Begin typing your search above and press return to search.

టీడీపీ ఎంపీ అభ్యర్థి ఆస్తులు వేలానికి..!

By:  Tupaki Desk   |   24 March 2019 5:47 AM GMT
టీడీపీ ఎంపీ అభ్యర్థి ఆస్తులు వేలానికి..!
X
బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని ఎగ్గొట్టడం.. ఇదో వైట్ కాలర్ మోసం. ఇప్పడు జాతీయ స్థాయిలో దీనికి సంబంధించి చర్చ జరుగుతూ ఉంది. ఇలాంటి వారు అంతర్జాతీయ దొంగలుగా మారారు. పరారీలో ఉన్న విజయ్ మాల్యా, నీరవ్ మోడీలది ఇదే కథ. ప్రభుత్వ రంగ బ్యాంకులనుంచి భారీగా వేల కోట్ల రూపాయలను అప్పులుగా తీసుకుని.. వాటిని తిరిగి చెల్లించకుండా వాళ్లు పరార్ అయ్యారు.

ఇలాంటి వారు చాలా మందే ఉన్నారు. వారిలో ఇద్దరు.. మాల్యా, నీరవ్ లు లండన్ లో తలదాచుకున్నారు. వారిని అక్కడ నుంచి రప్పించేందుకు భారత ప్రభుత్వం తన వంతు ప్రయత్నాలు సాగిస్తూ ఉంది.అవేవీ సఫలం అవుతున్న దాఖలాలు కనిపించడం లేదు.

ఆ సంగతలా ఉంటే.. బ్యాంకుల నుంచి నాలుగు వేల కోట్ల రూపాయల వరకూ అప్పులు తీసుకుందనే అరోపణను ఎదుర్కొంటున్న ట్రాన్స్ ట్రాయ్ సంస్థ విషయంలో ఒక ఆసక్తిదాయకమైన వార్త వచ్చింది. ఈ సంస్థకు ఇచ్చిన రుణాలను ఎగ్గొట్టినందుకు కానీ.. టీడీపీనేత రాయపాటి సాంబశివరావు ఇంటిని వేలం వేస్తున్నట్టుగా ఆంధ్రా బ్యాంక్ ఒక ప్రకటన విడుదల చేసింది.

తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించని నేపథ్యంలో రాయపాటి ఇంటిని వేలం వేస్తున్నట్టుగా ఆంధ్రా బ్యాంక్ ప్రకటించింది. దాని కనీస విలువ ఏడు కోట్ల రూపాయల వరకూ పేర్కొంది ఆ బ్యాంకు. ఆ పైన వేలం పాట సాగనుంది. ట్రాన్స్ ట్రాయ్ కు జారీ చేసిన రుణానికి రాయపాటి గ్యారెంటీగా ఉండటంతో ఈ ఇంటిని వేలం వేస్తున్టన్టుగా తెలుస్తోంది.

రాయపాటి సాంబశివరావు తెలుగుదేశం పార్టీ నుంచి ప్రస్తుత ఎన్నికల్లో నరసరావు పేట నుంచి ఎంపీగా పోటీలో ఉన్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో బ్యాంకులకు లోన్లను చెల్లించకుండా ఎగ్గొట్టిన వ్యవహారంలో ఈయన పేరు వినిపిస్తూ ఉండటం గమనార్హం. రాయపాటికి చెందిన ఈ ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ ఒక్క ఆంధ్రా బ్యాంకు కు అప్పుపడ్డ మొత్తమే ఏడు వందల కోట్ల రూపాయలకు పైనే అని తెలుస్తోంది. ఇప్పుడు ఇల్లు వేలం వేసినా వచ్చే డబ్బు అందులో వందో వంతు మాత్రమేనేమో!