Begin typing your search above and press return to search.

ఇది మోడీ వారి ఆపరేషన్ పోలో?

By:  Tupaki Desk   |   13 Sep 2019 5:38 AM GMT
ఇది మోడీ వారి ఆపరేషన్ పోలో?
X
ఆపరేషన్ పోలో అన్నంతనే అప్పుడెప్పుడో నిజాం నవాబుల మీద సర్దార్ పటేల్ చేసిన తెలంగాణ విమోచనం గుర్తుకువస్తుంది. 1948 సెప్టెంబరు 17న పటేల్ జరిపిన ఆపరేషన్ తో అప్పటివరకూ కొరుకుడుపడని రీతిలో ఉన్న నిజాం నవాబు.. భారత్ కు లొంగిపోవటం.. తన సంస్థానాన్ని భారత్ లో కలిపేందుకు ఓకే చేయటం తెలిసిందే. ఈ సన్నివేశాన్ని గుర్తుకు తెచ్చేలా.. ఈ సెప్టెంబరు 17న కమలనాథులు గులాబీ పార్టీపై ఆపరేషన్ పోలో లాంటి వ్యూహాన్ని సిద్ధం చేశారా? అన్న అనుమానం తలెత్తేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పక తప్పదు.

నాడు నిజాం నవాబు తీరుపై నాటి హైదరాబాద్ రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా టీఆర్ ఎస్ పార్టీలో అధినేతపై ఆగ్రహంతో ఉన్న నేతల్ని తమకు అనుకూలంగా మలుచుకొని గులాబీ బాస్ కు దిమ్మ తిరిగేలా షాకివ్వటానికి మోడీషాలు ఆపరేషన్ పోలో తరహాలో ప్లాన్ చేస్తున్నారా? అన్న సందేహం కలిగేలా తాజా పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లుగా చెప్పక తప్పదు.

నాడు నిజాం నవాబు మీద హైదరాబాద్ రాష్ట్ర ప్రజలు ఆగ్రహంతో ఉండి భారత్ లో కలిసేందుకు సిద్ధంగా ఉన్నట్లే..తాజాగా గులాబీ పార్టీకి చెందిన పలువురు నేతలు.. అధినేత కేసీఆర్ తీరుపై గుర్రుగా ఉండటమే కాదు.. ప్రజాప్రతినిధులమైన తమను పట్టించుకోకుండా.. అహంభావంతో వ్యవహరిస్తున్నారన్న వేదన అంతకంతకూ పెరుగుతోంది. దీన్నో అవకాశంగా మలుచుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు.

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ఎందుకు నిర్వహించరన్న క్వశ్చన్ తో తెలంగాణకు వస్తున్న అమిత్ షా.. అదే రోజున గులాబీ పార్టీకి దిమ్మ తిరిగేలా షాకిచ్చేందుకు సీక్రెట్ మిషన్ ను స్టార్ట్ చేశారంటున్నారు. గులాబీ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు.. మాజీ ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలను తమ పార్టీలోకి చేర్చుకునేలా వ్యూహరచన జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. నాడు నిజాం నవాబుకు ఢిల్లీ పెద్దలు ఆపరేషన్ పోలో పేరుతో ప్లాన్ చేస్తే.. తాజాగా బీజేపీ అగ్రనాయకత్వం తెలంగాణ మీద పట్టు తెచ్చుకోవటం కోసం అధికార గులాబీ పార్టీపై చేపట్టే నయా ఆపరేషన్ పోలోతో కేసీఆర్ కు దిమ్మ తిరిగేలా చేయటమే కాదు.. పార్టీ మీద పట్టు పూర్తిగా సడలిపోయేలా చేయటమే లక్ష్యమంటున్నారు. మరి.. కమలనాథులు చేపట్టిన ఆపరేషన్ కు గులాబీ బాస్ ఏదైనావిరుగుడు కనిపెడతారా? లేక.. ఛాన్స్ ఇస్తారా? అన్నది కాలమే బదులివ్వాలి.