Begin typing your search above and press return to search.

అమిత్ షా 100 కోట్ల లంచం ఇవ్వ‌చూపారట‌

By:  Tupaki Desk   |   23 Nov 2017 7:45 AM GMT
అమిత్ షా 100 కోట్ల లంచం ఇవ్వ‌చూపారట‌
X
బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు తెర‌మీద‌కు వ‌చ్చాయి. ఏకంగా వంద కోట్ల రూపాయ‌లు లంచం ఇచ్చేందుకు షా ప్ర‌య‌త్నించార‌ని, అందులోనూ ఆయ‌న న్యాయ‌వ్యవ‌స్థ‌ను ప్రభావితం చేసేందుకు ఈ ప‌ని చేశార‌ని క‌ల‌క‌లం రేపే కామెంట్లు చేశారు. గ్యాంగ్‌ స్టర్‌ సోహ్రాబుద్దీన్‌ బూటకపు ఎన్‌ కౌంటర్‌ కేసు విచారణ చేస్తున్న జడ్జి బ్రిజ్‌ గోపాల్‌ హరికిషన్‌ లోయా(48) మృతిపై కుటుంబీకులు ఈ సంచలన విషయాలను వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆయన మృతి మిస్టరీయేనన్న అనుమానాలు కల్గుతున్నాయి.

పలు కేసుల్లో నిందితుడైన సోహ్రాబుద్దీన్‌ - అతడి భార్య కౌసర్‌ బీలను 2005 నవంబర్‌లో గుజరాత్‌ ఏటీఎస్‌ ఎన్‌ కౌంటర్‌ చేసింది. అయితే.. అది బూటకపు ఎన్‌ కౌంటర్‌ అని, కేసులో ఇప్పటి బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా సహా పలువురు పోలీసు ఉన్నతాధికారుల ప్రమేయముందనే ఆరోపణలొచ్చాయి. కాగా.. ఈ కేసు విచారణను సీబీఐ చేపట్టింది. 2014లో సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి హరికిషన్‌ లోయా ఈ కేసు విచారణకు నేతృత్వం వహిస్తున్న సమయంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. గుండెపోటు రావడంతోనే లోయా మృతి చెందినట్టు అధికారులు నిర్థారించారు. అయితే.. లోయా మృతి చెందిన మూడేండ్ల తర్వాత కుటుంబీకులు తొలిసారి మీడియా ముందుకొచ్చారు. ఓ మీడియా సంస్థతో లోయా సోదరి డాక్టర్ అనురాథా బియాని ఓ మీడియా సంస్థ‌తో న్యాయమూర్తి బ్రిజ్ గోపాల్ హర్కిషన్ లోయా కు 100కోట్ల రూపాయల లంచం ఇవ్వ చూపారని ఇప్పుడు సంచలన ఆరోపణలు చేశారు. లోయా మృతికి సంబంధించిన సమాచారాన్ని తొలుత ఈశ్వర్‌ బహేటి అనే ఆర్‌ ఎస్‌ ఎస్‌ కార్యకర్త తమకు చేరవేశాడని తెలిపారు. అంతేకాక, మృతదేహాన్ని సొంత గ్రామానికి తరలించేందుకు ఆయనే తగిన ఏర్పాట్లు చేశాడన్నారు. లోయా కాలర్‌పై రక్తపు మరకలు ఉండటమే కాక - బెల్టు నలిగిపోయి ఉన్నదని వారు వివరించారు. ప్యాంటు క్లిప్పు ఊడిపోయి ఉన్నట్టు కూడా గుర్తించామన్నారు.

కానీ, పోస్టుమార్టం రిపోర్టులో మాత్రం.. లోయా దుస్తుల పై ఎలాంటి మరకలు లేవని, గుండెపోటుతోనే ఆయన మృతి చెందారని వచ్చిందన్నారు. పోస్టుమార్టం తమ సమక్షంలో జరగలేదని లోయా సోదరి అను రాధ బియాని తెలిపారు. పోస్టుమార్టం డాక్యుమెంట్‌ పై వరుసకు సోదరుడయ్యే వ్యక్తి అని పేర్కొంటూ ఒక సంతకం ఉందని తెలిపారు. కానీ, ఆ వ్యక్తి ఎవరో తమకు తెలియదని చెప్పారు. లోయా మొబైల్‌ ఫోన్‌ కూడా ఈశ్వర్‌ నే తెచ్చి ఇచ్చినట్టు తెలిపారు. మరణ ధృవీకరణ పత్రంలో చనిపోయిన సమయం కూడా వేరుగా ఉన్నదని ఆమె అన్నారు. ఈ విషయాలన్నింటినీ విచారణ కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, గుజ‌రాత్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఈ ప‌రిణామాలు క‌ల‌క‌లంగా మారాయి.