బీజేపీ బంపర్ ఆఫర్ ను నితీశ్ స్వీకరిస్తారా?

Sat Aug 12 2017 14:39:53 GMT+0530 (IST)

బీహార్ ముఖ్యమంత్రి - జేడీయూ కీలక నేత నితీశ్ కుమార్ ఎప్పుడేలా వ్యవహరిస్తారోనన్న అంశంపై ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని యూపీఏకు మిత్రపక్షంగా వ్యవహరించిన జేడీయూ... నితీశ్ కుమార్ తీసుకున్న సింగిల్ నిర్ణయంతో ఆ కూటమికి వ్యతిరేక కూటమిగా ఉన్న ఎన్డీఏ వైపు మళ్లిపోవాల్సి వచ్చింది. ఇటీవలే జరిగిన రాష్ట్రపతి ఎన్నికల సమయంలో బీహార్ గవర్నర్ గా పనిచేస్తున్న రామ్ నాథ్ కోవింద్ ను తన అభ్యర్థిగా ఎన్డీఏ ప్రకటించిన నేపథ్యంలో నితీశ్ ఒక్కసారిగి తన రూటు మార్చేశారు. తమ రాష్ట్రానికి గవర్నర్ గా పనిచేస్తున్న వ్యక్తి రాష్ట్రపతిగా వెళితే అంతకంటే కావాల్సిందేముందని భావించిన నితీశ్... తన పార్టీ కీలక నేతలను కాదని కూడా తన ఓటును కోవింద్ కే వేశారు. పార్టీ ఓట్లను కూడా కోవింద్ కే వేయించారు.

రాష్ట్రపతి ఎన్నికలకు కాస్తంత ముందుగా బీహార్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీతో హోరాహోరీగా పోరాడిన నితీశ్... ఒక్కసారిగా తన రూటు మార్చేయడంతో అటు కాంగ్రెస్ పార్టీతో పాటు నితీశ్ కేబినెట్లో కీలక భూమిక పోషిస్తున్న ఆర్జేడీ కూడా షాక్ తిన్నాయి. అయితే ఈ విషయాన్ని ఏమాత్రం ఖాతరు చేయనట్టే వ్యవహరించిన నితీశ్... ఎన్డీఏతోనే ముందుకు సాగుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. నితీశ్ వ్యవహారం కూడా ఆ రీతిగానే సాగుతోన్న విషయాన్ని కూడా ఏ ఒక్కరు కాదనలేని విషయమే. అయినా సింగిల్ దెబ్బకే రూటు మార్చేసిన నితీశ్ ఇకపై యూపీఏ వద్దకు వెళ్లకుండా ఉండేలా చేసేందుకు ఎన్డీఏ కీలక అడుగులు వేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా ఎన్డీఏలో నితీశ్ కు కీలక పదవి ఇస్తే ఎలా ఉంటుందన్న విషయంపై చర్చలు జరగగా... ప్రధాని నరేంద్ర మోదీ - బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు ఓ కీలక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నిర్ణయం మేరకు... నితీశ్ ను ఎన్డీఏ కో-కన్వీనర్ గా నియమిస్తే బాగుంటుందని ఈ ఒక్క నిర్ణయంతో ఎన్డీఏ మరింతగా బలోపేతం అవుతుందని కూడా మోదీషాలు భావిస్తున్నారట.

నిన్న నితీశ్ ఢిల్లీ వెళ్లిన సందర్భంగా మోదీషాలను వేర్వేరుగా కలిసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా ఎన్డీఏలో కీలక భూమిక పోషించాలని అమిత్ షా నుంచి నితీశ్ కు ఓ బంపర్ ఆఫర్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ వార్తలు నిజమో కాదో తెలియదు గానీ... ఈ వార్తలు నిజమే అయితే నితీశ్ ఎలా స్పందిస్తారన్న అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే... ఇప్పటికే జాతీయ స్థాయి రాజకీయ వేత్తగా పేరున్న నితీశ్ కుమార్ కు మిస్టర్ క్లీన్ బిరుదు కూడా ఉంది. ఈ తరహా నేత ఎన్డీఏ యాక్టివ్ గా జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తే... జాతీయ రాజకీయాలు మరింత రంజుగా మారిపోవడం ఖాయమేనని చెప్పక తప్పదు. ఇదే జరిగితే జేడీయూ నేతృత్వంలో ఏర్పాటు కానున్న మహాఘటబంధన్ ఆదిలోనే మాయమవడం ఖాయమే. అయినా బీహార్ కు వరుసగా 15 ఏళ్ల పాటు సీఎంగా వ్యవహరిస్తున్న నితీశ్ కుమార్... ఆ రాష్ట్రంలో అప్పటిదాకా దారుణ మారణాలకు పాల్పడుతున్న గూండారాజ్ కు చెక్ పెట్టేశారు. ఈ క్రమంలో బీహార్ ను వదిలి మోదీషాలు ఆఫర్ చేసిన ఎన్డీఏ కో- కన్వీనర్ పదవిని చేపట్టేందుకు నితీశ్ ఏమాత్రం ఆసక్తి చూపుతారో చూడాలి.