Begin typing your search above and press return to search.

జ‌గ‌న్‌ మ‌ద్ద‌తు కోరిన అమిత్ షా

By:  Tupaki Desk   |   19 Jun 2017 2:24 PM GMT
జ‌గ‌న్‌ మ‌ద్ద‌తు కోరిన అమిత్ షా
X
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌ నాథ్‌ కోవింద్‌ ను ప్ర‌క‌టించిన బీజేపీ త‌మ అభ్య‌ర్థి విజ‌యం కోసం రంగంలోకి దిగింది. ఈ క్ర‌మంలో వివిధ ప‌క్షాల మ‌ద్ద‌తును కూడ‌గ‌ట్టేందుకు పార్టీ ర‌థ‌సార‌థి అమిత్ షా రాయ‌బారాలు మొద‌లుపెట్టారు. ముఖ్యంగా విప‌క్ష నేత‌ల‌కు చెందిన ఓట్ల‌ను త‌న ఖాతాలో వేసుకునేందుకు ప్ర‌య‌త్నాలు సాగిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా వైసీపీ అధినేత జగన్‌ కు ఫోన్ చేశారు.

వైఎస్ జ‌గ‌న్‌కు ఫోన్ చేసిన అమిత్ షా ఎన్డీఏ అభ్య‌ర్థిగా బ‌రిలో ఉన్న రామ్‌ నాథ్‌ కు మద్దతివ్వాలని కోరారు. దీనికి జగన్‌ సుముఖత తెలిపారు. రాష్ట్రపతి అభ్యర్థిగా దళిత నాయకుడిని ఎంపికచేయడం పట్ల జ‌గ‌న్‌ హర్షం వ్యక్తం చేశారు. ఎన్టీయే రాష్ట్రపతి అభ్యర్థికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని అమిత్‌ షాకు జగన్ హామీ ఇచ్చారు.

మ‌రోవైపు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ఆయా రాష్ర్టాల ముఖ్య‌మంత్రుల‌కు ఫోన్లు చేసి మద్ద‌తు కూడ‌గ‌ట్టే ప్ర‌య‌త్నం చేశారు. రాష్ట్రపతి పదవికి ఎన్‌ డిఎ అభ్యర్థిగా బీహార్‌ గవర్నర్‌ రామ్‌ నాథ్ కోవింద్‌ ను ఎంపిక చేసినట్లు ప్రధాని మోడీ బీహార్ సీఎం నితీశ్‌ కుమార్‌ కు ఫోన్‌ చేసి చెప్పారు. అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి కూడా మోడీ ఫోన్‌ చేసి ఈ విషయం చెప్పారు. ఎన్‌ డీఏ అభ్యర్థికి మద్దతునివ్వవలసిందిగా మోడీ వారిని కోరారు. ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు - తెలంగాణ సీఎం కేసీఆర్‌ కు సైతం ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ఫోన్ చేశారు. ఎన్డీఏ అభ్య‌ర్థికి మ‌ద్ద‌తుగా ఓట్లు వేయాల‌ని కోరారు. దీనికి ఇరు రాష్ర్టాల సీఎంలు అంగీక‌రించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/