ఇక తట్టా బుట్టా సర్దుకుందామా?

Wed Sep 13 2017 10:40:02 GMT+0530 (IST)

ఏపీ కాంగ్రెస్ పార్టీలోని నాయకులందరికీ దాదాపుగా స్పష్టత వచ్చేసింది. తమకు వచ్చిన స్పష్టతను అధిష్టానానికి కూడా ‘క్యారీ ఫార్వార్డ్’ చేసేందుకు వారు ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మట్టికొట్టుకుపోయినప్పటికీ.. ఏదో ఒక నాటికి కుంటుతూనో దగ్గుతూనో తమ పార్టీ మళ్లీ మనుగడలోకి వచ్చే అవకాశం ఉంటుందనే ఆశ కొందరు నాయకులకు మిగిలిపోయింది. అలాంటి వాళ్లు ఆ పార్టీనే అంటిపెట్టుకుని ఉండిపోయారు. అయితే నంద్యాల ఉప ఎన్నిక కూడా పూర్తయిన తర్వాత.. ఇక ఎప్పటికీ పార్టీ తిరిగి జవసత్వాలు పుంజుకోవడం అసాధ్యం అనే అభిప్రాయం నేతలకు వచ్చినట్లుగా తెలుస్తోంది. తాజాగా ఈ ఓటమిపై ఓ సమీక్ష సమావేశం పెట్టుకున్న ఏపీ కాంగ్రెస్ నాయకులు.. అసలు తాము పోటీకి దిగడమే తప్పు అనే అభిప్రయానికి వచ్చారంటే.. త నైరాశ్యంలో ఉన్నారో అర్థమౌతుంది. దిగ్విజయ్ సింగ్ సమక్షంలో అమరావతిలో ఈ సమావేశం జరిగింది. ఇక మీదట పార్టీ అధిష్టానం ఖర్చులు భరిస్తే తప్ప.. కాంగ్రెరస్ తరఫున ఎన్నికల్లో పోటీచేయడానికి ఎవరూ ముందుకువచ్చే అవకాశం కూడా లేదని పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి తేల్చేయడం విశేషం. రాష్ట్రాన్ని విభజించినందుకు సోనియా - రాహుల్ లు ఏపీలో బహిరంగసభ పెట్టి ఏపీ ప్రజలను క్షమాపణ కోరితే తప్ప.. పార్టీ బతికిబట్టకట్టడం సాధ్యం కాదని కొందరు నేతలు తేల్చేశారట. నిజానికి వారి డిమాండ్ కూడా సాధ్యం కాదు.

అయితే పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారం ప్రకారం.. ఈ సమావేశంలో చర్చోపచర్చలు చాలా హాట్ గానే జరిగాయి. కాంగ్రెస్ కు భవిష్యత్ లేదనే క్లారిటీకి వచ్చిన నేతలు.. ఇక ఎవరి దారి వారి చూసుకుంటే మంచిదనే అభిప్రాయాలు కూడా వ్యక్తం చేశారుట. పార్టీని నమ్ముకుంటే.. ఇక మునిగినట్టేనని ఇతర పార్టీల్లోకి వెళ్లడమే మంచిదని పలువురు నేతలు చర్చించుకున్నారుట. కాంగ్రెస్ నేతలే గనుక.. ఆ పార్టీని వీడదలచుకుంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ కే ఎక్కువ ఎడ్వాంటేజీ ఉంటుందని అంతా అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ లో గట్టి నాయకులకు కొదవ లేకపోయినా.. పార్టీ దెబ్బకు వారంతా కుదేలవుతున్నారు. అలాంటి వారు అధికార పార్టీ తెలుగుదేశం వైపు వెళ్లలేకపోవచ్చు. రాష్ట్రంలో వారికి ఏకైక ప్రత్యామ్నాయం వైకాపానే అవుతుంది. ఆ రకంగా వైకాపాకు కాంగ్రెస్ నుంచి త్వరలో వలసలు ఉంటాయనే వాదన వినిపిస్తోంది.