మీదా.. అధికారుల మీద ఎలాంటి శిక్ష విధించాలి? అన్నది ప్రశ్న.

ఓటు వేయటం కోసం సదూర ప్రాంతం నుంచి వచ్చిన వారు తమ ఓటుహక్కును వినియోగించుకునే పరిస్థితి లేకుండా చేసిన ఏర్పాట్లకు ఎవరు బాధ్యత వహిస్తారు? ఓటు వేయాలని ఎంతో తపించిన వారికి నిరాశలో కూరుకుపోయేలా.. వ్యవస్థ మీద నమ్మకం సన్నగిల్లేలా.. ఎన్నికల సంఘం సామర్థ్యం మీద సందేహాలు కలిగేలా చేసిన తీరుకు అధికారులు ఎంత మూల్యం చెల్లిస్తారు? అందరిని అకౌంటబులిటీ చేసే ఎన్నికల సంఘం.. తాను ఆ బాధ్యత ఎందుకు తీసుకోదు? కేవలం సారీ చెబితే సరిపోతుందా? ఎన్నికల సంఘం వ్యవస్థలో ఒక బాగం కానీ అదేమీ సూపర్ పవర్ కాదు కదా?