Begin typing your search above and press return to search.

పవన్ ట్వీట్లకు ఏపీ డీజీపీ కౌంటర్?

By:  Tupaki Desk   |   24 Jan 2017 5:09 PM GMT
పవన్ ట్వీట్లకు ఏపీ డీజీపీ కౌంటర్?
X
రెండు రోజుల వ్యవధిలో ఏపీ రాజకీయ పరిస్థితి ఒక్కసారిగా మారిపోవటం తెలిసిందే. జల్లికట్టుపై విధించిన బ్యాన్ కు వ్యతిరేకంగా చెన్నైలోని మెరీనాబీచ్ లో తమిళులు చేసిన శాంతియుత నిరసనల్ని స్ఫూర్తిగా తీసుకొని.. జనవరి 26న రిపబ్లిక్ డే రోజు విశాఖలోని ఆర్కేబీచ్ దగ్గర శాంతియుత నిరసనను చేపట్టాలన్న ప్రకటన విడుదల కావటం.. దీనికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆ వెంటనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం మద్దతు ప్రకటించటమే కాదు.. శాంతియుతంగా కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టాలని పిలుపునిచ్చారు.

ఇలా ఒకరి తర్వాత ఒకరుగా చేసిన ప్రకటనలతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. రిపబ్లిక్ డే రోజున విశాఖలోని ఆర్కే బీచ్ దగ్గర పరిణామాలుఏ విధంగా మారతాయన్నది ఉత్కంటగా మారింది. దీనికితోడు.. ఒకటి తర్వాత ఒకటిగా నాన్ స్టాప్ గా పవన్ కల్యాణ్ ట్వీట్లు చేయటం.. ఇవి సోషల్ మీడియాలో భారీ ఎత్తున వైరల్ కావటంతో పాటు.. పెద్ద ఎత్తున దీనిపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రిపబ్లిక్ డే రోజున విశాఖలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయన్నది ఇప్పుడు ఉత్కంటగా మారింది. మరోవైపు.. పవన్ ఉద్యమానికి దన్నుగా పాటలతో కూడినఆల్బంను విడుదల చేశారు.

ఇదిలా ఉండగా.. తాజాగా ఏపీ డీజీపీ మీడియాతో మాట్లాడారు. సోషల్ మీడియా ద్వారాకానీ.. ఫోన్ కాల్స్ ద్వారా కానీ రాష్ట్రంలో శాంతిభద్రతలకు ఎవరు విఘాతం కలిగించే ప్రయత్నం చేసినా కఠిన చర్యలు తీసుకోనున్నట్లు వార్నింగ్ ఇచ్చేశారు. ఈ నెల 26న ఆందోళనల్లో పాల్గొనాలని సోషల్ మీడియా ద్వారా భారీఎత్తున సందేశాల ప్రచారం సాగుతోందని.. యువత ఎవరూ అలాంటి కార్యక్రమాల్లో పాల్గొనకూడదని ఆయన సూచన చేశారు.

సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం.. ఎలాంటి సమావేశాలు.. నిరసనలు.. ఆందోళనలు జరపాలన్నా పోలీసుల అనుమతి తప్పనిసరి అని చెప్పారు. ఈ సందర్భంగా పవన్ చేసిన ట్వీట్లను గుర్తు చేసుకోవాల్సినఅవసరం ఉంది. శాంతియుతంగా నిరసన చేయటం పౌరుడిగా ఉండేహక్కు అని.. దాన్ని ఎవరూ కాదనలేరంటూ ఆయన వరుస ట్వీట్లు చేశారు. పవన్ ట్వీట్లకు కౌంటర్ అన్న రీతిలో ఏపీ డీజీపీ వ్యాఖ్యలు ఉండటం గమనార్హం. భావ ప్రకటన స్వేచ్ఛకు తాము వ్యతిరేకం కాదన్న డీజీపీ.. శాంతిభద్రతల్ని విఘాతం కలిగించేలా చేస్తే చూస్తూ ఊరుకోమని స్పష్టం చేశారు.

ఇక.. కాపు నేత ముద్రగడ పద్మనాభం చేపట్టిన సత్యాగ్రహ పాదయాత్రకు ఎలాంటి పోలీసు అనుమతి లేదని చెప్పిన ఆయన.. కిర్లంపూడిలో ప్రస్తుతం 144వ సెక్షన్ అమల్లో ఉందని.. కాపు ఐక్యకార్యాచరణ సమితి నేతల్ని అరెస్ట్ చేసినట్లుగా ప్రకటించారు. తాము ఎవరికి వ్యతిరేకం కాదని.. ఏపీ శాంతిభద్రతల్ని కాపాడటం తమ లక్ష్యంగా పేర్కొన్నారు. మొత్తంగా చూస్తే.. అటు విశాఖ ఆర్కే బీచ్ లో నిర్వహించ తలపెట్టిన మౌన నిరసనకు.. ముద్రగడ చేయాలనుకున్న సత్యాగ్రహ పాదయాత్రకు పర్మిషన్లు లేవని చెప్పటం గమనార్హం.