Begin typing your search above and press return to search.

త‌న కాపురంలో చిచ్చు వ‌ద్ద‌ని ఆనం ఫైర్‌

By:  Tupaki Desk   |   26 July 2016 10:58 AM GMT
త‌న కాపురంలో చిచ్చు వ‌ద్ద‌ని ఆనం ఫైర్‌
X
రాజ‌కీయ నేత‌ల్లో త‌న‌దైన శైలితో సంచ‌ల‌నాలు సృష్టించ‌డం - విప‌క్షంపై విరుచుకుప‌డ‌డం ఆనం సోద‌రుల్లో ఒక‌రైన వివేకానంద రెడ్డికి క‌లిసొచ్చిన విష‌యాలు. విష‌యం ఏదైనా ఆయ‌న మీడియాలో హైలెట్ కావాల్సిందే. హిజ్రాల‌తో డాన్స్ చేసినా.. ఆయ‌న‌కే చెల్లింది. ఇప్పుడు తాజాగా ఈ నెల్లూరు రాజ‌కీయ నేత ఓ టీవీ యాంక‌ర్‌ కు ద‌ణ్ణం పెడ‌తాన‌ని బ‌తిమాలుకున్నారు. ఆ విష‌యం గురించి త‌న‌ను టెంప్ట్ చేయొద్ద‌ని వేడుకున్నారు. అయినా.. స‌ద‌రు యాంక‌ర్‌ గారు విష‌యాన్ని వ‌దిలిపెట్ట‌క‌పోవ‌డంతో.. నాయబ్బా... ఎందుకు నా తండ్రా... ఇట్లాంటి ప్రశ్నలు వేస్తావు అని త‌న‌దైన స్టైల్లో సుతిమెత్త‌గా విరుచుకుప‌డ్డారు. ఇంత‌కీ ఆ విష‌యం ఏంటో చూద్దాం.

ఓ ప్ర‌ముఖ టీవీ ఛానెల్ యాంక‌ర్ జాఫ‌ర్ ఆనంతో ముఖాముఖి కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి వ‌చ్చిన ఆనం వ‌చ్చీరావ‌డంతోనే అన్నీ నిజాలే చెబుతాను... ఏదైనా అడుగు అంటూ యాంక‌ర్‌ కి ఛాన్స్ ఇచ్చేశారు. ఇంకేముంది స‌ద‌రు యాంక‌ర్ గారు విప‌రీత స్థాయిలో రెచ్చిపోయి.. వివేకాకు సంబంధించిన ప‌ర్స‌న‌ల్ విష‌యాల‌ను ట‌చ్ చేశారు. పెళ్లి కాకముందు ఉన్న లవ్ ఎఫైర్ గురించి చెప్పాల‌న్నారు. అంతేనా? ఆ అమ్మాయి మిమ్మల్ని ఎందుకు ప్రేమించలేదని వివేకాకు మ‌తిపోయే ప్ర‌శ్న‌ను సంధించారు. అంతే, ఈ విష‌యాలు వివేకా గుండెను ట‌చ్ చేశాయో ఏమో.. ఒక్క‌సారిగా యాంక‌ర్‌ పై విరుచుకుప‌డిపోయారు. "దణ్ణం పెడతానయ్యా నీకు. ఎందుకయ్యా నన్ను సతాయిస్తావ్. నాయబ్బా... ఎందుకు నా తండ్రా... ఇట్లాంటి ప్రశ్నలు వేసి మమ్మల్ని ఇరికించడం తప్ప ఏమైనా ఉందా? పెండ్లికి ముందు ఎప్పుడో సంగతి ఇప్పుడెందుకయ్యా?" అని ఎదురు ప్ర‌శ్నించారు.

అంత‌టితో ఆగ‌కుండా.. కాపురాల్లో చిచ్చు పెట్టే రకమయ్యా నువ్వు. నువ్వు మర్యాదస్తుడివి కాదయ్యా జాఫర్. నిజంగానే... కాపురంలో - మా కొంపల్లో చిచ్చు పెట్టడానికి నెల్లూరు వచ్చావు అంటూ తీవ్ర‌స్థాయిలో దుయ్య‌బ‌ట్టారు. అయినా వ‌దిలిపెట్ట‌కుండా జాఫ‌ర్ ప్ర‌శ్న‌ల‌తో ఉక్కిరి బిక్కిరి చేసేశారు. దీంతో వివేకా.. స‌మాధానం చెప్ప‌డం మొదలు పెడితే, అమ్మాయి ఎలా ఉందంటావు, పొడుగా? పొట్టా? అని అడుగుతావు. ఎందుకయ్యా ఈ ప్రశ్నలు అంటూ జాఫ‌ర్ నుంచి స‌ర‌దాగా త‌ప్పించుకున్నారు. అయితే, ఇదంతా కార్య‌క్ర‌మాన్ని చూస్తున్న వారికి క‌డుపుబ్బ న‌వ్వించడం గ‌మ‌నార్హం.