అమృతకు అబద్ధం చెప్పాను:డాక్టర్ జ్యోతి!

Tue Sep 18 2018 18:58:30 GMT+0530 (IST)

మిర్యాల గూడలో పట్ట పగలు ఓ ఆసుపత్రి ముందు ప్రణయ్ దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. తన భార్య అమృతకు చెక్ అప్ చేయించుకొని ఆసుపత్రి నుంచి బయటకు వెళుతోన్న ప్రణయ్ వెనుక నుంచి వచ్చిన దుండగుడు దారుణంగా హత్య చేశాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఆ ఆసుపత్రిలో అమృతకు చెకప్ చేసిన డాక్టర్ జ్యోతి...ఆ దారుణ ఘటన గురించి ఓ మీడియా చానెల్ కు వెల్లడించారు. మారుతిరావు కుటుంబంతో తనకు 20ఏళ్లుగా పరిచయం ఉందని - తాను ఆ ఫ్యామిలీ డాక్టర్ అని చెప్పారు. మారుతీరావు దంపతుల పెళ్లయిన చాలాకాలానికి అమృత పుట్టిందని - అందుకే ఆమెను అల్లారు ముద్దుగా పెంచారని చెప్పారు. వారి కుటుంబంలో చాలామంది తన హాస్పటల్ లో డెలివరీ అయ్యారని - తాను ఆ ఫ్యామిలీ ఫ్రెండ్ అని చెప్పారు. అమృత  తనను ఆంటీ అని పిలిచేదని - వారి పెళ్లి విషయం సోషల్ మీడియాలో చూసి తెలిసిందని చెప్పారు.ఆమె గర్భందాల్చాక భయపడుతూ తొలిసారి తన దగ్గరకు వచ్చిందని - ఒక డాక్టరుగా - ఫ్యామిలీ ఫ్రెండ్ గా...ఇలా రెండు రకాలుగా ఆమెను ట్రీట్ చేశానని చెప్పారు. అమృత అంటే మారుతీరావుకు పిచ్చి ప్రేమ అని - చెకప్ కు వచ్చిన ప్రతిసారి తనకు ఫోన్ చేసి అడిగే వారని చెప్పారు. ఆ ఘటన జరిగిన రోజు కూడా ఆయన తనకు ఫోన్ చేశారని అన్నారు. ఆ రోజు కూడా ప్రణయ్ - అమృత చెకప్ చేయించుకుని వెళ్లారని...వెళ్లిన 5నిమిషాలకే అమృత తన దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చిందని అన్నారు. తనకు విషయం చెప్పిన అమృత వెంటనే స్పృహ తప్పిపోయిందన్నారు. ప్రణయ్ కు ఫస్ట్ ఎయిడ్ చేసి హైదరాబాద్ పంపించానని - అమృతకు మాత్రం ఆ విషయం చెప్పలేదని అన్నారు. ఆమె ఉన్న పరిస్థితుల్లో తనకు అంతకన్నా మించిన మార్గం తోచలేదన్నారు. అమృతకు విషయం తెలిస్తే ఆమె ఏమైపోతుందోనని కంగారుపడ్డానని అన్నారు. అందుకే - బతికే ఉన్నాడని మొదట చెప్పామని....మరుసటి రోజు తానే ఆ విషయం చెప్పానని అన్నారు. ఆ విషయం తెలుసుకున్న తర్వాత మూడు గంటల పాటు అమృతను ఓదార్చానని చెప్పారు. తన ఆసుపత్రి ముందు ఈ ఘోరం జరగడం...తన కళ్ల ముందే ప్రణయ్ కొన ఊపిరితో కొట్టుమిట్టాడడం కలచి వేసిందన్నారు. ప్రణయ్ హత్యను అందరూ ఖండించాలన్నారు.