Begin typing your search above and press return to search.

బాబుకు ఇంకో ప‌క్క‌లో బ‌ల్లెం

By:  Tupaki Desk   |   24 Aug 2016 11:41 AM GMT
బాబుకు ఇంకో ప‌క్క‌లో బ‌ల్లెం
X
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌త్య‌ర్థుల జాబితా పెరిగిపోతోంది. పొరుగు రాష్ట్రమైన తెలంగాణ‌తో ఇప్ప‌టికే పేచీలు కొన‌సాగుతుండ‌గా తాజాగ మ‌రో ప‌క్క రాష్ట్రమైన త‌మిళ‌నాడు ఇదే వ‌రుస‌లో చేరింది. కొద్దికాలం క్రితం వ‌ర‌కు కొన‌సాగి స‌ద్దుమ‌ణిగింది అనుకుంటున్న పాలారు న‌ది చెక్ డ్యాం వివాదం మ‌ళ్లీ తెర‌మీద‌కు వ‌చ్చింది. పీఎంకే యువ నాయ‌కులు అన్భుమ‌ణి రాందాస్ ఈ వివాదాన్ని మొద‌లుపెట్టారు. కాంచీపురం కలెక్టరు కార్యాలయం సమీపంలో పార్టీ పడమర జిల్లా ఆధ్వర్యంలో పీఎంకే పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు - మాజీ కేంద్ర మంత్రి డాక్టరు అన్బుమణి రాందాస్‌ నిర‌స‌న చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా బాబు స‌ర్కారుపై విమ‌ర్శ‌లు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకర్తలతో కలిసి నినాదాలు చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తమిళనాడు సరిహద్దులోని పాలారు నదిలో చెక్‌ డ్యాం ఎత్తు పెంచడాన్ని తాము వ్య‌తిరేకిస్తున్న‌ట్లు అన్భుమ‌ణి రాందాస్ స్ప‌ష్టం చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం నదుల హక్కులను ప‌ట్టించుకోకుండా ఇతర రాష్ట్రాలతో వివాదం పెట్టుకుంటోంద‌ని ఆయ‌న‌ ఆరోపించారు. బాబు ఆ విధంగా హ‌క్కులు హరిస్తుంటే త‌మిళ‌నాడు రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోందని - నదుల హక్కులను కాపాడే వరకు పీఎంకే పోరాటం కొనసాగిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర సరిహద్దులోని పుళ్లలూరు వద్ద ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం పాలారు నదిలో చెక్‌ డ్యాం ఎత్తు పెంచడానికి నిరసనగా గ‌త నెల‌లోనే ఆందోళ‌న చేశామ‌ని చెప్పారు. ఆంధ్రా ప్రభుత్వం చట్ట వ్యతిరేకంగా కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి లేకుండా ఈ పనులు చేపడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోందని విమర్శించారు. 50 సంవత్సరాలుగా రాష్ట్రంలో సుమారు 223 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తున్న పాలారు నదిలో నీటిని నిల్వ ఉంచడానికి ఒక డ్యాం కూడా నిర్మించలేదని ఆరోపించారు. తమిళనాడులో పాలారు - కావేరి - తమ్రబరణి తదితర నదులు ప్రవహస్తున్నప్పటికీ ఆ నదుల్లో ప్రవహించే నీటిని సముద్రంలో కలిసిపోకుండా అడ్డుకోవడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని రాందాస్ ధ్వజమెత్తారు. కర్నాటక ప్రభుత్వం చెక్‌ డ్యాంలను నిర్మించిందని, కొత్తగా మేఘదాతు రిజర్వాయరు పనులు చేపడుతున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి సిద్ధరామయ్య ప్రకటించారని రాందాస్‌ గుర్తుచేశారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగకుండా ప్రధానిని కలవడానికి రాష్ట్ర ప్రభుత్వం అఖిల పక్షాన్ని తీసుకెళ్లాలని అన్భుమ‌ణి కోరారు. లేదంటే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించే వరకు పోరాడుతామని హెచ్చరించారు.