Begin typing your search above and press return to search.

జ‌గ‌న్‌ కు అస‌లు స‌మ‌స్య బ‌డ్జెట్‌...

By:  Tupaki Desk   |   22 Jun 2019 4:43 PM GMT
జ‌గ‌న్‌ కు అస‌లు స‌మ‌స్య బ‌డ్జెట్‌...
X
ఏపీ ముఖ్య‌మంత్రిగా ప‌గ్గాలు చేప‌ట్టింది మొద‌లు త‌న‌దైన శైలిలో ఆస‌క్తిక‌ర నిర్ణ‌యాలు - ప్ర‌జాక‌ర్షక చ‌ర్య‌ల‌తో ముందుకు సాగుతున్న వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌ మోహ‌న్‌ రెడ్డికి అస‌లు స‌మ‌స్య రాష్ట్ర బ‌డ్జెట్ అని చ‌ర్చ జ‌రుగుతోంది. వివిధ శాఖల నిర్వహణకు సంబంధించిన బిల్లులు గత ఆర్థిక సంవత్సరంలో చెల్లించకుండా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోకి తీసుకొచ్చారు. మొత్తంగా 22 వేల కోట్ల రూపాయల బిల్లుల భారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంపై పడుతోంది. ఈ పాత అప్పుల‌కు తోడుగా జ‌గ‌న్ ప్ర‌క‌టించిన న‌వ‌ర‌త్నాల అమ‌లుకు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోనున్నార‌నే ఆస‌క్తి...ఇందుకు నిధుల స‌మీక‌ర‌ణ ఎలా చేస్తార‌నే ఉత్కంఠ స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతోంది.

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు అతిపెద్ద స‌వాలుగా నిధుల స‌మీక‌ర‌ణ‌ను పేర్కొంటున్నారు. ఆర్థిక క‌ష్టాల‌కు మొద‌టి కార‌ణంగా...పెద్ద ఎత్తున ఆదాయం స‌మ‌కూరే మ‌ద్యంపై నిషేధం విధించ‌డ‌మేన‌ని చెప్తున్నారు.పెద్ద ఎత్తున నిధులు ఖ‌జ‌నాకు నిధుల రాక నిలిచిపోయింద‌ని చ‌ర్చించుకుంటున్నారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఆదాయం వ‌చ్చే ప‌రిశ్ర‌మ‌లు - రియ‌ల్ ఎస్టేట్ రంగం నుంచి సైతం ఆ మేర‌కు ఊపు లేదు. పారిశ్రామిక రంగం నుంచి నిధులు స‌మకూరే అంత ప‌రిస్థితి ఇంకా ఏపీలో రాలేద‌ని తెలుస్తోంది. దీంతో..నిధులకు స‌హ‌జంగానే క‌ట‌క‌ట ఉంది. ఇదే స‌మ‌యంలో వైఎస్ జ‌గ‌న్ ప్ర‌క‌టించిన న‌వ‌ర‌త్నాల అమ‌లుకు పెద్ద ఎత్తున నిధులు కావాల్సి ఉంది. ఇప్ప‌టికే న‌వ‌ర‌త్నాల అమ‌లుకు వైస్ చైర్మ‌న్‌గా విశ్రాంత ఐఏఎస్ శామ్యూల్‌ ను నియ‌మించింది. ఇలా కార్య‌క్ర‌మాల విష‌యంలో దూకుడు కొన‌సాగుతుండ‌గా...మ‌రోవైపు బ‌డ్జెట్ ఒత్తిడి స‌హ‌జంగానే ఉంది.

ఇదిలాఉండ‌గా - ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. 'మూడు వారాల్లోగా రాష్ట్ర బడ్జెట్‌ ను మీరే చూస్తారు. రెండు లక్షల కోట్ల రూపాయల రేంజ్‌ లో రాష్ట్ర బడ్జెట్‌ ఉంటుంది. అన్ని పథకాలకూ సరిపడా వనరులను సమీకరించుకుంటాం' అని చెప్పారు. ఢిల్లీలో జీఎస్టీ మండలి 35వ సమావేశం అనంతరం బుగ్గన మీడియాతో మాట్లాడారు. ఏపీకి విభజన వల్ల జరిగిన నష్టం - రావాల్సిన నిధుల గురించి కేంద్రానికి చెప్పామన్నారు. స్వయం సహాయ సంఘాలకు రాష్ట్రం చెల్లించే వాటాను భరించాలని కోరినట్లు వివరించారు. పోలవరం - రాజధాని నిర్మణానికి బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశామన్న బుగ్గన.. కేంద్ర బడ్జెట్‌ పరిశీలించాక రాష్ట్ర ఆదాయ వనరులను చూసుకుంటామని తెలిపారు. తమ ప్రభుత్వానికి 'నవరత్నాలు' చాలా ముఖ్యమని, గత ప్రభుత్వ అంశాలు ఇప్పుడు కనుమరుగవుతాయని తెలిపారు. రాష్ట్రానికి ఆదాయాల మార్గం కోసం అన్వేషిస్తున్నామని బుగ్గన చెప్పారు. బడ్జెట్‌ను బ్యాలెన్స్‌డ్‌గా తయారు చేస్తామని.. ప్రభుత్వ ధనాన్ని వృథా చేయకుండా - దుర్వినియోగం అవకుండా అరికడతామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జ‌గ‌న్ దిశానిర్దేశం - ఆర్థిక మంత్రి ప‌రిజ్ఞానంతో బ‌డ్జెట్‌ ను ఏ విధంగా ప్ర‌వేశ‌పెడ‌తార‌నే ఆస‌క్తి స‌ర్వ‌త్రా నెల‌కొంది.