Begin typing your search above and press return to search.

అపోలోకు షాకిచ్చిన అమృత!

By:  Tupaki Desk   |   18 Jan 2018 2:41 PM GMT
అపోలోకు షాకిచ్చిన అమృత!
X
గ‌త ఏడాది డిసెంబ‌రు 5న‌ తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణించారని అపోలో ఆసుప‌త్రి వ‌ర్గాలు ప్ర‌క‌టించిన విష‌యం విదిత‌మే. అయితే, వాస్త‌వానికి 2016 డిసెంబర్ 4వ తేదీనే అమ్మ మ‌ర‌ణించార‌ని, లా అండ్ ఆర్డ‌ర్ ప్రాబ్ల‌మ్ రాకుండా ఉండేందుకే ఒక రోజు ఆల‌స్యంగా ఆ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశార‌ని శశికళ సోదరుడు దివాకరన్...నిన్న‌ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. దివాక‌ర‌న్ వ్యాఖ్య‌ల‌తో షాక్ లో ఉన్న అపోలో ఆసుప‌త్రి వ‌ర్గాల‌కు తాజాగా మ‌రో షాక్ త‌గిలింది. తాను జ‌య‌ల‌లిత కూతురిన‌ని ఆరోపిస్తోన్న అమృత ...ఆపోలో ఆసుపత్రి వర్గాలకు నోటీసులు పంపించి మ‌రో సంచ‌ల‌నానికి తెర‌లేపింది. జయలలిత ఆసుప‌త్రిలో ఉన్న‌ సమయంలో ఆమె రక్త నమూనాలు - చర్మం - తల వెంట్రుకలు సేకరించారో లేదో తెల‌పాల‌ని నోటీసులలో కోరింది. దివాక‌ర‌న్ మీడియా ముందుకు వ‌చ్చిన 24 గంట‌లు తిర‌గ‌క ముందే అమృత ...అపోలో వ‌ర్గాల‌కు నోటీసులు జారీచేయ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

తాను జయలలిత కుమార్తె అంటూ బెంగళూరుకు చెందిన అమృత సుప్రీం త‌ల‌పు త‌ట్టిన సంగ‌తి తెలిసిందే. అయితే, సుప్రీం సూచ‌న‌ల ప్ర‌కారం అమృత....మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. అవ‌స‌ర‌మైతే త‌నకు డీఎన్ ఏ పరీక్షలు నిర్వహించాలని కోరారు. దీంతో, అమృత-జయలలిత ల సంబంధంపై విచార‌ణ జ‌ర‌పాల‌ని తమిళనాడు స‌ర్కార్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీంతో, అమృత కుటుంబ సభ్యులు - నేపథ్యం - బంధువులు త‌దిత‌ర సమాచారాన్ని ఇంటలిజెన్స్ అధికారులు సేక‌రిస్తున్నారు. అయితే, అమృత-జయలలిత ల సంబంధం గురించి తెలుసుకోవ‌డానికి డీఎన్ ఏ ప‌రీక్ష చేయ‌డం త‌ప్ప‌నిస‌రి. దీంతో, జయలలిత సమాధిని తవ్వి శాంపిల్స్ సేకరించాల‌ని అమృత న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ నేప‌థ్యంలో ఒక‌వేళ జయలలిత అపోలోలో చికిత్స పొందుతున్న‌పుడు ఆమె రక్త నమూనాలు - చర్మం - తల వెంట్రుకలు సేక‌రించారో లేదో తెలియ‌జెప్పాల‌ని అపోలో ఆసుపత్రికి అమృత నోటీసులిచ్చారు. దివాక‌ర‌న్ ఆరోప‌ణ‌లు - అమృత నోటీసులపై అపోలో ఆసుపత్రి వర్గాల స్పంద‌న ఏవిధంగా ఉంటుందో అన్న అంశంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి ఏర్ప‌డింది.