మోడీ హిందువే కాదు-ప్రకాష్ రాజ్

Sun Jan 21 2018 13:42:40 GMT+0530 (IST)

భారత ప్రధాని నరేంద్ర మోడీ హిందువే కాదని విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ అన్నాడు. మోడీ మాత్రమే కాక భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా కూడా హిందువు కాదని ఆయన వ్యాఖ్యానించాడు. ‘ఇండియా టుడే’ సదస్సులో భాగంగా ప్రకాష్ రాజ్.. మోడీ మీద.. మోడీ సర్కారు మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. తనపై చేస్తున్న విమర్శలు.. ఆరోపణలకు బదులిస్తూ.. మోడీ తీరును ఆయన దుయ్యబట్టారు. ఆ వేదికపై ఆయన ఏమన్నారంటే..‘‘హిందువులకు వ్యతిరేకంగా తీస్తే మీరు ప్రశ్నించవచ్చు. కానీ ఆ సినిమా తీసిన వ్యక్తి ఇందులో మతానికి సంబంధించిన అంశాలేమీ లేవని అంటున్నాడు. కానీ ఇది యాంటీ హిందూ అని చెబుతున్నారు. కొన్ని రోజుల కిందట నేను ఒక వేదిక మీద.. కేంద్ర మంత్రి రాజ్యాంగాన్ని మార్చాలన్న వ్యాఖ్యల్ని ఖండిస్తూ మాట్లాడాను. దీంతో బీజేపీ వాళ్లు వెళ్లి గోమూత్రంతో ఆ ప్రాంగణాన్ని శుద్ధి చేశారు. మరి నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి ఇలాగే శుద్ధి చేస్తారా? నేను ఆవు మాంసం తినేవాడినని.. అందుకే గోమూత్రంతో శుద్ధి చేశామని అంటున్నారు. కానీ నేను ఆ వేదిక మీద బీఫ్ గురించి మాట్లాడనే లేదు. నన్ను హిందూ వ్యతిరేకిగా ముద్ర వేస్తున్నారు. కానీ నేను హిందూ వ్యతిరేకిని కాదు.. మోడీ-అమిత్ షాల వ్యతిరేకిని. హెగ్డే వ్యతిరేకిని.

నేను కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎన్నో ఎకరాల భూమి తీసుకుంటున్నానని.. అందుకే ఇలా మాట్లాడుతున్నారని వాళ్లు ఆరోపిస్తున్నారు. కానీ నేను గత మూడ దశాబ్దాల్లో ఐదు రాష్ట్రాల్లో 300కు పైగా సినిమాలు చేశాను. ఎంతో సంపాదించాను. ఇప్పుడు ప్రభుత్వాల మీద ఆధారపడాల్సిన అవసరమేంటి? నేను ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని.. ఆరు ఎకరాల నా స్థలాన్ని స్కూల్ కట్టడానికి ఇచ్చాను. రెండెకరాల నా భూమే ఇచ్చి కమ్యూనిటీ హాల్ కట్టిస్తున్నాను. కానీ వాళ్లేమో నేను బెంగళూరులో భూమి కోసం ఇదంతా చేస్తున్నానని అంటున్నారు. హెగ్డే అనే మంత్రి ఒక ‘ఇజం’ను ఈ భూమి మీద లేకుండా చేస్తానని అంటున్నాడు. అలా అనేవాడు హిందువే కాదు. దేన్నయినా చంపాలనుకునేవాడు హిందువే కాదు.

నా స్నేహితురాలు గౌరీ లంకేష్ ను హత్య చేసినపుడు కొందరు వేడుక చేసుకున్నారు. ఐతే ఒక ప్రధానిగా ఉంటూ మోడీజీ ఈ విషయాన్ని ఖండించలేదు. ఇలా వేడుక చేసుకోవద్దని ఎవరినీ ఆపలేదు. అలాగే ఒక కేంద్ర మంత్రి ఒక మతాన్నే లేకుండా చేస్తానని ప్రకటన చేస్తే దాన్ని ప్రధాని ఖండిచలేదు. ఆయన్ని ఆపలేదు. ఒక ప్రధానిగా అది ఆయన బాధ్యత. నేను మోడీకి ఓటు వేసి ఉండొచ్చు. వేయకపోయి ఉండొచ్చు. కానీ ఆయన నా ప్రధాని. ఆ పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి విషయాల్ని ఖండించాలి. ఆపాలి. కానీ ఆయనదేమీ చేయట్లేదు. ఇలా ఏ హిందువూ ఉండడు. ఇలాంటివాటిని ప్రోత్సహించడు. అందుకే మోడీ హిందువే కాదని అంటాను’’ అని ప్రకాష్ రాజ్ ముగించాడు.