ఇంతకీ చంద్రబాబుది ఈ దేశమేనా?

Sat Nov 17 2018 20:30:07 GMT+0530 (IST)

ఏపీ సీఎం చంద్రబాబునాయుడి పై వైసీసీ నేత - మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విరుచుకుపడ్డారు. ముఖ్యంగా సీబీఐని రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకోవాలన్న చంద్రబాబు నిర్ణయాన్ని ఆయన తప్పుపట్టారు. భారత రాజ్యాంగాన్నే ఎదిరించే స్థాయికి చంద్రబాబు తెగబడ్డారని - ఆయన అధికారంలో ఉన్న ప్రతిసారీ రాజ్యాంగ బద్ధమైన సంస్థలను పనిచేయనీకుండా అడ్డుకోవడం అలవాటేనని ఆయన ఆరోపించారు. ఆయననే రాజ్యాంగ వ్యవస్థలను నీరుగారుస్తూ ఆయనే అడ్డుకుంటూ మళ్లీ సేవ్ డెమొక్రసీ అంటూ దేశమంతా తిరగడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. ఇంతకీ చంద్రబాబు తాను ఈ దేశంలో భాగమే అనుకుంటున్నారో లేదో తెలియడం లేదన్నారు. 40 ఏళ్ల రాజకీయ జీవితం తనది చెప్పుకొని తిరిగే చంద్రబాబు నలభయ్యేళ్ల జగన్ మోహన రెడ్డిపై ఎందుకంత కక్ష పెంచుకున్నారని ఆనం ప్రశ్నించారు.
   
ఆంధ్రప్రదేశ్ కు గజ తుపాను వల్ల ముప్పు తప్పినప్పటికీ ప్రజలకు ఆ సంతోషం మిగలడం లేదని.. చంద్రబాబు పాలన కారణంగా రాష్ట్ర ప్రజలు గజను మించి గజగజ వణికే పరిస్థితి ఉందని ఆయన ఎద్దేవా చేశారు.  అవినీతి పరులు పన్ను ఎగవేతదారులపై ఐటీ దాడులు జరిగితే చంద్రబాబు ఎందుకు ఉలిక్కి పడుతున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర హైకోర్టు చంద్రబాబుపై విచారణకు ఆదేశిస్తే అప్పుడు హైకోర్టును కూడా ఏపీలో నిషేధిస్తారా అని ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డికి భయపడి ఎన్ డీఏను విడిచి యూపీఏలోకి బతిమాలుకుని వెళ్లారన్నారు.
   
మరో రెండు నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్న సమయంలో చంద్రబాబును దింపడానికి కుట్రలు చేయాల్సిన అవసరం వైసీపీకి ఏముందని ఆనం ప్రశ్నించారు. కుట్రలు చేయడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. ప్రతిపక్ష నేతను చంపించేందుకు కుట్ర పన్నిన చంద్రబాబు మిగతా అందరినీ కుట్రదారులు అనడం విచిత్రంగా ఉందన్నారు ఆనం.