Begin typing your search above and press return to search.

అమిత్ షాకు కొత్త పోస్టు

By:  Tupaki Desk   |   27 July 2017 5:36 AM GMT
అమిత్ షాకు కొత్త పోస్టు
X
ఢిల్లీ రాజ‌కీయాల్లో త‌మ ప‌ట్టు మ‌రింత‌గా బిగించేందుకు ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇంకో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే బీజేపీ జాతీయ ర‌థ‌సార‌థి హోదాలో స‌ర్వం తానై న‌డిపిస్తున్న అమిత్ షా ఇక రాజ్య‌స‌భ‌లోకి ఎంట్రీ ఇవ్వ‌నున్నారు. అమిత్ షా గుజరాత్ నుంచి రాజ్యసభకు ఎన్నిక కావడానికి రంగం సిద్ధమైంది. వచ్చేనెల ఎనిమిదో తేదీన జరిగే రాజ్యసభ ఎన్నికల్లో ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ ప్రధాని నరేంద్రమోడీ - అమిత్‌ షా తదితరులు హాజరైన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రమంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఐదుసార్లు గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికైన అమిత్‌షా.. రాజ్యసభలో అడుగు పెట్ట డం బీజేపీకి ప్రోత్సాహాన్నిస్తుందని భావిస్తున్నారు.

ఇక మరో స్థానానికి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అభ్యర్థిత్వాన్ని కూడా ఖరారు చేసింది. గుజరాత్ నుంచి రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. కాంగ్రెస్ సభ్యుడు అహ్మద్ పటేల్ కూడా తిరిగి పోటీ చేసే అవకాశం ఉంది. ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన శంకర్‌ సింగ్ వాఘేలా నుంచి మద్దతు లభిస్తుందని బీజేపీ భావిస్తోంది. ఇక ఇటీవల మరణించిన కేంద్ర మాజీ మంత్రి ఏఎం దవే స్థానంలో మధ్యప్రదేశ్ నుంచి గిరిజన నేత సంపాతియా ఉయికే అభ్యర్థిత్వాన్ని బీజేపీ ఖరారు చేసింది. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ - సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి - తృణమూల్ నేత డెరిక్ ఓ బ్రెయిన్‌ లతోపాటు మొత్తం 18 మంది సభ్యులు వచ్చేనెల 18న పదవీ విరమణ చేయనున్నారు.