కమలాలు.. వలస వెళ్లాల్సిందేనా?

Mon May 14 2018 05:47:05 GMT+0530 (IST)

కన్నా లక్ష్మీనారాయణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నియమితులు కావడం పట్ల ఆ పార్టీలోనే విపరీతమైన అసంతృప్తి రేగుతోంది. రాష్ట్రంలో ఆరెస్సెస్ కు మూలస్తంభాలుగా నిలిచిన వ్యక్తులు భాజపాకు కొన్ని దశాబ్దాలుగా వెన్నుదన్నుగా ఉన్న నాయకులంతా ఈ పరిణామంపై కస్సుబుస్సులాడుతున్నారు. సుదీర్ఘ కాలంగా ఆరెస్సెస్ కీలక వ్యక్తులుగా ఉన్నప్పటికీ సమకాలీన పరిణామాలలో భాజపా నేతలం అని చెప్పుకోడానికే ఇష్టపడడం లేదు. చంద్రబాబునాయుడు చేసిన ప్రచారానికి భాజపాకు రాష్ట్రంలో భవిష్యత్తు ఉండకపోవచ్చుననే వారు కూడా నమ్ముతున్నారు. అసలే పరిస్థితులు వికటించి ఉన్న ఇలాంటి సమయంలో.. కేవలం ఒకే కులాన్ని నమ్ముకుని రాష్ట్రంలో రాజకీయం చేస్తాం అన్నట్లుగా భాజపా అధిష్టానం తీసుకున్న నిర్ణయం పలువురిని కలవరపరుస్తున్నది. పార్టీని వీడిపోవడానికే పలువురు నిర్ణయించుకుంటున్నట్లు తెలుస్తోంది.భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో దయనీయంగా ఉంది. అసలే ముక్కిడి ఆపై పడిశం అన్నట్లుగా కన్నా లక్ష్మీనారాయణ నియామకం తయారైందని సమాచారం. మొన్నటిదాకా సోము వీర్రాజుకే ఆ పదవి అన్నట్లుగా బీభత్సంగా ఊరించారు. దాంతోనే కన్నా పార్టీకి రాజీనామాచేసి వెళ్లిపోవడానికి కూడా రంగం సిద్ధం చేసుకున్నారు. తీరా ఆయనను బుజ్జగించి మరీ.. అధ్యక్షపదవిని అప్పగించాల్సినంత అవసరం ఏమున్నదని పలువురు ప్రశ్నిస్తున్నారు. కన్నా లక్ష్మీనారాయణ నియామకం ఉత్తర్వులు వెలువడిన నాటినుంచి సోము వీర్రాజు అలకపూని అజ్ఞాతంలోకి వెళ్లినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఆయనకు కూడా రాష్ట్రస్థాయి ఎన్నికల నిర్వహణ కమిటీ సారథి బాధ్యతలు ఇచ్చినప్పటికీ అలక వహించారంటే... దాని అర్థం ఏమిటి?  పదవులు వచ్చిన వారు కూడా అలుగుతోంటే.. పదవులు రాకుండా.. ఆయనను మించి పార్టీకి సేవ చేసిన వారు ఎంత బాధపడాలి అనే ప్రశ్నలు పార్టీలో వినిపిస్తున్నాయి.

ఇప్పటికే పలువురు నాయకులు ఇతర పార్టీల బాట చూసుకుంటున్నారు. అలాంటి నేపథ్యంలో తాజా నియామకాలు రాష్ట్ర భాజపా నాయకులు పలువురరిని కూడా పార్టీ వీడిపోయేలా చేస్తాయనే ప్రచారం బలంగా వినిపిస్తోంది.