చంద్రబాబు చేతిలో ఆనం మోసపోయారట!

Mon Jul 17 2017 15:19:45 GMT+0530 (IST)

ఆనం బ్రదర్స్‌గా తెలుగు నేల రాజకీయాల్లో ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ఆనం వివేకానందరెడ్డి - ఆనం రామనారాయణరెడ్డిలు ఇప్పుడు ఎటూ కాకుండా పోయారన్న వాదన వినిపిస్తోంది. మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీ నేతలుగా కొనసాగిన ఈ అన్నాతమ్ముళ్లు... రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అడ్రెస్ గల్లంతు కావడంతో కొంతకాలం పాటు అదృశ్యమయ్యారు. ఆ తర్వాత వైసీపీలో చేరదామని వారు చేసిన యత్నాలు ఎందుకనో ఫలించలేదు. దీంతో చేసేదేమీ లేక... వారిద్దరూ టీడీపీలో చేరిపోయారు. అప్పటికే ఆపరేషన్ ఆకర్ష్ పేరిట ఇతర పార్టీల నుంచి నేతలను చేర్చుకునే కార్యక్రమానికి తెర తీసిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు... ఆనం బ్రదర్స్ వస్తామనగానే రెడ్ కార్పెట్ పరిచి మరీ ఆహ్వానం పలికారు. ఆ సందర్భంగా ఆనం బ్రదర్స్‌కు చంద్రబాబు పెద్ద హామీలే ఇచ్చారట. ఆనం రామనారాయణరెడ్డికి ఆత్మకూరు పార్టీ ఇన్ చార్జీ పదవితో పాటుగా గవర్నర్ కోటాలో ఆనం వివేకానందరెడ్డికి ఎమ్మెల్సీ అవకాశం కల్పిస్తానని చెప్పారట. దీంతో ఆనం బ్రదర్స్ కూడా ఒకింత సంతోషం వ్యక్తం చేస్తూనే టీడీపీ కండువా కప్పుకున్నారు.

అప్పటికిదాకా ఎవరినైతే చెడామడా తిట్టేశారో... వారి పక్కనే ఆనం బ్రదర్స్ చేరిపోయారు. బాబు ఇచ్చిన హామీ మేరకు ఆనం బ్రదర్స్ టీడీపీ కండువా కప్పుకోగా... వారికి ఇచ్చిన హామీలను మాత్రం చంద్రబాబు మరిచిపోయారట. నియోజకవర్గ ఇన్ చార్జీ పదవిదేముంది... ఒక్క మాటతో ఇచ్చేయొచ్చు. అందుకే కాబోలు... నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జీగా ఆనం రామనారాయణరెడ్డిని నియమిస్తూ చంద్రబాబు ప్రకటన చేశారు. అయితే ఆనం వివేకానందరెడ్డికి ఇస్తానన్న ఎమ్మెల్సీ గిరీ మాత్రం ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో పార్టీలో చేరి చాలా కాలమే అయినా... తనకు ఇచ్చిన హామీని చంద్రబాబు వాయిదా వేస్తూ పోతుండటాన్ని జీర్ణించుకోలేని ఆనం వివేకానందరెడ్డి ఎట్టకేలకు నోరు విప్పక తప్పలేదు. నేటి ఉదయం తన సన్నిహితులతో సమావేశమైన ఆనం వివేకా... చంద్రబాబు వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా చంద్రబాబుపై వివేకా ఘాటు కామెంట్లు చేశారనే వాదన కూడా వినిపిస్తోంది.

పార్టీలో చేరిన సందర్భంగా పదవులు ఇస్తానని చెప్పిన చంద్రబాబు... ఆ తర్వాత ముఖం చాటేయడమేమిటని ఆనం ప్రశ్నించారట. చంద్రబాబు వ్యవహార సరళి చూస్తుంటే... తాను టీడీపీలో చేరి తప్పు చేశానని కూడా ఆయన వ్యాఖ్యానించారట. సుదీర్ఘ కాలంగా కొనసాగిన కాంగ్రెస్ పార్టీని వీడి వచ్చిన తాను చంద్రబాబు చేతిలో నిలువునా మోసానికి గురైనట్లుగా కూడా ఆనం కాస్తంత తీవ్ర వ్యాఖ్యలే చేశారట. అయినా వివేకాకు ఎమ్మెల్సీ సీటు దక్కదన్న విషయం ఎలా తెలిసిందన్న విషయానికి వస్తే... ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో ఓ స్థానం ఉండగా... దానిని సిట్టింగ్ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డికి ఇస్తూ చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అవకాశం కల్పిస్తామని చంద్రబాబు చెప్పడంతో నాడు వివేకా సర్దుకుపోయారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ భర్తీ కూడా రానే వచ్చింది.

ఇప్పుడు గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ సీట్లు ఉన్నాయి. వీటిని పార్టీ సీనియర్ నేతలు రామసుబ్బారెడ్డి ఎన్ఎండీ ఫరూక్‌లకు ఇచ్చేందుకు చంద్రబాబు దాదాపుగా నిర్ణయం తీసుకున్నారు. నంద్యాల ఉప ఎన్నికలో ముస్లింల ఓట్లను రాబట్టుకునేందుకు ఫరూక్‌కు అవకాశం కల్పిస్తుండగా కడప జిల్లాలో వైసీపీ నుంచి వచ్చిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంతో అసంతృప్తి వ్యక్తం చేసిన రామసుబ్బారెడ్డిని చల్లబరిచేందుకు ఇంకో సీటును ఆయనకు ఇస్తున్నారు. ఈ లెక్కలన్నీ తెలుసుకున్న వివేకా... చంద్రబాబు తనను మోసం చేశారని భావిస్తున్నారు. పార్టీ అధినేతపైనే తీవ్ర వ్యాఖ్యలు చేసిన వివేకాపై టీడీపీ అధిష్ఠానం ఎలా వ్యవహరిస్తుందో చూడాలి.