Begin typing your search above and press return to search.

ఆంధ్రా బిర్యానీ వడ్డించారని తెలిస్తే కేసీఆర్ రియాక్షన్ ఏమిటో?

By:  Tupaki Desk   |   12 Oct 2019 7:54 AM GMT
ఆంధ్రా బిర్యానీ వడ్డించారని తెలిస్తే కేసీఆర్ రియాక్షన్ ఏమిటో?
X
ఒకరు చేసిన తప్పు కారణంగా వేదనకు గురైతే.. బాధితుడు సైతం బాద్యత మరిచి.. ఇష్టారాజ్యంగా అనేస్తే.. ఇద్దరికి తేడా ఏముంటుంది? ఆంధ్రోళ్లు తెలంగాణను దారుణంగా మోసం చేశారని.. అంతకు మించి అవమానాలకు గురి చేశారని.. భాషను.. యాసను..కల్చర్ ను ఎగతాళి చేశారంటూ ఉద్యమ సమయంలో కేసీఆర్ చేసిన ఆరోపణలు అన్ని ఇన్ని కావు. తమకు తాము స్వయం మేధావులుగా.. తమకు మించిన తెలివైనోళ్లు ఈ ప్రపంచంలో లేరని ఫీలయ్యే ఆంధ్రోళ్లు కేసీఆర్ మాటల్ని పెద్దగా పట్టించుకున్నది లేదు.

తమ తరఫున వాదనను వినిపించే సత్తా ఆంధ్రా ప్రాంతానికి చెందిన రాజకీయ నేతలకు లేకపోవటంతో.. ఉద్యమ వేళలో ఎదురయ్యే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలే పరిస్థితి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాము అవమానాలకు గురి అయ్యామంటూ ఆరోపణలు చేసిన కేసీఆర్.. సమయం చూసుకొని ఆంధ్రా ప్రాంతంపై తనకున్న అక్కసును వెళ్లగక్కే విషయంలో వెనక్కి తగ్గలేదు.

అవకాశం వచ్చిన ప్రతిసారీ ఆంధ్రాను ఉద్దేశించి మాటలు అన్న గులాబీ బాస్.. ఆంధ్రోళ్లు తినే బిర్యానీ పేడగా అభివర్ణించి.. ఆ ప్రాంతానికి చెందిన వారిని దారుణంగా హర్ట్ చేశారు. తమను అవమానించారన్న ఆరోపణ చేస్తూ.. ఆంధ్రా ప్రాంతానికి చెందిన అంశాలపై ఆయన వెళ్లగక్కిన అక్కసెంతో. ఇదిలా ఉంటే.. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తన భారత పర్యటనలో భాగంగా తమిళనాడులో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.

జిన్ పింగ్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విందులో ప్రత్యేకంగా తయారు చేసిన మెనూలో ఆంధ్రా బిర్యానీ ఉండటం విశేషం. తాము తినే ఆహారం గురించి దారుణమైన వ్యాఖ్యలు చేసిన మాటల్ని ఆంధ్రోళ్లు తరచూ గుర్తుకు తెచ్చుకుంటూ వేదన చెందుతుంటారు. అలాంటివారు పలువురు.. తమ బిర్యానీ పేడ అయితే.. దేశానికి వచ్చిన అతిధికి వడ్డిస్తారా? అన్న వ్యాఖ్యల్ని చేయటం కనిపిస్తోంది.

చైనా అధ్యక్షుడికి ఆంధ్రా బిర్యానీ వడ్డించారని తెలిస్తే.. ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో అన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. చివరగా చెప్పేదేమంటే.. ఎవరి గురించి వారు గొప్పలు చెప్పుకోవటం తప్పుకాదు. కానీ.. ఎదుటోళ్లను పొగడకున్నా ఫర్లేదు.. మనోభావాలు దెబ్బతినేలా అవమానించేలా మాట్లాడకూడదు. ఆ విషయం కేసీఆర్ ఎప్పుడు తెలుసుకుంటారో?